– పలు జిల్లాల్లో భారీ వర్షాలు
– పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
– తెగిన రోడ్లు, రాకపోకలకు అంతరాయం
– లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
– చెరువులను తలపిస్తున్న రహదారులు
– మున్నేరు వాగు ఉధృతితో నీటమునిగిన ‘ఖమ్మం’
– కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్.. నిలిచిపోయిన రైళ్లు
– వరదలో చిక్కుకుపోయిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణీకులు సురక్షితం
– సహాయక చర్యల్లో అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
– వరదల్లో చిక్కుకొని 10మంది మృతి
రాష్ట్రం జలదిగ్బంధనంలో చిక్కుకుంది. వర్షాలు, వరదల ధాటికి జనం బెంబేలెత్తు తున్నారు. చెరువులకు గండ్లు పడ్డాయి. రైల్వేట్రాక్‌లు కొట్టుకుపోయాయి. పదిమంది మృత్యువాత పడ్డారు. మూగజీవాల సంగతి సరేసరి. అనేకమంది నిరాశ్రయులయ్యారు. పంట పొలాల్లో ఇసుక, బురద మేటవేసింది. ప్రకృతి ప్రకోపాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం సహాయ చర్యల్ని చేపట్టింది. విద్యుత్, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక, నీటి పారుదల శాఖలు సహాయక చర్యల్ని చేపట్టాయి. భారీ వర్షాలు వాటికీ ఆటంకంగా మారాయి. రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి, దిశానిర్దేశం చేస్తున్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ప్రభుత్వోద్యోగులందరికీ సెలవుల్ని రద్దు చేశారు. సహాయ చర్యల్లో భాగస్వాములు కావాలని ప్రభుత్వం వారిని ఆదేశించింది. సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
నవతెలంగాణ-మఫిషల్ యంత్రాంగం
ఎడతెరిపి లేకుండా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టాయనుకునేలోపే మళ్లీ నిమిషాల్లో వాతావరణంలో మార్పులు వచ్చి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే సాధారణం కంటే ఎక్కువ శాతం వర్షాలు కురవడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ప్రజలు కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షాలతో పలు చోట్ల పంటలు దెబ్బతినగా… రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రహదారులన్నీ చెరువులను తలపిస్తుండగా, లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి.
వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంతోపాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వరదనీరు చేరుతోంది. దాంతో గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగులోకి భారీగా వరదనీరు చేరుతుండటంతో ఉధృతంగా ప్రవ హిస్తోంది. ఖమ్మం నగరం జలదిగ్బంధంలో ఉంది. పలు కాలనీలను వరద చుట్టు ముట్టడంతో ప్రజలు సహాయకచర్యల కోసం ఎదురు చూస్తున్నారు. రైల్వే ట్రాకులు నీట మునిగిపోవడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
‘ఖమ్మం’లో వరద బీభత్సం
ఖమ్మం జిల్లాలో చరిత్రలో కునివినీ ఎరుగని రీతిలో వరద బీభత్సం సృష్టించింది. దాదాపు 5000 ఇండ్లు నీట మునిగాయి. మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. కరుణగిరి ప్రాంతంలో 200పైగా ఇండ్లు పూర్తిగా మునిగిపోయాయి. కవిరాజ్‌నగర్ కాలనీ, ఇల్లందు క్రాస్‌రోడ్డు, జేసీ మాల్, సీఎంఆర్ మాల్, కోర్టు ఎదురుగా పెట్రోల్ బంక్ ప్రాంతాలు, మైసమ్మ గుడి వెనక ప్రాంతం, ఎస్సార్ కాలేజీ, నాగార్జున ఫంక్షన్ హాల్ ప్రాంతాలు నీటమునిగాయి.లో రాజీవ్ గృహకల్ప కాలనీని మున్నేరు వరద ముంచెత్తింది. ఓ అపార్డుమెంట్‌లో కుటుంబం చిక్కుకోగా.. వారిలో పిల్లలతో పాటు మహిళ, వృద్ధురాలు ఉన్నారు. వరద చుట్టుముట్టిన ఇంటి నుంచి రక్షించాలని బాధితులు అర్త నాదాలు చేస్తున్నారు. వెంకటేశ్వరనగర్‌లో ఓ ఇంటిలోకి నీరు చేరడంతో వారంతా ఇంటిపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. గణేశ్‌నగర్, దనవాయి గూడెం ప్రాంతాల్లోనూ చాలా ఇండ్లు నీట మునిగాయి. ఖమ్మం నగరంలోని ఎంపీ గార్డెన్‌లో 80 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారికి సాయం కోసం ఎదురుచేస్తున్నారు. కారేపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయంలోకి నడుములోతు వరద నీరు రావటంతో పై అంతస్తులో తలదాచుకున్న విద్యార్థులు. భయాందోళనతో విద్యార్దినులను తల్లిదండ్రులు ఇంటికి తీసుక వెళ్తున్నారు. కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంకు చెందిన దంపతులు పాలేరు వాగులో చిక్కుకొని గల్లంతయ్యారు, ప్రవాహంలో కొట్టుకుపోతున్న మరో యువకుడిని స్థానికులు, పోలీసులు రక్షించారు. చింతకాని మండటలం నేరడలో వరద తీవ్రతను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పరిశీలించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం పట్టణంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితుల సమస్యల వింటూ అధికారులకి తక్షణమే ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాగా, వరద ప్రాంతాలను పరిశీలించిన సీపీఐ(ఎం) నేలు.. ఖమ్మంలో కాడ్రా ఏర్పాటు చేసి చెరువులు, పార్కులు, ప్రభుత్వం స్థలాలను ఆక్రమించి కట్టిన బిల్డింగ్‌లను కూల్చాలన డిమాండ్ చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణం పూర్తిగా జలమయం అయింది. కుందరాయినగర్, ఆదర్శనగర్, కాళీమాత ఏరియా, పైలట్ కాలనీ, వినాయక్ నగర్, ఆశోక్‌నగర్ తదితర లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద నీటితో విష సర్పాలు ఇండ్లలోకి చేరడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మణుగూరు ప్రధాన రహదారిపై అర కిలోమీటరు మేర వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముంపు ప్రభావిత ప్రాంతాలను అధికారులు సందరిÊశంచి సహాయక చర్యలు చేపట్టారు. అశ్వాపురంలో తుమ్మలచెరువు వెంకటాపురంలో వాగు ఉధృతికి ఇద్దరు వృద్ధులు కొట్టుకుపోయారు. 200 మేకలు, 20 పశువులు నీటిలో కొట్టుకుపోయి మృత్యువాతపడ్డాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు
వరంగల్ జిల్లాలో వరంగల్-ఏటూర్‌నాగారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్-హైదరాబాద్ హైవేపై రఘునాధపల్లి వద్ద వరద నీరు చేరడంతో కొన్ని గంటలపాటు రవాణా నిలిచిపోయి, భారీగా ట్రాఫిక్ జామయింది. జనగామ డీసీపీ రాజు మహేద్రనాయక్ నేతృత్వంలో పోలీసులు జాతీయ రహదారిపై డివైడర్లను జేసీబీతో తొలగించి వరద వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మొక్కజొన్న, వరి పొలాలు నీటమునిగాయి. చెరువులు తెగిపోయాయి. చలివాగు, మున్నేరు, ఆకేరు, పాకాల, జంపన్నవాగు, జీడి వాగు, దయ్యాల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆత్మకూరు మండలంలోని కటాక్షపూర్ మత్తడి పోటెత్తడంతో వరంగల్-ములుగు జాతీయ రహదారిపైకి భారీ వరద చేరింది. అప్రమత్తమైన పోలీసు, రెవెన్యూ అధికారులు వెంటనే అక్కడ పికెట్‌ను ఏర్పాటు చేశారు. మంత్రి సీతక్క వరద పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను ఆదేశించారు.
వరంగల్, హన్మకొండ నగరాల్లో భారీ వర్షాలు కురవడంతో నాలాలు పొంగిపొర్లాయి. హన్మకొండ బస్టాండ్ ప్రాంతం జలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హన్మకొండ-కాజీపేట ప్రధాన రహదారి ‘నిట్’ సమీపంలో త్రివేణి సూపర్‌మార్కెట్ వద్ద భారీ వరద చేరింది. హన్మకొండ తిరుమల జంక్షన్‌ను వరద ముంచెత్తింది. వరంగల్ నగరంలో 32, 33, 39 డివిజన్‌లలో లక్ష్మీనగర్, ఏకశిలానగర్, హనుమాన్‌నగర్ ప్రాంతాల్లో వరద ఇండ్లల్లోకి చేరింది. నిత్యావసర వస్తువులు తడిసిపోవడంతో కాలనీవాసులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. బీరన్నకుంట, ఎన్‌ఎన్ నగర్, గిరిప్రసాద్‌నగర్ ప్రాంతాల్లో ప్రజలు వరదముంపులో చిక్కుకున్నారు. వీరిని సురక్షిత ప్రాంతాలకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు తరలిస్తున్నారు. హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ విలీన గ్రామం రాజపేటకు చెందిన గువ్వ రాములు (58) ఆగస్టు 30న చేపలు పట్టడానికి స్థానిక పెద్దరికంట వాగుకి వెళ్లి తిరిగిరాలేదు. పెద్ద చెరువులో డ్రోన్ కెమెరాలతో వెతకగా రెండు రోజుల తర్వాత సమీప వరి పొలాల్లో మృతదేహం లభించింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన జర్రిపోతుల మల్లికార్జున్ (35) పశువుల కోసం వెళ్లి స్థానిక వాగులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గుండాల నరసయ్య చేపల వేటకు వెళ్లి గ్రామంలోని బర్లెరువులో గల్లంతయ్యారు. అలాగే కాటాపూర్‌లో పిడుగుపాటుకు గేదె మృత్యు వాతపడింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని కడవెండి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 150 గొర్రెలు ఆ వరదలో చిక్కుకొని కొట్టుకుపోయాయి. కాగా గొర్రెల కాపరులను గ్రామస్తులు జాగ్రత్తగా ఒడ్డున చేర్చారు.
వాగుల ఉధృతితో పోలీసుల సహాయకచర్యలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో మోస్తారు వర్షాలు కురవడంతో చెరువులు కుంటలు నిండుకుండల్లా మారాయి. సిద్దిపేట జల్లా మండల కేంద్రంలోని బెజ్జంకిలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న 70 ఏండ్ల నాటి వేప చెట్టు నేలకొరిగింది. గ్రామాల్లో చెరువులు,కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. బెజ్జంకి క్రాసింగ్ నుంచి మండల కేంద్రానికి వచ్చే ప్రధాన రోడ్డుపై ఈదులవాగు నీటి ప్రవాహంతో పొంగిపోర్లుతుండటంతో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ప్రయాణికులను వాగు దాటిస్తున్నారు. హుస్నాబాద్‌లోని కిరాణం, ఫర్టిలైజర్ తదితర షాపుల్లోకి వరద నీరు పోవడంతో షాపులన్నీ నిండుకుండల్లా మారాయి. ఆర్టీసీ డిపో ప్రహరీ గోడ కూలింది. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు మత్తడి పడటంతో పందిళ్ళ వాగుపై వరద నీటి ప్రవాహంలో రాకపోకలు నిలిచిపోయాయి. మద్దూరు మండలంలోని గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన బోయిని రజిత ఇల్లు, అక్కన్నపేట మండలం కపూర్ నాయక్ తండా పరిధిలోని పూసల తండాలో బాదావత్ బీమా నాయక్ (40) పెంకుటిల్లు, బెజ్జంకి మండల పరిధిలోని రేగలపల్లి, పెరుకబండ గ్రామాలకు చెందిన తాళ్ల ప్రసాద్, కొంపల్లి రాములు పెంకుటిండ్లు కూలిపోయాయి. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని క్రింది వాడకట్టుకు చెందిన మంద స్వరూప పెంకుటిల్లు కూలిపోయింది. కిష్టాపూర్ ఆల్ దీ డ్యామ్ నిండి పొంగిపొర్లుతుండటంతో గ్రామానికి ఉన్న రహదారిని తూప్రాన్ మున్సిపల్ అధికారులు మూసివేశారు. నిజాంపేట మండల కేంద్రం నుంచి చల్మెడ వెళ్లే రోడ్డులో కల్వర్టు పై నుండి నీరు వెళ్ళడంతో పోలీసు శాఖ ముళ్ళ కంపలను అడ్డంగా వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఏడుపాయల దుర్గాభవాని తలుపులు మూసి వేసి, భక్తులెవరూ దర్శనానికి రావొద్దని అధికారులు సూచించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో చేతికి వచ్చిన మినుము, పెసర పంటలు నీట మునిగిపోయాయి.
రహదారులు మునిగి రాకపోకలకు అంతరాయం
మహబూబ్‌నగర్ జిల్లాలోని హన్వాడ మండల పరిధిలోని ఎన్‌హెచ్ 167 తాండూర్ మహబూబ్‌నగర్ రోడ్డు తెగిపోయింది. మహ్మదాబాద్ ఇబ్రహీంబాద్ హైవే రోడ్డుపైన బ్రిడ్జి నిర్మాణం పనులు జరుగుతున్నాయి.మట్టిరోడ్లు తెగిపోయాయి. దాంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణ పేట జిల్లాలోని ఊట్కూర్ గ్రామ పెద్దచెరువు నిండి అలుగు పారుతుండటంతో మక్తల్- నారాయణ పేట ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి పై నుంచి నీరు పారి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గద్వాల జిల్లాలోని ఆంధ్ర తెలంగాణ రైల్వే బ్రిడ్జి వంతెన నారాయణపురం దగ్గర మునిగిపోవడంతో సమీప గ్రామాల్లోని ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. వనపర్తి జిల్లాలోని పెబ్బేరులోని శ్రీరంగాపురం రంగసముద్రం రిజర్వాయర్ గేట్లు ఎత్తడంతో వరి పొలాలు నీటిలో మునిగిపోయాయి. పెబ్బేరు మహబూపాల్ సముద్రం చెరువు నిండిపోయి పెద్ద పంపు వాగు దగ్గర భారీగా వరద నీరు చేరడంతో గ్రామాల్లో వరి పంటలకు నష్టం జరిగింది. పెబ్బేరు పురపాలక కేంద్రం ఒకటో వార్డు అంబేద్కర్ నగర్ కాలనీలో దేవమ్మ ఇల్లు కూలిపోవడంతో కూలిన ఇంటిని ఎమ్మెల్యే పరిశీలించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం మున్నూరు నుంచి శ్రీశైలం వరకు ఘాట్‌రోడ్డులో కొండచరియలు కూలే ప్రమాదకర పరిస్థితులున్నాయి. బల్మూరు మండలంలోని చౌటపల్లి, బాణాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బ్రాహ్మణపల్లిలోని చంద్రసాగర్ ప్రాజెక్ట్ అలుగు పారుతుంది. అచ్చంపేట మండలంలోని ఉమామహేశ్వరంలో కనివిని ఎరగని రీతిలో కొండపై నుంచి జలపాతాలు ఉధృతంగా కిందికి దూకుతున్నాయి.
శిథిలావస్థకు చేరిన ఇండ్లను పరిశీలించిన అధికారులు
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో తక్కెళ్ళపాడు తడకమళ్ళ వెళ్లే రహదారి కలోడ్ పైనుంచి నీరు ప్రవహిస్తుండటంతో కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే రహదారిపై యాద్గర్‌పల్లి నుంచి ఉట్లపల్లి తక్కెలపాడు రోడ్డుపై భారీ వృక్షాలు పడటంతో ప్రయాణం కష్టతరమైంది. మిర్యాలగూడ మండలంలోని తుంగపాడు శివారు రామన్నపేట లావుడి తండాలో లెవెల్ బిడ్జి పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దేవరకొండ మండలంలోని ముదిగొండ, కట్టగొమ్ముతండా, కమలాపూర్, సూర్యతండా, తాటికోల్, మంగలోనిబావి తదితర గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇండ్లను అధికారులు పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో వారిపల్లి బూరుగుపల్లి వాగులు పారు తున్నాయి. పలుచోట్ల భారీ వృక్షాలు కూలి పోవడం, పలు పంటలు నేలకొరిగాయి. భూదాన్ పోచంపల్లి, బీబీనగర్ మండలాలకు చెందిన రుద్రవెల్లి జూలూరు గ్రామంలోని మూసీ పరిసర ప్రాంతాలను ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలంలో ఆదర్శ పాఠశాల పూర్తిగా నీటీతో నిండిపోయింది. ఏటి వెంట ఉన్న పంట పొలాలు చాలావరకు నీట మునిగాయి. అర్వపల్లి మండల కేంద్రంలోని స్థానిక కేజీబీవీ పాఠశాల ఆవరణ చుట్టూ పూర్తిగా వర్షపు నీరు చేరింది. నూతనకల్ మండల పరిధిలోని మిర్యాల గ్రామంలో ముత్యాలమ్మ కుంట కట్ట చెరువు తెగిపోవడంతో పక్కనే ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరి గోడ కూలింది, స్కూల్లోకి నీళ్లు చేరి కంప్యూటర్లు ఇతర సామగ్రి మునిగిపోయాయి. చిలుకూరు మండలంలోని నారాయణపురం ఊరచెరువుకు నాలుగు చోట్ల గండిపడింది. మఠంపల్లి మండలంలో మూడు చెరువులు తెగాయి. వేములూరు ప్రాజెక్టు పొంగుతుండటంతో వేయి ఎకరాలు నీటమునిగాయని అంచనా. చెన్నాయపాలెం వద్ద రోడ్డు తెగి మఠంపల్లి, పాలకీడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోదాడలో హుజూర్‌నగర్‌కు వెళ్లే ప్రధాన రహదారి ఎర్రకుంట చెరువుకి వెళ్లే కాలువ ఉధృతంగా ప్రవహించడంతో ఆ ప్రవాహదాటికి రెండు కార్లు, రెండు ఆటోలు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. కారులో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తిని పట్టణానికి చెందిన రవి(45)గా గుర్తించారు. ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో కొట్టుకుపోయిన వారి ఆచూకీ తెలియరాలేదు. సూర్యాపేట నల్లబండగూడెం వద్ద నీటి ప్రవాహం కొనసాగుతుంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై 5 గంటలపాటు వాహనాలు నిలిచిపోవడంతో నార్కెట్‌పల్లి-అద్దంకి రహదారిపైకి పోలీసులు దారి మళ్లించారు.
లోతట్టు ప్రాంతాలు అతలాకుతలం
కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, అనేక చోట్ల రాకపోకలు స్తంభించిపోయాయి. రామడుగు మండలంలోని దేశరాజుపల్లి గ్రామంలో రైల్వే ట్రాక్‌పై వరద ప్రవాహం ఏర్పడింది. రామడుగు బ్రిడ్జి ప్రమాదకర స్థితిలో ఉండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి గ్రామంలో ఉధతంగా ప్రవహిస్తున్న వాగును దాటి వెళ్లడానికి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముచ్చర్ల గ్రామంలోని లోతట్టు ప్రాంతాల్లో వరి పంటలు నీట మునిగాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అదనపు కలెక్టర్, అధికారులు లోయర్ మానేరు డ్యామ్ పరిస్థితిని సమీక్షించారు. సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలో లింగన్నపేట నుంచి గంభీరావుపేట వరకు వాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. బరీగిలగూడెం కాలనీలోని పాఠశాల వద్ద చెట్లు విద్యుత్ తీగెలప పడి మంటలు ెలరేగాయి. దీంతో కాలనీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు, ప్రజాప్రతినిధులు జేసీబీ సహాయంతో చెట్లను తొలగిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో నీటి మునిగిన ప్రాంతాల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యటించారు. ఎగువ మానేరు డ్యామ్ నిండుకుంది. సాయంత్రం 6గంటలకు ప్రాజెక్టు స్థాయి 1482.50అడుగులకు చేరుకుని 2టీఎంసీలతో పూరి నీటిని నిల్వ ్త సామర్థ్యాన్ని చేరుకుంది. ప్రాజెక్టులోకి 34,000 క్యూసెక్స్‌ల ఇన్‌ఫ్లో వస్తోంది.
జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డు పై ఉన్న ఇండ్లలోకి వరద నీరు చేరింది. ధర్మసముద్రం చెరువు కట్ట దిగువ భాగంలో ఉన్న అమీనాబాద్ కాలనీలో గల ఇండ్ల చుట్టూ వరద నీరు చేరడంతో జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీ లించారు. ధరూర్‌క్యాంప్, హౌసింగ్ బోర్డు, తీన్ ఖని, లడ్డు ఖాజా చౌరస్తా, గోవింద్‌పల్లె, మోతేరోడ్, గంజ్ రోడ్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కోరుట్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామం నుంచి కాచారం వెళ్లే దారిలో ఉన్న ఊర చెరువు నిండి అలుగు పారడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మేడిపల్లి మండల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలోకి వర్షపు నీరు చేరింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని వడకాపూర్ నుంచి దూళికట్టకు వెళ్లే ప్రధాన రహదారిపై హుస్సేన్‌మియా వాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాగులపల్లెలో బీట్ రోడ్డు కొట్టుకుపోయింది. ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల మధ్య గూడెం ఉన్న నక్కల వాగు స్థాయికి మించి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
వాగులో చిక్కుకుపోయిన ఆర్టీసీ బస్సు 40 మంది ప్రయాణీకులు సురక్షితం
మహబూబాబాద్-వరంగల్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సు (టీఎస్ 24 జెడ్ 0018) నెక్కొండ మండలం తోపనపల్లి వద్ద చెరువు కట్టపై నుండి వెళ్తుండగా, మత్తడి వరద రహదారిపైకి చేరడంతో అర్థాంతరంగా బస్సును డ్రైవర్ వరదలో నిలిపివేశారు. వరద ఉధృతి పెరగడంతో ముందుకు వెళ్లలేక, వెనక్కు పోలేక బస్సును నిలిపివేయడంతో రాత్రంతా ప్రయాణీకులు బస్సులోనే ఉండిపోయారు. ప్రయాణీకులు ఇచ్చిన సమాచారంతో ఆదివారం ఉదయం వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సంఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే ఆర్టీసీ డ్రైవర్.. ప్రయాణీకులను ఓ లారీలో వెంకటాపూర్‌కు చేర్చారు. ఈ సందర్భంగా కలెక్టర్, పోలీసు కమిషనర్, ఎమ్మెల్యే ప్రయాణీకులతో మాట్లాడారు. భోజనం, తాగునీటిని వెంటనే వారికి అందించి భారీ వర్షాలు, పరిస్థితులపై నెక్కొండ పోలీసు స్టేషన్‌లోనే మీక్షించారు.
ఇంటికన్నె వద్ద కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్..
రైళ్ల రద్దు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె-కేసముద్రం మధ్య భారీ వర్షాల నేపథ్యంలో వరద ఉధృతికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. ట్రాక్ కింద కంకర మొత్తం కొట్టుకుపోవడంతో ట్రాక్ గాలిలో వేలాడుతుంది. దాంతో దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ఈ మార్గంలో ప్రయాణించే 24 రైళ్లను రద్దు చేశారు. అప్పటికే సమీపంలోకి వచ్చిన రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. సింహాద్రి, మచిలీపట్నం, గౌతమి, సంఘమిత్ర, గంగా కావేరి, చార్మినార్, యశ్వంతాపూర్ ఎక్స్‌ప్రెస్‌లను ఎక్కడికక్కడే నిలిపివేశారు. నెక్కొండలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్, మహబూబాబాద్‌లో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్, కేసముద్రం రైల్వే స్టేషన్‌లో సంఘమిత్ర రైలు, పందిళ్లపల్లి వద్ద మహబూబ్‌నగర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయాయి. దాంతో రైళ్లలోని ప్రయాణీకులు ఆహారం, తాగునీటికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శాతవాహన, గోల్కొండ, గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ, కాగజ్‌నగర్ ఇంటర్‌సిటీ రైళ్లను రద్దు చేశారు. కోణార్క్, గరీభ్‌రథ్, చార్మినార్, విశాఖ-ఎల్‌టీటీ తదితర రైళ్లను దారిమళ్లించారు. కాగా, ట్రాక్‌ను పునరుద్ధరించే చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టారు.
ఓసీల్లో స్తంభించిన బొగ్గు ఉత్పత్తి
జయశంకర్-భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కేటీకే ఓసీ-2,3లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. ఓసీ -2లో రోజుకు 4వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కాగా, రెండు రోజుల్లో 8వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓసీ-3లో రోజుకు 5వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కాగా రెండు రోజులకు గాను 10వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. రెండు ఓసీల్లో కలిసి రెండు రోజుల్లో మొత్తం 18వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఒక టన్ను బొగ్గు విలువ సగటున రూ.3500 కాగా మొత్తం రూ.18వేల టన్నులకు గాను రూ.6కోట్ల30లక్షలు నష్టం వాటిల్లినట్టు అధికారులు పేర్కొన్నారు.
పంటలు నీటమునిగాయి.. ఇండ్లు దెబ్బతిన్నాయి
రంగారెడ్డి జిల్లాలోని మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, చందానగర్, రాయదుర్గం, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాజేంద్రనగర్ సర్కిల్‌లో పలు ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. ఆమనగల్, కడ్తాల్ మండలాల్లో పంటలు నేలకొరిగాయి. ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మేడిగడ్డ శంకర్ కొండ తాండా గ్రామ పంచాయతీల మధ్య ఉన్న కత్వ వాగు ప్రమాదకరంగా పొంగి పొర్లుతుంది. శంకర్‌పల్లి మండలంలోని మూసీ, పొద్దుటూరు, టంగుటూరు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. శంషాబాద్ మండలంలోని మల్కారం గ్రామ రెవెన్యూ పరిధిలో ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. కేబీ దొడ్డి, సుల్తాన్‌పల్లి గ్రామాల్లో వందల ఎకరాల వ్యవసాయ భూములు నీట మునిగాయి. అమడాపూర్ బ్రిడ్జి నిర్మాణ సమయంలో ఏర్పరచిన శిలాఫలకం కూలేందుకు సిద్ధంగా ఉన్నది. సుల్తాన్‌పల్లి-కేబి దొడ్డి రాకపోకలు నిలిచిపోయాయి. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హుడా కాలనీ రోడ్డుపై వృక్షాలు నేలకొరిగాయి. మొయినాబాద్ మండలంలోని చిన్న మంగళవారం సమీపంలో మూసీ వాగు పొంగుతోంది. వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూర్, మోమిన్‌పేట మండలాల్లో పలు ఇండ్లు కూలిపోయాయి. బషీరాబాద్ మండలంలో వరి పంట నీటమునిగింది. యాలాల పరిధిలోని కాగ్నా నది జుంటిపల్లి, శివసాగర్ ప్రాజెక్టులు పొంగిపొర్లాయి. నవాబుపేట మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ప్రాజెక్టులకు భారీగా వరద నీరు, గేట్లు ఎత్తి దిగువకు విడుదల
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 5 లక్షల క్యూసెక్కుల వరద ఉధృతి పెరిగి కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయంకు వరద ఉధృతి కొనసాగుతుండటంతో 10 గేట్లను ఎత్తి జలవిద్యుత్‌కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 4,83,766 క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు. దాంతో నాగార్జునసాగర్ డ్యామ్ 26 క్రష్ట్ గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 8 గేట్లను 10 అడుగులు, 18 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 4,97,524 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 587.90 అడుగులవద్ద నీరు నిల్వ ఉంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 305.9818 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 12,261 క్యూసెక్కుల నీటిని కుడి కాలువ ద్వారా, 5292 క్యూసెక్కుల నీటిని ఎడమ కాల్వద్వారా నీటి విడుదల చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీకి 37 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1081.6 అడుగుల 63.303 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. వరద కాలువకు 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు 22 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.