మా ఇష్టం… మా కాలేజీ..

– దోస్త్‌లో లేని ప్రయివేటు డిగ్రీ కళాశాలల ఇష్టారాజ్యం
– అడ్డగోలుగా ఫీజు దోపిడీ
– నిబంధనలకు యధేచ్చగా తూట్లు
– రిజర్వేషన్లు పాటించని వైనం
– అందులో చేరితే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాదు
రాష్ట్రంలో డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) పరిధిలో లేని ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. విశ్వవిద్యాలయం నిర్ణయించినవి కాకుండా సొంతంగా అడ్డగోలుగా ఫీజును ఖరారు చేసి వసూలు చేస్తున్నాయి. విద్యార్థులను దోపిడీ చేస్తున్నాయి. ఇంకోవైపు విశ్వవిద్యాలయం అనుబంధ గుర్తింపును మాత్రం పొందుతున్నాయి. కానీ నిబంధనలకు మాత్రం యధేచ్చగా తూట్లు పొడుస్తున్నాయి. విశ్వవిద్యాలయం నిర్ణయించిన ఫీజులను వసూలు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం.
పేద విద్యార్థులకు తీరని అన్యాయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో బీకాం కంప్యూటర్స్‌ కోర్సుకు భారీగా డిమాండ్‌ ఉన్నది. ఓయూ పరిధిలో రూ.10,950 వసూలు చేయాలి. దానికి అదనంగా రూ.10 వేలు విద్యార్థుల నుంచి వసూలు చేసుకునేందుకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించింది. కానీ దోస్త్‌ పరిధిలో లేని కాలేజీలు ఎంత ఫీజు వసూలు చేస్తాయన్న దానికి ప్రాతిపదిక లేదు. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ ప్రయివేటు డిగ్రీ కాలేజీ బీకాం కంప్యూటర్స్‌ కోర్సుకు రూ.1.10 లక్షలు వసూలు చేస్తున్నట్టు తెలిపింది. ఇంకోవైపు డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను దోస్త్‌ ద్వారా ఓ షెడ్యూల్‌ ప్రకారం చేపడతారు. కానీ దోస్త్‌ పరిధిలో లేని ప్రయివేటు డిగ్రీ కాలేజీలు ఆ షెడ్యూల్‌ను పాటించకుండా కాలపరిమితి లేకుండా అడ్మిషన్లు చేపడుతున్నాయి. దీంతో విద్యాసంవత్సరం సజావుగా నడవడం లేదన్న అభిప్రాయం విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి అధికారుల నుంచి వ్యక్తమవుతున్నది. ‘మా కాలేజీ మా ఇష్టం’ అన్నట్టుగా ఆ కాలేజీలు వ్యవహరిస్తున్నాయి. 2016-17 విద్యాసంవత్సరంలో దోస్త్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో దోస్త్‌ ద్వారానే ప్రవేశాలు జరుగుతున్నాయి. అయితే మైనార్టీ, గురుకుల డిగ్రీ కాలేజీలకు దోస్త్‌ నుంచి మినహాయింపు ఉన్నది. కానీ కొన్ని ప్రయివేటు డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు హైకోర్టు అనుమతితో దోస్త్‌ పరిధిలో చేరకుండానే సొంతంగా ప్రవేశాలు చేపడుతున్నాయి.
దోస్త్‌ ద్వారా చేరితేనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌
దోస్త్‌ ద్వారా చేరిన విద్యార్థులకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వర్తిస్తుంది. వారికే కాలేజీ ఫీజుతోపాటు స్కాలర్‌షిప్‌ వస్తుంది. దోస్త్‌ పరిధిలో లేకుండా సొంతంగా ప్రవేశాలు చేపట్టే ప్రయివేటు డిగ్రీ కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వర్తించదు.
అంటే ఆ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ రాదు. అయితే మైనార్టీ, సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలు, గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలు, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీలకు దోస్త్‌ నుంచి ప్రభుత్వమే మినహాయింపు కల్పించింది. అందుకే వాటిలో చేరిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వర్తిస్తుంది. 2022-23 విద్యాసంవత్సరంలో దోస్త్‌ పరిధిలో లేకుండా మైనార్టీ, ప్రయివేటు డిగ్రీ కాలేజీలు కలిపి 63 ఉన్నాయి. వాటిలో 36,817 సీట్లుంటే, 18,421 మంది చేరారు. 64 గురుకుల డిగ్రీ కాలేజీల్లో 15,774 సీట్లకుగాను 8,509 మంది ప్రవేశం పొందారు. ఇంకోవైపు దోస్త్‌ పరిధిలో లేని ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో ఫీజులూ భారీగా ఉంటాయి.
ఆ ఫీజుల మొత్తాన్ని విద్యార్థులే భరించాలి. అంటే డబ్బున్నోళ్లకే ఆ కాలేజీల్లో సీట్లు దొరుకుతాయి. ఆ కాలేజీల్లో చదవాలన్న ఆశ ఉన్నా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యం లేని కారణంగా పేద విద్యార్థులు తీవ్రంగా అన్యాయానికి గురవుతున్నారు. ఇంకోవైపు ఆ కాలేజీల్లో రిజర్వేషన్లు పాటించడం లేదు. మెరిట్‌ లేకుండానే అడ్మిషన్లు కల్పిస్తున్నారు. కేవలం డబ్బు చెల్లించిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా అన్ని విషయాల్లోనూ ఆ కాలేజీలు నిబంధనలకు తిలోదకాలిస్తున్నాయి.
అయితే దోస్త్‌ పరిధిలో లేని ప్రయివేటు డిగ్రీ కాలేజీలను కట్టడి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే కొత్త కోర్సులను మంజూరు చేయడం, సీట్లు పెంచడం వంటి అవకాశాలను కల్పించకూడదని నిర్ణయం తీసుకున్నది.
దోస్త్‌ పరిధిలోకి రావాలి : ఆర్‌ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మెన్‌
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలన్నీ దోస్త్‌ ద్వారానే ప్రవేశాలు చేపట్టాలి. కోర్టు ద్వారా అనుమతి పొందిన కాలేజీలు కూడా దోస్త్‌ పరిధిలోకి రావాలి. ఇటీవల ఆ కాలేజీ యాజమాన్యాలతో సమావేశాన్ని నిర్వహించాం. విశ్వవిద్యాలయం నిర్ణయించిన ఫీజు తక్కువగా ఉన్నందునే దోస్త్‌ పరిధిలో రావడం లేదంటూ మా దృష్టికి తెచ్చాయి. దోస్త్‌ పరిధిలోకి వస్తే ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తాం. ఇప్పటికే ఓయూ పరిధిలో రూ.10 వేలు విద్యార్థుల నుంచి వసూలు చేసుకునేందుకు అవకాశమిచ్చాం. అవసరమైతే యాజమాన్య కోటా అమలుకు చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలోని విద్యార్థులందరూ అన్ని కాలేజీల్లో సీట్లు పొందే అవకాశముండాలి. దీన్ని ఆ కాలేజీలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

Spread the love