ఒకే దేశం – ఒకే విద్యా బోర్డు వద్దు

One country - no one education board– ఏకరూప బోర్డు భాషను పరిగణనలోకి తీసుకోదు
– విద్యా ఉమ్మడి జాబితాలోని అంశం
– విద్యా హక్కు చట్టంలోని సెక్షన్‌ 7(6) ప్రకారం ఎన్సీఈఆర్టీ
– పాఠ్యాంశాల రూపకల్పనలో ఎస్‌ఐఈ ఉంటాయి
– సుప్రీంకోర్టులో పిటిషన్‌ను వ్యతిరేకించిన సీబీఎస్‌ఈ
న్యూఢిల్లీ : ‘ఒకే దేశం, ఒకే ఎడ్యుకేషన్‌ బోర్డు’ వద్దని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) పేర్కొంది. ఈ మేరకు ‘ఒకే దేశం, ఒకే ఎడ్యుకేషన్‌ బోర్డు’ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానంలో వ్యతిరేకించింది. విద్యార్థి స్థానిక పరిస్థితి, సంస్కృతి ఆధారంగా పాఠ్యాంశాలతో మెరుగ్గా సంబంధం కలిగి ఉంటారని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఒకే విధమైన స్కూల్‌ సిలబస్‌, ఎడ్యుకేషన్‌ బోర్డు అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో బీజేపీ నేత అశ్విని ఉపాధ్యారు దాఖలు చేసిన పిటిషన్‌పై సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘దేశమంతటా ఏకరూప బోర్డు/సిలబస్‌ స్థానిక సందర్భం, సంస్కృతి, భాషను పరిగణనలోకి తీసుకోదు. స్థానిక వనరులు, నైతికతలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు అవసరమైన జాతీయ ఫ్రేమ్‌వర్క్‌ ఉంది” అని సీబీఎస్‌ఈ పేర్కొంది. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్‌ 7(6) ప్రకారం జాతీయ పాఠ్యాంశాలను రూపొందించడానికి నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్సీఈఆర్టీ) అకడమిక్‌ అథారిటీగా నోటిఫై చేసినప్పటికీ, రాష్ట్రాలు కూడా రాష్ట్ర ఏజెన్సీలకు నోటిఫై చేశాయని సీబీఎస్‌ఈ తెలిపింది. ఎన్సీఈఆర్టీ, స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఎస్‌ఐఈ) పాఠ్యాంశాలను సిద్ధం చేస్తాయి. ఎందుకంటే పాఠశాల విద్య అనేది ఉమ్మడి జాబితాలోని అంశమని పేర్కొంది. అందువల్ల రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను స్వీకరించడానికి, తిరస్కరించడానికి స్వేచ్ఛను కలిగి ఉంటాయి’ అని సీబీఎస్‌ఈ తెలిపింది. రాజ్యాంగంలో విద్య ఉమ్మడి జాబితాలో ఒక సబ్జెక్ట్‌గా ఉండటం, మెజారిటీ పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండటం వల్ల సంబంధిత రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు సిలబస్‌, పాఠ్యాంశాలను రూపొందించి పాఠశాల పరీక్షలు నిర్వహిస్తాయని పేర్కొంది. స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్సిఈఆర్టీలు), స్టేట్‌ ఎడ్యుకేషన్‌ బోర్డులు ఎన్సీఈఆర్టీ మోడల్‌ సిలబస్‌, పాఠ్యపుస్తకాలను స్వీకరించడం, లేదా స్వీకరించకపోవడం, లేదా ఎన్సీఎఫ్‌ ఆధారంగా స్వంత సిలబస్‌, పాఠ్యపుస్తకాలను తయారు చేసుకోవడం చేస్తాయని పేర్కొంది.

Spread the love