బాలల అశ్లీల చిత్రాలు చూడటం నేరమే

Child pornography Watching is a crime– డౌన్‌లోడ్‌ చేసి నిల్వ చేయడం కూడా…
– పోక్సో చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
– ‘చైల్డ్‌ పోర్నోగ్రఫీ’ పదాన్ని వాడవద్దని కోర్టులకు ఆదేశం
– ఆర్డినెన్స్‌ తీసుకురావాలని పార్లమెంటుకు సూచన
– బాలల అశ్లీల చిత్రాలు చూడటం నేరమే
న్యూఢిల్లీ: పోక్సో చట్టం ప్రకారం బాలల పోర్నోగ్రఫీ చిత్రాలు, వీడియోలు చూడడం, వాటిని డౌన్‌లోడ్‌ చేసి నిల్వ చేసుకోవడం నేరమని సుప్రీంకోర్టు సోమవారం కీలకమైన తీర్పు ఇచ్చింది. బాలల అశ్లీల (పోర్నోగ్రఫీ) చిత్రాలు చూసి, వాటిని డౌన్‌లోడ్‌ చేసుకున్నంత మాత్రాన ఆ చర్యలను నేరంగా పరిగణించలేమంటూ మద్రాస్‌ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన త్రిసభ్య బెంచ్‌ తోసిపుచ్చింది. బాలలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు తీసుకొచ్చిన పోక్సో చట్టంపై సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పు వెలువరించింది.
కేసు పూర్వాపరాలు
తన మొబైల్‌లో చైల్డ్‌ పోర్నోగ్రఫీని డౌన్‌లోడ్‌ చేసుకున్న 28 సంవత్సరాల ఎస్‌.హరీష్‌ అనే యువకుడిపై నమోదు చేసిన కేసును గతంలో మద్రాస్‌ హైకోర్టు కొట్టివేస్తూ అతనిపై క్రిమినల్‌ చర్యలను కూడా రద్దు చేసింది. పిల్లలను శిక్షించడానికి బదులు వారికి సరైన విద్యా బుద్ధులు నేర్పించేలా సమాజం పరిణితి చెందాలని సూచించింది. మద్రాస్‌ హైకోర్టు తీర్పును ‘జస్ట్‌ రైట్‌ ఫర్‌ చిల్డ్రన్స్‌ అలయన్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చుతూ నిందితుడిపై క్రిమినల్‌ చర్యలు కొనసాగించాలని ఆదేశించింది. తీర్పు విషయంలో మద్రాస్‌ హైకోర్టు పొరపాటు చేసిందని, అందుకే దానిని పక్కన పెట్టి ఈ వ్యవహారాన్ని తిరిగి సెషన్స్‌ కోర్టుకు పంపుతున్నామని తెలిపింది.
కోర్టు ఏం చెప్పిందంటే…
చిన్న పిల్లలు అశ్లీలతతో ముడిపడిన సమాచారాన్ని ఎలక్ట్రానిక్‌ పరికరంలో డౌన్‌లోడ్‌ చేసుకుంటే అది పోక్సో చట్టంలోని సెక్షన్‌ 15 (3) ప్రకారం శిక్షార్హమవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలా అశ్లీల చిత్రాలు, వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకున్న వారు ఆ సమాచారాన్ని తెలియ జేయకపోయినా లేదా తొలగించకపోయినా ఐదు వేల రూపాయల జరిమానా తో పాటు శిక్ష కూడా పడుతుంది. ఆ సమాచారాన్ని ఇతరులకు వ్యాపింపజేస్తే (షేర్‌ చేస్తే) జరిమానాతో పాటు మూడు సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఒకవేళ ఏదైనా వ్యాపార ఉద్దేశంతో పిల్లల అశ్లీల వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకొని నిల్వ చేసుకుంటే ఏడు సంవత్సరాల వరకూ జైలు శిక్ష పడుతుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. చేసిన నేరం కంటే దాని వెనుక ఉన్న ఉద్దేశం నేరపూరిత చర్య అవుతుందని జస్టిస్‌ పార్దివాలా వ్యాఖ్యానించారు.
ఆ పదాన్ని ఉపయోగించొద్దు
‘చైల్డ్‌ పోర్నోగ్రఫీ’ అనే పదం స్థానంలో ‘చైల్డ్‌ సెక్స్యువల్‌ ఎక్స్‌ప్లాయిటేషన్‌ అండ్‌ అబ్యూజ్‌ మెటీరియల్‌’ (సీఎస్‌ఈఏఎం) అనే పదాన్ని ఉపయోగించా లని, ఇందుకోసం ఆర్డినెన్స్‌ తీసుకురావాలని పార్లమెంటుకు సుప్రీంకోర్టు సూచించింది. ఇకపై ఇచ్చే తీర్పులు, ఆదేశాలలో ‘చైల్డ్‌ పోర్నోగ్రఫీ’ అనే పదాన్ని ఉపయోగించవద్దని దేశంలోని అన్ని న్యాయస్థానాలకూ ఆదేశాలు జారీ చేసింది. బెంచ్‌ తరఫున జస్టిస్‌ పార్దివాలా తీర్పును చదివారు. అందులో కొన్ని ఆదేశాలు, కొన్ని సూచనలు ఉన్నాయి. కేసులో వాదనలు విన్న సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 19వ తేదీన తీర్పును రిజర్వ్‌ చేసి, ఇప్పుడు వెలువరించింది.

Spread the love