అధికారంలోకి రావటానికి ఐక్యంగా ముందుకు సాగాలి

– శ్రీ ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి నదీమ్‌ జావిద్‌
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి నదీమ్‌ జావిద్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రతికూల పవనాలు వీస్తున్నాయని దీనికి నిదర్శనం కర్ణాటక ఎన్నికలన్నారు. కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగి పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేల క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ గతంలో ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదని ప్రజల్లోకి వాటిని తీసుకువెళ్లాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రియాంక గాంధీ పర్యటన ఉంటుందని ఆసిఫాబాద్‌కు కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. హైదరాబాద్‌ యూత్‌ డిక్లరేషన్‌ తెలంగాణ యువశక్తిని మేలుకొలుపేందుకు ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీలు నిర్వహించడానికి నిర్ణయించామని వీటిపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలన్నారు. జూన్‌ ఒకటో తేదీ లోపు 16 నుండి 35 సంవత్సరాలు ఉన్న యువత ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా చూడాలన్నారు. ప్రతిక్షణం ప్రజల్లో ఉంటూ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలన్నారు. ఈ సమావేశంలో పీసీసీి ప్రధాన కార్యదర్శి మర్సుకోల సరస్వతి, సభ్యులు కృష్ణారెడ్డి, సత్తు మల్లేష్‌, జిల్లా నాయకులు గణేష్‌ రాథోడ్‌ రావి, శ్రీనివాస్‌, నాయకులు అనిల్‌ గౌడ్‌, గుండ శ్యామ్‌, చరణ్‌ పాల్గొన్నారు.

Spread the love