– సింగరేణి ప్రాంత గనుల వేలంపై నేడు ఆందోళన
– కార్మికులు, రాజకీయ పార్టీ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ – కోల్‌సిటి
బొగ్గుగనుల వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవు తున్నాయి. తెలంగాణలోని గనులు ఈ ప్రాంతానికే చెందాలని సింగరేణి కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గనులను వేలం వేసేందుకు జూన్ 21 కేంద్రబొగ్గు గనుల శాఖ నామినేషన్లు దాఖలు చేయాలని కోరింది. దేశవ్యాప్తంగా 61 గనులకు వేలం ప్రకటన చేసింది. వీటిలో తెలంగాణకు చెందిన శ్రావణపల్లి బొగ్గుబ్లాకు-3 ఉండటంతో ఈ ప్రాంత కార్మిక సంఘాలు ఆందోళన బాటపట్టాయి.
2015లో నుంచే..
135 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి ఇప్పటి వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బొగ్గు నిక్షేపాలపై పూర్తి హక్కుదారుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం 2015లో ఎంఎండీఆర్(మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్‌మెంట్ రెగ్యులేషన్ యాక్ట్) చట్టం తీసుకురావడంతో దేశంలోని ఖనిజాలపై పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. అప్పటి నుంచే ప్రజల సహజ వనరులైన బొగ్గు గనులను వేలం వేస్తూ ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 61గనులకు వేలం ప్రకటన చేసింది. అందులో సింగరేణి ప్రాంతంలోని శ్రావణపల్లి బొగ్గుబ్లాకు-3 కూడా ఉంది. గతంలో మూడుసార్లు నిర్వహించిన టెండర్లలో మన రాష్ట్రంలోని శ్రావణపల్లితో పాటు సత్తుపల్లి, కోయగూడెం, కెకె-6 గనులు కూడా ఉన్నాయి. వీటిలో కోయగూడెం, సత్తుపల్లి బ్లాకులకు రెండు సంస్థలు టెండర్లు వేయగా.. వాటిని ఆ సంస్థలకు కేటాయించారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి పనులూ మొదలు పెట్టలేదు. తాజాగా శ్రావణపల్లి గనికి మళ్లీ టెండర్లు పిలవడంపై సింగరేణిలో ఆందోళన నెలకొంది.
టెండర్లకు వెళ్లని సింగరేణి..
కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేస్తున్నా ఇప్పటి వరకు సింగరేణి పాల్గొనలేదు. దీంతో తెలంగాణలోని రెండు బొగ్గు బ్లాకులు ప్రయివేటుకు వెళ్లాయి. సింగరేణి అంతటి స్థాయి లేకపోవడంతో ఆ కంపెనీలు పనులు మొదలు పెట్టలేదు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకించడంతో సింగరేణి వేలంలో పాల్గొనలేదు. ఇప్పటికే రెండు బొగ్గుబ్లాకులు చేజారడంతో తాజా వేలం ప్రకటనలో సింగరేణి పాల్గొని శ్రావణపల్లి గనికి టెండరు నామినేషన్ వేసింది.
కొంగు బంగారానికి ముప్పు..
తెలంగాణ కొంగు బంగారంగా విలసిల్లుతున్న సింగరేణి సంస్థ మనుగడ ఇప్పడు ప్రమాదంలో పడింది. ఈ ప్రాంతంలోని బొగ్గు నిల్వలు తరిగి పోతుండటం.. కొత్తగా ఏర్పాటు చేస్తున్న బొగ్గు బ్లాకులు ప్రయివేటుపరం అవుతుండటంతో బొగ్గు ఉత్పత్తిలో అపార అనుభవం ఉన్న సింగరేణి మనుగడ ప్రశ్నార్థకమైంది. 2015కు ముందు గోదావరి-ప్రాణహిత లోయలో 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బొగ్గు నిల్వలపై సింగరేణికి గుత్తాధిపత్యం ఉండేది. సింగరేణి ప్రస్తుతం 39బొగ్గు గనుల్లో మైనింగ్ చేస్తుండగా.. రానున్న ఐదేండ్లలో వీటిలో 8 భూగర్భ గనులు, మూడు ఓపెన్ కాస్టులు మూతపడనున్నాయి. ఆ తర్వాత మరో ఐదేండ్లలో 2032 నాటికి మరో 5 భూగర్భ గనులు, 6ఓపెన్ కాస్టులు కలిపి.. 11 గనులు మూతపడతాయి. 2037-38 నాటికి మరో 5గనులు మూతపడ నుండగా.. 12 గనులు మాత్రమే సింగరేణి పరిధిలో ఉంటాయి.
తగ్గిపోతున్న కార్మికుల సంఖ్య
2014నాటికి సింగరేణిలో కార్మికుల సంఖ్య 60 వేలకు పైగా ఉండగా.. ప్రస్తుతం 40 వేలకు తగ్గింది. రానున్న 15ఏండ్లలో గనుల సంఖ్య 12కు తగ్గితే కార్మికుల సంఖ్య 8వేలకు పడిపోయే ప్రమాదం ఉంది. గడిచిన పదేండ్లలో సింగరేణి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.49,666 కోట్లను పన్నుల రూపంలో చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వానికి 9రకాల ట్యాక్సులు, రాయల్టీల రూపంలో రూ.23,446 కోట్లు చెల్లించగా, కేంద్ర ప్రభుత్వానికి 21రకాల పన్నుల ద్వారా రూ.26,207 కోట్లు చెల్లించింది. దీంతో పాటు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో గనులు విస్తరించి ఉండటంతో ఆ ప్రభావిత ప్రాంత గ్రామాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనపై సీఎస్‌ఆర్ నిధుల కింద అభివృద్ధి పనులు చేపడుతోందని సింగరేణికే ఈ ప్రాంత గనులు అప్పగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
2020 నుంచే ముమ్మరం..
ఎంఎండీఆర్ యాక్ట్-2016 నుంచి అమల్లోకి వచ్చినా దేశంలో 2020నుంచి బొగ్గు గనుల వేలం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే తొమ్మిది సార్లు వేలం నిర్వహించగా.. 10వ విడత వేలం హైదరాబాద్‌లోనే చేపడుతున్నారు. ఎంఎండీఆర్ యాక్ట్-2016లోని సెక్షన్ 17(2)ఏ ప్రకారం ప్రత్యేక అధికారాలతో బొగ్గు బ్లాకులను రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థకు కేటాయించే విచక్షణ కేంద్రానికి ఉంది. ఈ మేరకు బొగ్గు బ్లాకులను సింగరేణికి రిజర్వ్ చేసి తెలంగాణ ప్రాంత ఉనికితో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కార్మిక సంఘాల నాయకులు కేంద్రానికి నివేదికలు ఇచ్చారు.
శ్రావణపల్లి కావాల్సిందే..
శ్రావణపల్లి ఉపరితల గని ఏర్పాటు అంశం ప్రస్తుతం రాష్ట్రం, దేశవ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలంలో శ్రావణపల్లి గనిని ఏర్పాటు చేసేందుకు సింగరేణి 20ఏండ్ల్ల కిందట ప్రణాళిక సిద్ధం చేసింది. అప్పటి నుంచి అనేక రకాల సర్వేలు నిర్వహించి ఇప్పటికే రూ.10 కోట్లకు పైగా ఖర్చు చేసింది. గతంలో దీని ఏర్పాటుపై నిరసనలు వెల్లువెత్తడంతో .. సింగరేణి పూర్తిస్థాయిలో ముందుకెళ్లలేకపోయింది.
శ్రావణపల్లి గని బలాబలాలు..
– ఈ గనిలో 94 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉండగా, దీని జీవితకాలం 33 సంవత్సరాలు.
– ఓసీ ఏర్పాటుకు అంచనా వ్యయం సుమారు రూ.1000 కోట్లు
– గ్రేడ్ 9 బొగ్గు వెలువడితే టన్నుకు రూ.6 వేలు లభిస్తుంది.
– గ్రేడ్.1 బొగ్గు రూ.4500 లభిస్తుంది.
– 600 మందికి శాశ్వత ఉద్యోగులకు, 400 మందికి కాంట్రాక్టు ఉద్యోగ అవకాశం ఉంది.
– ఓసీ ఏర్పాటుకు 1936 హెక్టార్లు భూమి అవసరం కాగా దీనిలో అటవీశాఖకు సంబంధించింది-878 హెక్టార్లు కాగా ప్రభుత్వం, ప్రయివేట్‌కు చెందినది 1058 హెక్టార్ల భూమిని గుర్తించారు
– ఈ గని నుంచి బొగ్గు వెలికి తీయడానికి సుమారు నాలుగేండ్లు పట్టే అవకాశముంది.
ముంపు ప్రాంతాలు..
ముంపు గ్రామాల్లో ప్రధానంగా శ్రావణపల్లి ఒక్కటి కాగా ఇక్కడ 60 కుటుంబాలు నివాసముంటున్నాయి. పంచాయతీ కేంద్రమైన జెండా వెంకటాపూర్ 350 కుటుంబాలు ఉండగా 150కుటుంబాలు ముంపునకు గురికానున్నాయి. శ్రావణపల్లి శివారులోని సర్వే నంబర్ 4 నుంచి 50 వరకు 100 హెక్టార్లు ముంపునకు గురికానుంది.
భగీరదపేట, శ్రావణపల్లి గ్రామం శివారులోని 40, 96 సర్వే నంబర్, జోగాపూర్, మెట్‌పల్లి, నార్వాయిపేట గ్రామాల రైతులకు చెందిన 200హెక్టార్ల భూమి ముంపునకు గురవుతోంది. 200 హెక్టార్లలో సుమారుగా 90 శాతం మామిడి తోటలు ఉన్నాయి. ఇక్కడ ఎకరానికి రూ.10-20 లక్షల వరకు ధర పలుకుతోంది. ఈ భూములను రైతులు వదులు కోవడానికి సిద్ధంగా లేరు. ఈ ప్రభావిత ప్రాంత గ్రామాలైన వెంకటాపూర్, మెట్‌పల్లి, చిత్తాపూర్, ఆవడం, మామిడిగట్టు, నార్వాయిపేట తదితర గ్రామాల్లో 1200 కుటుంబాలు నివాసముంటున్నాయి. జెండా వెంకటాపూర్లో 20 ఎకరాల్లో ఉన్న ఉన్న క్యాథలిక్ చర్చి ఆస్పత్రి ముంపు జాబితాలో ఉంది.
చట్టంలో వెసులుబాటు
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎంఎండీఆర్ చట్టంలోనే వెసులుబాటు ఉంది. దానిని వినియోగించుకొని ఈ ప్రాంత గనులను సింగరేణికి కేటాయించేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. ఎంఎండీఆర్ చట్టం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికి కేటాయిస్తే ఎలాంటి అభ్యంతరమూ ఉండదు. బొగ్గు ఉత్పత్తిలో అపార అనుభవమున్న సింగరేణికి గనులను కేటాయిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాయల్టీ రూపంలో పన్నులు వస్తాయి.
– జనక్ ప్రసాద్, ఐఎన్టీయూసీ నాయకులు
గనులు వస్తే ఉపాధి పెరుగుతుంది
సింగరేణికి గనులను కేటాయిస్తే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నామినేషన్ వేసిన సింగరేణికి శ్రావణపల్లి గనిని కేటాయించాలి. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి ఈ ప్రాంతానికి చెందిన నేత.. దీనిపై సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. గతంలో నామినేషన్ పద్ధతిలో గనులను కేటాయించిన సందర్భం ఉంది. అదేవిధంగా సింగరేణికి కూడా శ్రావణపల్లి గనిని కేటాయించాలి.
– వి.సీతారామయ్య, ఏఐటీయూసీ నాయకులు