పతకాలను గంగా నదిలో విసిరేస్తాం…

నవతెలంగాణ-హైదరాబాద్ : భారత దేశ టాప్ రెజ్లర్లు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు. తమ పతకాలను మంగళవారం సాయంత్రం 6 గంటలకు హరిద్వార్‌లోని గంగా నదిలో విసిరేస్తామని, ఇండియా గేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్రిజ్ భూషణ్‌‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ తదితరులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. వీరు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. వీరికి రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో, రెజ్లర్లు మంగళవారం సాయంత్రం 6 గంటలకు హరిద్వార్‌లోని గంగా నదిలో తమ పతకాలను నిమజ్జనం చేస్తారని చెప్పారు. ఈ పతకాలు తమ ప్రాణమని, తమ ఆత్మ అని చెప్పారు. వీటిని గంగా నదిలోకి విసిరేసిన తర్వాత జీవించి ఉండటంలో అర్థం లేదన్నారు. వీటిని గంగా నదిలో కలిపేసిన తర్వాత తాము ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమను ‘‘మా బిడ్డలు’’ అని అంటూ ఉంటారని, కానీ ఆయన కూడా తమ పట్ల ఎటువంటి శ్రద్ధ చూపించడం లేదని ఆరోపించారు. తమను అణచివేస్తున్న బ్రిజ్ భూషణ్‌ను నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారన్నారు. ఆయన తళతళ మెరిసే తెల్లని దుస్తుల్లో ఫొటోలకు ఫోజులిచ్చారని మండిపడ్డారు. ఆ కాంతిలో తాము వెలిసిపోయామన్నారు. రెజ్లర్లు ఆదివారం నూతన పార్లమెంటు భవనంవైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఢిల్లీ పోలీసులు వీరిని అడ్డుకున్నారు. వినేష్ ఫోగట్, బజ్రంగ్ పూనియా, సంగీత ఫోగట్, సాక్షి మాలిక్, తదితరులను అదుపులోకి తీసుకున్నారు.

Spread the love