మనది వెలుగుల తెలంగాణ

– రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా
– దశాబ్ద కాలంలో రెట్టింపైన విద్యుదుత్పత్తి
– తెలంగాణ పుడ్స్‌ చైర్మెన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రం ఏర్పడిన దశాబ్ద కాలంలో ఎన్నో విద్యుత్‌ సంస్కరణలను తెలంగాణ సర్కార్‌ తీసుకొచ్చిందని తెలంగాణ పుడ్స్‌ చైర్మెన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌ తెలిపారు. సీఎం ముందుచూపు, విద్యుత్‌ సంస్థ ఉద్యోగుల సహకారంతోనే ఇది సాధ్యమైందని వివరించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరెంటుకు కోసం ధర్నాలు చేస్తే రైతులను కాల్చి చంపిన చరిత్ర గత ప్రభుత్వాలదైతే… రైతుకు 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్న ఘన చరిత్ర తెలంగాణ సర్కార్‌దని వివరించారు. గతంలో పరిశ్రమలకు పవర్‌ హాలీడే ప్రకటించేవారని.. ప్రస్తుతం డిమాండ్‌కు మించి ఏడాది పొడవునా అన్నిరంగాలకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటుకు నాటికి విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం 7,778 మెగావాట్లు కాగా సీఎం కేసీఆర్‌ కృషితో 18,453 మెగావాట్లకు చేరుకుందని తెలిపారు. 26.96 లక్షల వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని వివరించారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అని గొప్పలు చెప్పుకునే గుజరాత్‌లో సైతం నేటికి పరిశ్రమలకు పవర్‌ హాలీడేలు ప్రకటిస్తున్నారని.. అలాగే రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్‌ సైతం అక్కడ అందుబాటులో లేదని విమర్శించారు. తెలంగాణలో యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ ద్వారా 4 వేల మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి, భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ ద్వారా 1,080 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి రాష్ట్ర సర్కార్‌ శ్రీకారం చుట్టిందని తెలిపారు.

Spread the love