అర్థాకలితో ఉన్నాం…ఆత్మహత్యలే శరణ్యం

అర్థాకలితో ఉన్నాం...ఆత్మహత్యలే శరణ్యం– ఇందిరాపార్కు వద్ద దీక్షల్లో కరెంట్‌ బిల్‌ కలెక్టర్లు
– విద్యుత్‌ సంస్థలు వారికి ఉపాధి కల్పించాలి :టీజీఎస్‌యూఈఈయూ అధ్యక్షులు కే ఈశ్వరరావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల వరకు జీరో బిల్లులు ఇస్తుండటంతో ఉపాధి కోల్పోయి,కుటుంబాలు రోడ్డునపడి, అర్థాకలితో బతుకుతున్నామనీ,ఇదే కొనసాగితే ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మరో మార్గం తమకు కనిపించట్లేదని విద్యుత్‌ బిల్‌ కలెక్టర్లు ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ స్టేట్‌ యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీజీఎస్‌యూఈఈయూ) ఆధ్వర్యంలో డిస్కంల్లో పనిచేస్తున్న విద్యుత్‌ బిల్‌ కలెక్టర్లు సోమవారంనాడిక్కడి ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్షలు నిర్వహించారు. ఆరు నెలలుగా తమకు ఒక్క రూపాయి వేతనం రావట్లేదనీ, గృహలక్ష్మి పథకం వల్ల 80 శాతం మంది వినియోగదారులు బిల్లులు చెల్లించట్లేదని తెలిపారు. కొందరు ఆన్‌లైన్‌ ద్వారా బిల్లు చెల్లింపులు చేస్తున్నారనీ, తాజాగా ఆగస్టు నెల నుంచి తెలంగాణ రాష్ట్ర ఉత్తర, దక్షిణ ప్రాంతాల విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) బిల్లులపైనే క్యూఆర్‌ కోడ్‌లు కూడా ముద్రిస్తుండటంతో తాము ఉపాధిని పూర్తిగా కోల్పోయామని ఆందోళన వ్యక్తం చేశారు. కరెంట్‌ బిల్‌ కలెక్టర్ల నిరాహారదీక్షల్ని ప్రారంభించిన టీజీఎస్‌యూఈఈయూ అధ్యక్షులు కే ఈశ్వరరావు మాట్లాడుతూ రెండు డిస్కంల పరిధిలో దాదాపు 600 మంది బిల్‌కలెక్టర్లు 20-25 ఏండ్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. గృహజ్యోతితో వారు ఉపాధి కోల్పోయారన్నారు. వీరందరినీ డిస్కంలు ఎస్‌ఈ, ఈఆర్వో, డీఈ అఫీసుల్లో పనిచేసే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే పలు రూపాల్లో తమ డిమాండ్లను వారు యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. బిల్‌ కలెక్టర్ల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకొని, మానవతా దృక్పథంతో వారికి ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారుఈ సమస్య పరిష్కారం కోసం మంగళవారం ప్రజాభవన్‌లో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రాలు ఇస్తామనీ,అప్పటికీ ప్రభుత్వం స్పందించ కుంటే విద్యుత్‌సౌధను ముట్టడిస్తామని హెచ్చ రించారు.రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన బిల్‌ కలెక్టర్లు తమ సమస్యల్ని తెలుపుతూ ప్లకార్డులు చేతబట్టి నిరాహారదీక్షల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వీ గోవర్థన్‌, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ జే ప్రసాద్‌రాజు, కోశాధికారి జే బస్వరాజ్‌ పాల్గొన్నారు. బిల్‌ కలెక్టర్లు జీ లక్ష్మమ్మ (నల్గొండ), బీ కృష్ణయ్య (ఖమ్మం), సోమేష్‌ (జనగాం), సత్యం (నిర్మల్‌)తో పాటు పలువురు ఉద్యోగులు నిరాహారదీక్షలో కూర్చున్నారు.

Spread the love