నవతెలంగాణ-హైదరాబాద్: విశ్వక్‌సేన్ హీరోగా దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కించిన చిత్రం ‘లైలా’. ఆకాంక్ష శర్మ హీరోయిన్. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలో.. తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ విశేషాలు చెబుతూ 150 మేకల్లో చివరకు 11 మిగిలాయని నటుడు పృథ్వీరాజ్ చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సినిమాని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో విశ్వక్, నిర్మాత సాహు గారపాటి వివరణ ఇచ్చారు.
‘‘సోషల్ మీడియాలో ‘లైలా’ బాయ్‌కాట్ ట్రెండ్ చూసి షాకయ్యాం. ఆ వ్యక్తి మాట్లాడే సమయంలో నేను, హీరో అక్కడ లేం. చిరంజీవిని లోపలికి తీసుకొచ్చేందుకు వెళ్లాం. అది మాకు తెలియకుండా జరిగింది. ఏది ఏమైనా సినిమా ఒకరిద్దరిది కాదు.. వేల మంది కష్టపడి పనిచేస్తేనే అవుట్‌పుట్ వస్తుంది. ఇది వేరే కోణంలో ప్రచారం అవడం వల్ల సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ ఇబ్బందే. సినిమాని సినిమాలాగా చూడాలనేది మా విజ్ఞప్తి’’ అని హీరో విశ్వక్ సేన్ కోరారు.