– మాది పేదలు, దళితులు, బీసీలు, రైతుల టీమ్ :మహారాష్ట్రలోని సర్కోలి సభలో సీఎం కేసీఆర్
– పని చేయని ప్రభుత్వాలను తరిమికొట్టాలంటూ పిలుపు
– మహారాష్ట్రలోనూ తెలంగాణ పథకాలను అమలు చేస్తామంటూ వ్యాఖ్యలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ అనేది కాంగ్రెస్‌కు ‘ఏ’ టీమ్ కాదు.. బీజేపీకి ‘బీ’ టీమ్ కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తమ పార్టీది పేదలు, రైతులు, బీసీలు, దళితుల టీమ్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దేశ పరివర్తన కోసమే బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశామనీ, అందువల్ల భారత్‌ను తప్పకుండా మారుస్తామని తెలిపారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మహారాష్ట్రకు వెళ్లిన సీఎం… మంగళవారం అక్కడి పండరీపూర్‌లోని విఠలేశ్వరస్వామిని, రుక్మిణీ దేవిని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సర్కోలిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఎన్నికల్లో పార్టీలు కాదు.. ప్రజలు గెలవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. దేశంలో రైతు ప్రభుత్వం రావాలని అన్నారు. తెలంగాణలో మాదిరిగా మహారాష్ట్రతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి ఎందుకు సాధ్యం కాలేదంటూ ఈ సందర్భంగా కేసీఆర్ ప్రశ్నించారు. దశాబ్దాలపాటు మహారాష్ట్రను పాలించిన కాంగ్రెస్, బీజేపీ ఆ రాష్ట్రానికి ఏం ఒరగబెట్టాయని నిలదీశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన క్రమంలో… అభివృద్ధి అనేది ఎక్కడ, ఏ రకంగా ఉందో చూడాలంటూ ప్రజలకు సూచించారు. పని చేయని ప్రభుత్వాలను తరిమికొట్టాలంటూ ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణలో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంటే.. దివాళా తీయిస్తున్నామంటూ కొందరు విమర్శిస్తున్నారని కేసీఆర్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వాస్తవానికి దివాళా తీసేది రాష్ట్రం కాదనీ, కాంగ్రెస్, బీజేపీ నేతలని విమర్శించారు. రైతు సంక్షేమ పథకాలు అమలైతే.. దేశంలోని అన్నదాతలంతా బీఆర్‌ఎస్ వెంట నడుస్తారని చెప్పారు. ఆ రెండు పార్టీలకు (కాంగ్రెస్, బీజేపీ) ఇప్పుడు ఇదే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అందుకే బీఆర్‌ఎస్‌పై పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని అన్నారు. దేశంలో అందుబాటులో ఉన్న నీటి వనరులు, యోగ్యమైన భూమి, విద్యుత్ ఉత్పాదకత తదితరాంశాలను ఆయన ఏకరువు పెట్టారు. కేంద్రంలోని బీజేపీకి నిజంగా దమ్ముంటే ప్రతీ ఎకరాకూ నీరివ్వాలని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే కిసాన్ సర్కార్‌ను ఏర్పాటు చేసి, రైతులకు 24 గంటలపాటు నిరంతర ఉచిత విద్యుత్‌ను అందిస్తామని హామీనిచ్చారు. దేశంలో పండుతున్న మొత్తం ధాన్యాన్ని కేంద్రం ఎందుకు కొనటం లేదని ప్రశ్నించారు. ప్రతీ సంవత్సరం రైతులు ఎందుకు ఆందోళన బాట పట్టాల్సి వస్తోందని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలంటూ ఆయన పిలుపునిచ్చారు. అక్కడి యువ నాయకుడు భగీరథ్ బాల్కేను సీఎం ఈ సందర్భంగా అభినందించారు. ఆయన పేరులోనే భగీరథుడు ఉన్నాడనీ, ఆ ప్రాంతానికి కచ్చితంగా నీళ్లుతెస్తారని వ్యాఖ్యానించారు. ఆయన్ను గెలిపిస్తే మంత్రిని గెలిపిస్తానని హామీనిచ్చారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే.. తెలంగాణలో అమలవుతున్న ప్రతీ పథకాన్ని అక్కడా అమలు చేస్తామని ప్రకటించారు. బహిరంగ సభ అనంతరం తుర్జాపూర్‌లోని ‘తుల్జా భవాని’ అమ్మవారి ఆలయానికి చేరుకున్న కేసీఆర్… ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన రెండు రోజుల పర్యటనను ముగించుకున్న ఆయన మహరాష్ట్ర నుంచి బయల్దేరి హైదరాబాద్‌కు చేరుకున్నారు.