ప్రజాతీర్పును గౌరవిస్తాం

ప్రజాతీర్పును గౌరవిస్తాం– సీపీఐ(ఎం)ను ఆదరించిన ఓటర్లకు కృతజ్ఞతలు
– ఎన్నికల్లో పోటీ చేసి లక్ష్యాలను చేరుకున్నాం
– ప్రజా పోరాటాలు ఆగవు : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌
నవతెలంగాణ-భువనగిరి
భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికలలో ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని, సీపీఐ(ఎం)ను ఆదరించిన ఓటర్లకు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి, జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రజలే సీపీఐ(ఎం)కు విరాళాలు ఇచ్చి ఓట్లు వేశారని తెలిపారు. గతం కన్నా అధికంగా ఓట్లు వేసి ఆదరించారని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. భువనగిరి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి సీపీఐ(ఎం) మూడు లక్ష్యాలతో ముందుకొచ్చిందన్నారు. పార్టీ చరిత్రను, విశిష్టతను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని సాధించామని తెలిపారు. ప్రజా పోరాటాలతో వచ్చిన ఫలితాలను ప్రజలకు వివరించామన్నారు. వీటితోపాటు ఇతర పార్టీలు చేస్తున్న అవినీతి, అక్రమాలను బయట పెట్టామని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలు, మతోన్మాద, ఆర్థిక, రాజకీయాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురాగలిగామన్నారు.
ఎన్నికల సందర్భంగా తనకు సహకరించిన పార్టీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మండల, గ్రామ కమిటీలు, పార్టీ సానుభూతిపరులు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా సీపీఐ(ఎం)కి వచ్చిన ఓట్లపై సమీక్ష చేసి లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు. భువనగిరి ఎంపీగా ఎన్నికైన చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు తీసుకు రావాలని కోరారు.ఎయిమ్స్‌ వైద్యశాలలో పూర్తిస్థాయి లో సేవల కోసం పోరాటం చేస్తామన్నారు. జిల్లా కేంద్రంలో పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల నిలుపుదలతో పాటు మెట్రో, ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రైళ్ల రాక కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా చౌటుప్పల్‌, ఇబ్రహీంపట్నం ప్రాంతాలకు రైలు సౌకర్యం కల్పిస్తా మని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దాన్ని అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, దాసరి పాండు, కల్లూరు మల్లేశం, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ పాల్గొన్నారు.

Spread the love