11నెలల పాలనలో సర్వం కోల్పోయాం

Former minister and Siddipet MLA Tanniru Harish Rao– మద్దతు ధర రాక రైతుల అవస్థలు
– ప్రజలు ఏం కోల్పోయారో చెప్పేందుకు నేను రెడీ
– ఏం పొందారో చెప్పేందుకు సిద్ధమా : సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు చాలెంజ్‌
నవతెలంగాణ – వేములవాడ
”కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రం సర్వం కోల్పోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు.. వారు ఏం కోల్పోయారో చెప్పేందుకు నేను రెడీ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వల్ల ప్రజలు ఏం పొందారో చెప్పేందుకు మీరు సిద్ధమా..?” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పారని విమర్శించారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో మంగళవారం దర్శనం అనంతరం బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి చెల్మెడ లక్ష్మీనరసింహా రావు నివాసంలో హరీశ్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. పంటలకు మద్దతు ధర రాకపోవడంతో రైతులు దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా గంగుల కమలాకర్‌ ఉన్నప్పుడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చివరి గింజ దాకా కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణలో రైతులు పండించిన వడ్లకు బోనస్‌ ఇచ్చామని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.
ఆరు గ్యారంటీలు, 420 హామీలు అని ఎన్నికల ముందు చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పారన్నారు. రుణమాఫీ పాక్షికంగానే చేశారని, 31రకాల కారణాలు చెప్పి సగానికిపైగా చేయలేదని విమర్శించారు. కేసీఆర్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు సీఎం రేవంత్‌రెడ్డికి లేదన్నారు. కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదు.. ప్రత్యేక రాష్ట్రం లేదు.. మీరు సీఎం అయ్యేవారు కాదని అన్నారు. ఈ 11 నెలల కాంగ్రెస్‌ పాలనలో అప్పులు, రైతుల సమస్యలు, ఆస్పత్రులు, తాగు, సాగు నీరు, కరెంటు, విద్య, వైద్యం.. ఇలా అన్ని అంశాల్లో చర్చించేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 36 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్‌ సమయంలోనూ కేసీఆర్‌ రైతుబంధు ఇచ్చారని.. కానీ మీ పాలనలో ఇప్పటికీ రైతుబంధు ఇవ్వడం లేదని అన్నారు. నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని, అశోక్‌నగర్‌లో నిరుద్యోగ యువతను వీపులు పగిలేలా కొట్టారని.. దళితబంధు, రైతుబంధు, గొర్రెలు, చేప పిల్లల పంపిణీ, ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, శాంతిభద్రతలు, జర్నలిస్టులు ప్రశ్నించే హక్కు కోల్పోయారని.. ఇలా తెలంగాణ ప్రజలు ప్రశాంతతను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేయాలని, రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో వేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌, దేశపతి శ్రీనివాస్‌, ఎల్‌.రమణ, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆకుల ఆగన్న, వేములవాడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి, ఏనుగు మనోహర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Spread the love