నవతెలంగాణ – హైదరాబాద్: కష్టాల్లో ఉన్నవారికి చేయూత అందించడానికి ఎప్పుడూ ముందుంటారు నటుడు ప్రభాస్. తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో చోటుచేసుకున్న విషాదాన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా ఆయన భూరి విరాళాన్ని ప్రకటించారు. ఈమేరకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రభాస్ రూ.2 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ఆయన టీమ్ తెలిపింది. దీనిపై సినీ ప్రియులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. టాలీవుడ్ నుంచి అంత మొత్తంలో విరాళాన్ని చెల్లించిన హీరో ఆయనే కావడం విశేషమని నెటిజన్లు అనుకుంటున్నారు. ఆయన గొప్ప మనసుని మెచ్చుకుంటున్నారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలచివేస్తోంది. సహాయక చర్యల కోసం పలువురు సినీతారలు ముందుకొచ్చి ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఆ విషాద ఘటనపై స్పందించిన చిరంజీవి, రామ్‌చరణ్ రూ.కోటి విరాళంగా ప్రకటించారు. అల్లు అర్జున్ రూ.25 లక్షలు కేరళ సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్లు తెలిపారు. హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, సోదరుడు కార్తి సంయుక్తంగా రూ.50 లక్షలు, నయనతార – విఘ్నేశ్ శివన్ దంపతులు రూ.20 లక్షలు మలయాళ నటులు మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కలిపి రూ.35 లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు, కమల్ హాసన్ రూ. 25 లక్షలు, విక్రమ్ రూ.20 లక్షలు, రష్మిక రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. మరోవైపు నటుడు మోహన్‌లాల్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తాను వ్యవస్థాపకుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా రూ. 3 కోట్ల విరాళం బాధితుల కోసం ఇస్తున్నట్టు తెలిపారు.