నీటి సంఘం ఎన్నికలెప్పుడో.?

When will the water board elections be held?– 2006లో చివరిసారిగా ఎన్నికల నిర్వహణ
నవతెలంగాణ – మల్హర్ రావు
పదహరేళ్లుగా నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు.దీంతో చెరువులు అద్వాన్నంగా మారాయి.మరోవైపు మిషన్ కాకతీయ పథకంలో భాగంగా గత ప్రభుత్వం చెరువులు, కుంటలు మరమ్మతులు చేసినా వాటిపై ఆజమాయిషీ లేక నీటి విడుదల,మరమ్మతులసై దృష్టి పెట్టేవారు కరువైయ్యారు. చెరువుల అభివృద్ధి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు చెరువు అభివృద్ధి, నిర్వహణ,ఆయకట్టుకు నీటి సరఫరా చేయడం తదితర పర్యవేక్షణ పనులు నీటి సంఘాలు,  పాలక వర్గాలు చేపట్టేవి పదహరేళ్లుగా నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించక పోవడంతో  పర్యవేక్షణ కరువైయింది. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారు.
గతంలో ఇలా…
గతంలో ప్రభుత్వం సాగునీటి సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగానే 100 ఎకరాల ఆయకట్టు ఉన్న ప్రధాన చెరువుల ఆయకట్టుకు రైతులు చైర్మన్ తోపాటు డైరెక్టర్లను ఎన్నుకునేవారు. పాలకవర్గ సభ్యులు చెరువుల నిర్వహణతో పాటు నీటిని పంట పొలాలకు విడుదల చేసుకొని పొదుపుగా వాడుకునేలా చర్యలు తీసుకునేవారు. అంతేకాకుండా రైతులను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులు నిర్వహించేవారు.16 ఏళ్లుగా నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో చెరువుల నిర్వహణ అద్వాన్నంగా మారింది.కొన్నీ చెరువులు శితిలావస్థకు చేరుకున్నాయి. తూములు పని చేయక సాగు నీరు రాక నిరుపయోగంగా మారాయి.
2008 నుంచి బంద్..
మండలంలోని 15 గ్రామపంచాయతీల పరిధిలో 5 చిన్నతరహా ప్రాజెక్టులు, 22 రెవెన్యూ గ్రామాల్లో చెరువులు, కుంటలు మొత్తం 832 ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2006లో  వందలఎకరాల ఆయకట్టు ఉన్న ప్రధాన చెరువులకు సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. వాటి పదవీకాలం 2008లో ముగిసింది. అప్పటి నుంచి తిరిగి ఎన్నికలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించి చెరువులను మరింత అభివృద్ధి చేయాలని రైతులు కోరుతున్నారు.
నీటి సంఘాలతో చెరువులు అభివృద్ధి:  ప్రసాద్ రైతు తాడిచెర్ల
నీటి సంఘాలను ఎన్నుకుంటేనే చెరువులు అభివృద్ధి చెందుతాయి. గతంలో నిటి సంఘాలు ఉండడంతో నీటిని పొదుపుగా వాడుకోవడమే కాకుండా వాటి పర్యవేక్షణ కూడా పకడ్బందీగా ఉండేది. ప్రభుత్వం నీటి సంఘాలపై దృష్టి సారించాలి.
Spread the love