బంగ్లాదేశ్‌ పరిస్థితిపై నిశితంగా పరిశీలిస్తున్నాం

On the situation in Bangladesh We are looking closely– అఖిలపక్ష సమావేశానంతరం
– విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ వెల్లడి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వంతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ తెలిపారు. బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలను నిశితంగా పరిశీలిస్తున్నామని అన్నారు. మంగళవారం తొలుత రాజ్యసభలో విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లోని మైనారిటీల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అనంతరం లోక్‌సభలో కూడా మంత్రి ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌ అంశంపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన అనంతరంఉభయ సభల్లో విదేశాంగ మంత్రి పరిస్థితిని వివరించారు.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన భద్రతపై కేబినెట్‌ కమిటీ సమావేశమై బంగ్లాదేశ్‌లో పరిస్థితిని అంచనా వేసింది. మోడీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా, విదేశాంగ మంత్రి జైశంకర్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. మంత్రి జైశంకర్‌ బంగ్లాదేశ్‌ పరిస్థితిపై ప్రధానికి వివరించారు. అలాగే లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో కూడా మంత్రి సమావేశమయ్యారు. బంగ్లాదేశ్‌లోని అత్యున్నత భద్రతా బలగాలతో సంప్రదింపులు జరిపిన తరువాత షేక్‌ హసీనా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని విదేశాంగ మంత్రి రాజ్యసభలో తెలిపారు. చివరి నిమిషంలో ఆమె భారత్‌ రావాలనుకుంటున్నట్టు సమాచారం. బంగ్లాదేశ్‌లోని దౌత్య కార్యాలయాల ద్వారా అక్కడి భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపు తున్నామని మంత్రి జైశంకర్‌ తెలిపారు. బంగ్లాదేశ్‌లో దాదాపు 19,000 మంది భారతీయులు ఉన్నారని, వీరిలో దాదాపు తొమ్మిది వేల మంది విద్యార్థులు ఉన్నారని అన్నారు. జులైలో చాలా మంది విద్యార్థులు ఇప్పటికే దేశానికి తిరిగి వచ్చారని, అక్కడి మైనార్టీల స్థితిగతులను కూడా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. నాలుగు ఆలయాలకు స్వల్ప నష్టం వాటిల్లిందని, మైనారిటీల రక్షణ కోసం వివిధ సంఘాలు, సంస్థలు చొరవ తీసుకుంటున్నాయని అన్నారు. శాంతి భద్రతలను పునరుద్ధరించే వరకు ఈ విషయంలో ఆందోళన చేస్తామన్నారు. సరిహద్దు దళాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరారు.
షేక్‌ హసీనాకు భారత్‌ అన్ని విధాలా సాయం
బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాకు భారత్‌ అన్ని విధాలా సాయం చేసిందని మంత్రి జైశంకర్‌ అఖిలపక్ష సమావేశంలో తెలిపారు. ‘ పొరుగు దేశంలో పరిస్థితి క్షీణిస్తే అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు వారికి సమయం ఇచ్చారు. ఇప్పుడు వారు షాక్‌లో ఉన్నారు. దాన్ని తొలగించిన తరువాత ప్రభుత్వం వారితో మాట్లాడి భవిష్యత్తు ప్రణాళికలతో సహా నిర్ణయం తీసుకుంటుంది. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాల వెనుక విదేశీ శక్తుల జోక్యాన్ని కొట్టిపారేయలేం’ అని జైశంకర్‌ అన్నారు. భద్రతా దళాల నేతలతో చర్చలు జరిపిన తర్వాతనే షేక్‌ హసీనా రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోందని మంత్రి వెల్లడించారు. చాలా తక్కువ సమయంలోనే .. ఇండియాకు వచ్చేందుకు ఆమె రిక్వెస్ట్‌ చేసినట్టు తెలిపారు. సోమవారం సాయంత్రం ఆమె ఢిల్లీ చేరుకున్నట్టు చెప్పారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాల గురించి వివరిస్తూ.. అక్కడ జరిగిన హింస, అస్థిరతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. 2024 జనవరి ఎన్నికల నాటి నుంచి బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఆందోళనకంగా ఉందన్నారు. బంగ్లా రాజకీయాల్లో వర్గ పోరు పెరిగిందన్నారు. జూన్‌లో విద్యార్థి సంఘాల ఉద్యమం ఊపందుకుందని ఆయన తెలిపారు. రోజు రోజుకూ హింస పెరిగిందని, పబ్లిక్‌ ఆస్తులను ధ్వంసం చేశారని, జులై నెలలోనూ హింస కొనసాగినట్టు మంత్రి చెప్పారు. ఈ సమయంలోనే చర్చలు నిర్వహించాలని బంగ్లాను కోరినట్లు ఆయన వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా.. ప్రజలు మాత్రం ఆందోళనలు విరమించలేదన్నారు. షేక్‌ హసీనా వైదొలగాలన్న డిమాండ్‌ పెరిగిపోయిందన్నారు. ఆగస్టు 4న ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారినట్టు చెప్పారు. పోలీసులు, పోలీసు స్టేషన్లపై దాడులు పెరిగినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వంతో సంబంధం ఉన్న నేతలకు చెందిన ప్రాపర్టీలను ఆందోళనకారులు నాశనం చేసినట్లు పేర్కొన్నారు. మైనార్టీలకు చెందిన వ్యాపారాలు, ఆలయాలపై కూడా దాడి జరిగినట్లు మంత్రి జైశంకర్‌ తెలిపారు. ఆగస్టు 5న కర్ఫ్యూ ఉన్నా.. జనం రోడ్లపైకి వచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వం తరపున కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, ఆరోగ్య మంత్రి జెపి నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు, ప్రతిపక్ష నేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే, డీఎంకే ఎంపీ టిఆర్‌ బాలు, ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సులే, ఆర్‌జెడి ఎంపీి మీసా భారతి, జేడీయూ ఎంపీ, కేంద్ర మంత్రి లలన్‌ సింగ్‌, ఎస్‌పి ఎంపీ రామ్‌గోపాల్‌ యాదవ్‌, టీఎంసీ ఎంపీలు సుదీప్‌ బందోపాధ్యాయ, డెరెక్‌ ఓబ్రెయిన్‌, శివసేన ఎంపీ అరవింద్‌ సావంత్‌, బీజేడీ ఎంపీ సస్మిత్‌ పాత్ర, టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఆప్‌కు అందని ఆహ్వానం
అఖిల పక్ష సమావేశానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కి ఆహ్వానం అందలేదు. దీంతో ఆప్‌ రాజ్యసభ పక్షనేత సంజరు సింగ్‌ ప్రశ్నించారు. ఆప్‌ 10 మంది ఎంపీలతో రాజ్యసభలో మూడో అతిపెద్ద పార్టీగా ఉందని, లోక్‌సభలో ముగ్గురు ఎంపీలు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం తమను సమావేశానికి మినహాయించి ఉండకూడదని అన్నారు.
ఢాకాలో నాటకీయ పరిణామాల వెనుక విదేశీ శక్తుల కుట్ర ? : రాహుల్‌
ఢాకాలో ప్రభుత్వ మార్పిడితో దౌత్యపరమైన పరిణామాలను ఎదుర్కోవడంలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహం ఏమైనా ఉందా..? అని కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్‌ ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి బదులిస్తూ.. ప్రభుత్వ ఏర్పాటుకు జరుగుతున్న పరిస్థితుల్ని కేంద్రం నిశితంగా విశ్లేషిస్తున్నట్టు చెప్పారు. తద్వారా తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఇక షేక్‌ హసీనాను గద్దె దింపేందుకు గత కొన్ని వారాలుగా ఢాకాలో జరిగిన నాటకీయ పరిణామాల వెనుక విదేశీ శక్తుల కుట్ర.. ప్రత్యేకించి పాకిస్థాన్‌ ప్రమేయం ఏమైనా ఉందా..? అని రాహుల్‌ ప్రశ్నించారు. దీనిపై ఇప్పుడే ఒక అంచనాకు రావడం తొందరపాటు అవుతుందని మంత్రి బదులిచ్చారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, పాకిస్థాన్‌ దౌత్యవేత్త ఒకరు ఆందోళనలకు మద్దతుగా తన ప్రొఫైల్‌ పిక్‌ను నిరంతరం మారుస్తున్నారని తెలిపారు. అదేవిధంగా బంగ్లాదేశ్‌లో నాటకీయ పరిణామాలను ఢిల్లీ ముందుగానే ఊహించిందా? అని కూడా కాంగ్రెస్‌ నేత కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి విదేశాంగ మంత్రి స్పందిస్తూ.. పరిస్థితిని భారత్‌ పర్యవేక్షిస్తోందని బదులిచ్చారు. ఇక అఖిల పక్ష సమావేశంలో పొరుగు దేశంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీలు తమ పూర్తి మద్దతును ప్రకటించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Spread the love