కొన్ని వారాల ముందే భారత్‌కు చెప్పాం

– నిజ్జార్‌ హత్యపై కెనడా ప్రధాని ట్రుడో
– తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం : అమెరికా
ఒట్టావా : సిక్కు వేర్పాటువాద నేత హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర వుందనడానికి సంబంధించిన నిఘా సమాచారాన్ని కొన్ని వారాల క్రితమే భారత్‌తో పంచుకున్నామని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో తెలిపారు. సోమవారం భారత్‌ గురించి తాను చేసిన విశ్వసనీయమైన ఆరోపణల వ్యవహారాన్ని చాలా వారాల క్రితమే భారత్‌కు తెలియజేశామని చెప్పారు. ఒట్టావాలో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్‌తో కలిసి నిర్మాణాత్మకంగా పనిచేయడానికి ఎదురుచూస్తున్నామన్నారు. ఈ నిఘా సమాచారం ఏ గూడచారి సంస్థ ఇచ్చిందన్న వివరాలు ఆయన వెల్లడించడం లేదు.
దర్యాప్తు పూర్తికావడమే ముఖ్యమైన అంశం : అమెరికా
నిజ్జార్‌ హత్యలో భారత్‌ పాత్ర వుందంటూ వచ్చిన ఆరోపణలపై తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి జవాబుదారీతనం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఈ దర్యాప్తులో కెనడాతో భారత్‌ కలిసి పనిచేయడం కీలకంగా వుంటుందని బ్లింకెన్‌ విలేకర్లతో వ్యాఖ్యానించారు. దర్యాప్తు విషయంలో కెనడాకు సహకరిస్తామని చెప్పారు. ఈ దర్యాప్తు ముందుకు సాగి, పూర్తి కావడమే జరగాల్సిన అత్యంత ముఖ్యమైన అంశంగా వుందని తెలిపారు.
కెనడియన్లకు వీసాల జారీ నిలుపుదల
భారత్‌, కెనడాల మధ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో కెనడియన్లకు వీసాలను భారత్‌ నిలుపుచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వున్నప్పటికీ కెనడియన్లకు భారత్‌ వీసాలను జారీ చేసేది లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వారం నుంచే ఇది అమల్లోకి వస్తోంది. కెనడాలోని భారత్‌ ఎంబసీ, కాన్సులేట్‌ కార్యాలయాలకు బెదిరింపులు వస్తున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. అందువల్ల తాత్కాలికంగా వీసాల జారీని నిలిపివేస్తున్నామని చెప్పారు. ఇ వీసాలు కూడా సస్పెన్షన్‌ పరిధిలోకే వస్తాయని తెలిపారు.

Spread the love