కాగ్‌ పనికి రాదని మేం అనలేదు

We didn't say that cogs don't work– మేం ఫ్యాక్ట్‌ షీట్‌ విడుదల చేస్తాం : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కాగ్‌ పనికి రాదని తాము అనలేదని, మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ నాయకులు మన్మోహన్‌ సింగే కాగ్‌ నివేదిక తప్పుల తడక అన్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీ ప్రాంగంలోని మీడియా పాయింట్‌లో శనివారం హరీశ్‌రావు మాట్లాడారు. ఆరు గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వ వైఖరిని నిలదీశామన్నారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించబోమని చెప్పడంలో బీఆర్‌ఎస్‌ విజయం ఉందన్నారు. తాము గొంతు విప్పాకే అసెంబ్లీలో తీర్మానం చేసినట్టు తెలిపారు. ఈ శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం ప్రతిపక్షం మీద దాడి చేసే ప్రయత్నం చేసిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పాలన మీద దృష్టి తక్కువైందన్నారు. ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేశారని, కాంగ్రెస్‌ పీపీటీ తప్పుల తడకగా ఉందని అన్నారు. అధికార, ప్రతిపక్షానికి సమన్యాయం ఉండాలి కానీ ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. తాము కూడా ఫ్యాక్ట్‌ షీట్‌ విడుదల చేస్తామని, మీడియా ప్రచారం చేయాలని, వాస్తవాలు తెలియజేయాలని కోరారు. గతంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు రాజశేఖర్‌ రెడ్డి, కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాగ్‌ను తప్పుబట్టారని, కానీ కాగ్‌ మమ్మల్ని ఎన్నోసార్లు మెచ్చుకున్నదని గుర్తు చేశారు. సాగునీటి రంగంపై ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రం వైట్‌ పేపర్‌ కాదు.. ఫాల్స్‌ పేపర్‌ అన్నారు. నాలుగు ఎంపీ సీట్ల కోసం మేడిగడ్డ వ్యవహారాన్ని భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఈ వైట్‌ పేపర్‌ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సెల్ఫ్‌ గోల్‌ కొట్టుకున్నదని విమర్శించారు. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపితే సమాధానం చెప్పకుండా దాటేశారన్నారు. స్థిరీకరణ, ఆయకట్టు విషయంలో వాస్తవాలు దాచి పెట్టారన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది కాంగ్రెస్‌ అనీ, గ్యారంటీలను అమలు చేయలేక మేడిగడ్డ చుట్టూ తిప్పుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం సాగు నీరు, కరెంట్‌, రైతుబంధు రావడం లేదన్నారు. తాను సభలో మాట్లాడితే 8 మంది మంత్రులు అడ్డుకోవడాన్ని ప్రజలు చూశారన్నారు. మేం అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేక తప్పించుకున్నారన్నారు. వాస్తవాలు బయటికి రాకుండా అడ్డుకున్నారని, సభలో అడ్డుకున్నా, ప్రజల్లో అడ్డుకోలేరన్నారు.

Spread the love