వాయనాడా? రాయ్ బరేలా?

వాయనాడా? రాయ్ బరేలా?– ఏ సీటు వదులుకోవాలన్నదానిపై రాహుల్‌ సతమతం
– ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి కేరళలో పర్యటన
– తాను ఏ నిర్ణయం తీసుకున్నా  ఇరు నియోజకవర్గాలూ సంతోషిస్తాయి : కాంగ్రెస్‌ అగ్రనేత
న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల ఓటమిలో ఓదార్పునిచ్చిన కేరళలోని వాయనాడ్‌ ఎంపీ స్థానం ఒకవైపు.. తనయుడి కోసం తల్లి త్యాగం చేసిన యూపీలోని కాంగ్రెస్‌ కంచుకోట రారుబరేలీ లోక్‌సభ స్థానం ఇంకోవైపు.. ఇలా 2024 లోక్‌సభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మంచి మెజారిటీతో విజయం సాధించాడు. అయితే, నిబంధనల ప్రకారం.. రెండు స్థానాల్లో గెలిచినవారెవరైనా ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. కాబట్టి, ఈ రెండు స్థానాలలో ఏ నియోజకవర్గానికి పరిమితం కావాలో? ఏ సీటును వదులుకోవాలో తెలియక రాహుల్‌ సతమతమవుతున్నట్టు తెలిసింది. అయితే, తాను ఏ నిర్ణయం తీసుకున్నా.. రెండు నియోజకవర్గాలు ఆ నిర్ణయంతో సంతోషంగా ఉంటాయని రాహుల్‌ చెప్పాడు. తనను రెండోసారి లోక్‌సభకు ఎన్నుకున్నందుకు వాయనాడ్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. నియోజకవవర్గ ప్రజలను త్వరలో కలవటానికి ఎదురుచూస్తున్నానని తెలిపాడు. తాను వాయనాడ్‌ ఎంపీగా ఉండాలా లేక రారుబరేలీ ఎంపీగా ఉండాలా అనే సందిగ్ధత తన ముందు ఉన్నదన్నాడు.
వాయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో వరుసగా రెండోసారి ఘనవిజయం సాధించిన తర్వాత రాష్ట్రంలో ఆయన తొలిసారి పర్యటించారు. రోడ్‌ షో, బహిరంగ సభలలో పాల్గొన్న ఆయన పైవిధంగా అన్నాడు. తాను నిర్ణయం తీసుకోవటంలో దైవిక మార్గనిర్దేశాన్ని పొందుతానని చెప్పుకోనని మోడీపై పరోక్ష విమర్శలు చేశాడు. దేశంలోని ప్రధాన విమానాశ్రయాలు, పవర్‌ ప్లాంట్లను అదానీకి అప్పగించాలని దేవుడు ప్రధానిని నిర్దేశిస్తాడని రాహుల్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ”కానీ, నేను మనిషిని. నా దేవుళ్లు దేశంలోని పేద ప్రజలు. కాబట్టి, నాకు ఇది చాలా సులభం. నేను ప్రజలతో మాట్లాడతాను. వారు ఏమి చేయాలో వారు నాకు చెబుతారు” అని రాహుల్‌ గాంధీ అన్నాడు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించటం కోసమే పోరాటం చేశామనీ, ఆ పోరాటంలో ద్వేషాన్ని ప్రేమ, ఆప్యాయతతో అహంకారాన్ని వినయంతో ఓడించామని చెప్పాడు. భారత ప్రజలు తనకు స్పష్టమైన సందేశం పంపటంతో మోడీ ఇప్పుడు తన వైఖరిని మార్చుకోవాల్సి ఉంటుందని రాహుల్‌ అన్నారు.
ఇటు కేరళలో, అటు యూపీలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటములు గణనీయమైన స్థానాలను గెలుపొందాయనీ, ఇప్పుడిదే రాహుల్‌ అనిశ్చితికి కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే, ఉత్తర, దక్షిణ భారతదేశ అంశమూ ఇక్కడి ముడిపడి ఉండే అవకాశమున్నదని అంటున్నారు. కేరళలోని 20 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ 18 స్థానాలు సాధించగా, యూపీలోని 80 సీట్లకు గానూ 43 స్థానాలు పొందిన ఇండియా బ్లాక్‌ అక్కడ ఎన్డీఏ కంటే ఎక్కువ సీట్లను సంపాదించగలిగింది. దీంతో బీజేపీ అనుకున్న లక్ష్యానికి గండి పడటంలో యూపీ ఫలితాలే కీలకమయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

Spread the love