శాంతికి విఘాతం కలిగిస్తే ఆర్‌ఎస్‌ఎస్‌నైనా నిషేధిస్తాం

– కర్నాటక మంత్రి ప్రియాంక్‌ ఖర్గే
బెంగళూరు : కర్నాటక శాంతియుత వాతావర ణానికి విఘాతం కలిగించే ఏ సంస్థనైనా నిషేధిస్తా మని ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్‌ ఖర్గే అన్నారు. పాపులర్‌ ఫ్రంట్‌, భజరంగ్‌ దళ్‌పై నిషేధం విధిస్తున్నట్టు మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా కర్నాటకలో ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధిస్తారా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. శాంతిభద్రతలకు విఘా తం కలిగించే, మత విద్వేషాలను వ్యాప్తి చేసే, కర్నాటకకు చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నించే మతపరమైన లేదా రాజకీయ సంస్థలతో వ్యవహరిం చడానికి లేదా నిషేధించడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనుకాడదు. ‘ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా మరేదైనా సంస్థ కావచ్చు, అవి శాంతిభద్రతలకు ముప్పు కలిగిస్తే, వాటిని నిషేధించడానికి మేం వెనుకాడం’ అని మంత్రి ఒక జాతీయ వార్తా సంస్థతో అన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో కూడా పంచుకున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో భజరంగ్‌దళ్‌, పాపులర్‌ ఫ్రంట్‌లను నిషేధిస్తామని కాంగ్రెస్‌ హామీనిచ్చిన విషయం తెలిసిందే.

Spread the love