– ఇమామ్లకు గౌరవ వేతనం అందిస్తున్న సర్కార్ మనదే..
– ఖురాన్ చదివే నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి అజాన్ పోటీలు : హోంమంత్రి మహమూద్ అలీ
నవతెలంగాణ- నల్లగొండ కలెక్టరేట్
”తెలంగాణ రాష్ట్రం గొప్ప లౌకిక రాష్ట్రం.. ముఖ్యమంత్రి కెేసీఆర్ సర్వ మతాలను, కులాలను గౌరవిస్తూ.. తగిన ప్రాధాన్యత ఇస్తూ అందర్నీ కలుపుకుపోతున్నారు. సీఎం గొప్ప సెక్యులర్ వ్యాధి” అని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మదీనా మస్జిద్‌లో జరుగుతున్న రెండో అఖిల భారత ఖురాన్, అజాన్ పోటీలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు ముందు మత ఘర్షణలు జరిగేవని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కెేసీఆర్ ముస్లింలకు సముచిత గౌరవం కల్పించి ఆ దిశగా రాజకీయ రంగంలో ప్రాధాన్యత కల్పిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 17వేల మసీదుల్లోని ఇస్లాంలకు, మౌలాలకు ప్రతినెలా రూ.5000 గౌరవ వేతనం ఇస్తున్న సర్కార్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక్కటే అన్నారు. ఈ వేతనాలను రూ.10 వేలకు పెంచి ఇప్పిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ముస్లిం విద్యార్థుల కోసం రెండేండ్లలో 204 మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యా, వసతి వారికి అందిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు.
ఇస్లాం మతం పవిత్ర గ్రంథంగా పరిగణించబడే ఖురాన్ పోటీ అనేది ఖురాన్ చదివే నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి జరిగే కార్యక్రమని చెప్పారు. పోటీలో పాల్గొనే అభ్యర్థులు లెక్కలేనన్ని గంటలు సాధన చేస్తారని, వారిని హాఫిజ్ అని సంభోదిస్తారని అన్నారు. అతి చిన్న వయస్సు నుంచే ఖురాన్ పట్ల అభిరుచి, అంకితభావం ప్రదర్శించి నేర్చుకుంటారని చెప్పారు. ఈ పోటీలలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి దాదాపు 150 మంది అభ్యర్థులు పాల్గొంటున్నారని తెలిపారు. అంతకుముందు హోంమంత్రిని జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, జాయింట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, ఎస్బీ డీఎస్పీ సొమ్ నారాయణ్ సింగ్, తెలంగాణ హజ్ కమిటీ సభ్యులు, 26వ వార్డ్ కౌన్సిలర్ అజీజుద్దిన్ బషీర్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ రెగట్టే మల్లికార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.