స్నేహ బంధం ఎంతో మధురమైనది. చిన్నా-పెద్దా, ధనికా-పేద, ఆడా-మగా అనే తేడా స్నేహానికి ఉండదు. ఎలాంటి స్వార్థం లేని బంధం ఏదైనా ఉంది అంటే అది స్నేహమే అని చెప్పొచ్చు. అలాంటి స్వచ్ఛమైన స్నేహంలో లోపం ఉంది అని తెలిస్తే ఆ స్నేహితులు పడే బాధ వర్ణనాతీతం. అలాంటి ఓ సమస్యే ఈ వారం ఐద్వా అదాలత్‌లో మీ కోసం…
మాధవికి 27 ఏండ్లు ఉంటాయి. ఆమెకు రంజిత్‌తో పెండ్లి జరిగి మూడేండ్లు అవుతుంది. ఇద్దరూ కలిసి మెలిసి అన్యోన్యంగానే ఉంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మాధవికి రంజిత్‌పై అనుమానం వచ్చింది. వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడేమో అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఇంకెవరో కాదు మాధవి స్నేహితురాలు లత. కానీ ఈ విషయం గురించి ఆమె లతను నేరుగా అడగలేకపోతుంది. అలా నేరుగా అడిగితే ఆమె ఏమనుకుంటుందో, ఇద్దరి మధ్య స్నేహం చెడిపోతుందేమో అనే భయంతో ఆమెను అడగలేక పోయింది. అలాగే భర్త రంజిత్‌ను కూడా అడగలేక పోయింది. ఎందుకంటే అతను ఆమెను బాగా చూసుకుంటాడు. ఎలాంటి లోటు లేకుండా, చిన్న కష్టం కూడా రాకుండా, ఆమె అడగక ముందే కావల్సినవన్నీ తెచ్చిపెడతాడు. అప్పుడప్పుడు బయటకు కూడా తీసుకెళుతుంటాడు. అలాంటి వ్యక్తికి తన భార్య అనుమానిస్తుంది అని తెలిస్తే ఆ ప్రేమ ఎక్కడ దూరం అవుతుందో అని భయంతో ఎటూ తేల్చుకోలేక పోయింది.
లత, మాధవికి మంచి స్నేహితురాలు. ఆమే వీరిద్దరికీ దగ్గరుండి పెండ్లి కూడా చేసింది. ముగ్గురూ మంచి స్నేహితులు. ఫంక్షన్లకి, పండగలకీ ఒకరి ఇంటికి ఒకరు వెళుతూ ఒక కుటుంబంలా కలిసి ఉండేవారు. అలాంటి వారిని అనుమానించడం సరైన పద్దతి కాదనే ఆలోచన వచ్చింది. మా దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్పుకొని ఎంతో బాధపడింది. ఆమె చెప్పింది మొత్తం విన్న తర్వాత మేము లతను పిలిచి మాట్లాడాము.
‘మేము కేవలం మంచి స్నేహితులం. అంతకు మించి మా మధ్య ఎలాంటి సంబంధం లేదు. అయినా మా మీద మాధవికి అనుమానం ఎందుకు వచ్చింది’ అన్నది. దానికి మేము ‘అలాంటప్పుడు రంజిత్ చేతిపై మీ పేరు ఎందుకు ఉంది. మీరిద్దరూ చాట్ చేసుకోవడం, ఫోన్‌లు మాట్లాడుకోవడం ఎందుకు’ అని అడిగాము. ‘మేమిద్దరం కాలేజీలో స్నేహితులం. ఆ విషయం మాధవికి కూడా తెలుసు. ఆ స్నేహంతో నేనే వారిద్దరికి పెండ్లి చేశాను. మాధవి, రంజిత్ బాగుండాలనే ఉద్దేశంతోనే వారిద్దరికి దగ్గరుండి మరీ పెండ్లి చేశాను. రంజిత్ కూడా మాధవిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఈ విషయం మీరు ఆమెనే అడగండి’ అంది.
‘మాధవికి రంజిత్‌తో ఎలాంటి సమస్యాలేదు. మీ వల్లనే ఆమె ఇబ్బంది పడుతుంది. మీకూ రంజిత్‌కి మధ్య స్నేహం మాత్రమే కాకుండా సంబంధం ఉందనుకుంటుంది. ఈ విషయం మిమ్మల్ని అడగటానికి ఇబ్బంది పడుతుంది. అందుకే మా దగ్గరికి వచ్చింది. మీరు నిజంగా మీ స్నేహితురాలి మంచి కోరుకుంటే నిజం చెప్పండి. ఆమెను మోసం చేయడం కరెక్టు కాదు’ అన్నాము.
‘మేము కాలేజీ రోజుల్లోనే రెండేండ్లు రిలేషన్‌లో ఉన్నాము. జాబ్ వచ్చిన తర్వాత ఇద్దరం పెండ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ మా ఇంట్లో పెండ్లికి ఒప్పుకోకపోవడంతో వేరే వ్యక్తిని పెండ్లి చేసుకోవల్సి వచ్చింది. నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆ పెండ్లి చేసుకున్నాను. మా ఇంట్లో ఒప్పుకోవడం లేదని చెబితే రంజిత్ కూడా ‘మీ ఇంట్లో వాళ్లకు నచ్చినట్టే చెయ్యి, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు’ అంటూ నా జీవితంలో నుండి వెళ్లిపోయాడు. అయితే తర్వాత రంజిత్ మానసికంగా చాలా నలిగిపోయాడు. అతన్ని అలా చూడలేక పోయాను. నేను రంజిత్ నుండి దూరంగా వచ్చి మూడేండ్లు అయినా పెండ్లి చేసుకోకుండా నా గురించి ఆలోచిస్తూ దిగులుగా ఉండేవాడు. ఎలాగైనా రంజిత్‌ను మళ్లీ మామూలు మనిషిని చేయాలనుకున్నాను. నా స్నేహితురాలైన మాధవితో రంజిత్‌కి పెండ్లి అయ్యేలా చేశాను. ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ ఇన్నేండ్ల తర్వాత రంజిత్ నా ముందుకు రావడం, అతనితో తిరిగి క్లోజ్‌గా మాట్లాడడం, నా పర్సనల్ జీవితంలో ఉన్న లోటు నన్ను అతని వైపు ఆకర్షించేలా చేశాయి. అయితే రంజిత్‌కు మాత్రం నాపై ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నా పెండ్లి అయినప్పటి నుండి నన్ను ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. కేవలం ఓ స్నేహితురాలిగానే చూస్తున్నాడు. ఇందులో రంజిత్ తప్పేమీ లేదు. నా భర్త నన్ను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల నేనే రంజిత్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేశాను’ అని చెప్పింది.
‘లత మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. స్నేహం పేరుతో మాధవిని మోసం చేయాలని చూస్తున్నారు. మీకు భర్తతో రిలేషన్ సరిగా లేకపోతే అతనితో మాట్లాడి మీ సమస్య పరిష్కరించుకోవాలి. అలా కాకుండా మీరు రంజిత్‌కి దగ్గరవ్వాలని చూడడం సరైనది కాదు. అతను నిరాకరించాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే మీ రెండు కుటుంబాలు ఎంత ఇబ్బంది పడేవి. ఇప్పటికైనా మాధవి మా దగ్గరకు వచ్చింది కాబట్టి మీరు ఒప్పుకున్నారు. కానీ మీరు చేస్తుంది తప్పు అనే విషయం మీకు తెలియడం లేదు. మీ వల్ల మాధవి ఎంత బాధపడిందో ఒక్కసారి ఊహించుకోండి. మీరే పెండ్లి చేసి మీరే ఆమె బాధకు కారణం అవుతున్నారు’ అన్నాము.
‘మాధవి బాధపడితే నేను చూడలేను. రంజిత్ బాధపడినా చూస్తూ ఉండలేను. ఇకపై రంజిత్‌తో మాట్లాడడం తగ్గిస్తాను. అంతకు ముందులా స్నేహితురాలిగానే ఉంటాను. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చాలు’ అన్నది. మేము మాధవిని పిలిచి ‘మీరు ఇక్కడి నుండి వేరే ఇంటికి మారండి. రంజిత్ ఆఫీసుకు దగ్గరలో ఇల్లు చూసుకోండి. నీ భర్త మంచివాడు. గడిచిపోయిన జీవితం గురించి అతను ఆలోచించడం లేదు. మీతో సంతోషంగా ఉంటున్నాడు. అతని దృష్టిలో లత కేవలం ఓ స్నేహితురాలు మాత్రమే. కాబట్టి మీరు లేని పోని అనుమానం పెట్టుకొని బాధపడకండి. మీ భర్తను బాధపెట్టకండి’ అని చెప్పి పంపించాము.
లతతో ‘మీరు మీ భర్తను తీసుకొని మా దగ్గరకు రండి. ఒకసారి అతనితో మాట్లాడతాము. మీ ఇద్దరి మధ్య ఎలాంటి సమస్య ఉన్నా మాట్లాడి పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. అంతే గానీ మీ జీవితంలోకి మరో వ్యక్తికి అవకాశం ఇచ్చి లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు’ అని సర్దిచెప్పాము.
– వై వరలక్ష్మి,
9948794051