రైతుల కోసం ఉద్యమిస్తాం

Former CM Jagan– టిడిపి కూటమి సర్కార్‌ నిర్లక్ష్యంతోనే ధరల పతనం
– ఏ పంటకూ దక్కని గిట్టుబాటు ధరలు
– గుంటూరులో మాజీ సిఎం జగన్‌ విమర్శ
గుంటూరు : రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు తమ పార్టీ ఉద్యమిస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన గుంటూరు మిర్చి యార్డును సందర్శించారు. పలువురు రైతులతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. భారీ రద్దీ నడుమ ఆయన రైతులతో పూర్తిగా మాట్లాడకుండానే మీడియాతో మాట్లాడి వెనుదిరిగారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఏ ఒక్క రైతూ సంతోషంగా లేరని తెలిపారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడంతో వారు చాలా కష్టాలు పడుతున్నారని వివరించారు. పంటలకు గిట్టుబాటు ధరలు రాకపోవడంతో రైతులు ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్నారని తెలిపారు. రైతుల పాలిట టిడిపి కూటమి ప్రభుత్వం శాపంగా మారిందని విమర్శించారు. తమ ప్రభుత్వ హయంలో మిర్చికి క్వింటాలుకు రూ.20 వేల నుంచి 27 వేల వరకు ధర లభించిందని గుర్తు చేశారు. ఈ ఏడాది ధర రూ.8 వేల నుంచి రూ.11 వేల మాత్రమే వస్తుండడంపై టిడిపి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతులకు ఇప్పటి వరకు పెట్టుబడి సాయం ఇవ్వలేదని, సున్నా వడ్దీ అమలు కావడం లేదని అన్నారు. మిర్చి రైతులను చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. గుంటూరు జిల్లాలోనే చంద్రబాబు నివసిస్తున్నారని ఏ రోజైనా యార్డుకు వచ్చి రైతులతో మాట్లాడారా? అని నిలదీశారు. చంద్రబాబు ఇప్పటికైనా గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి రైతుల కష్టాలు తెలుసుకోవాలని సూచించారు. మిర్చికి గిట్టుబాటు కల్పించకపోతే తాము రైతులకు అండగా ఉండి ఉద్యమిస్తామన్నారు. పత్తి, వరి, పప్పుదినుసులకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదని తెలిపారు.
పోలీసులు లేకుండా సాగిన జగన్‌ పర్యటన
ఎన్నికల కోడ్‌ నేపధ్యంలో మాజీ సిఎం జగన్‌ పర్యటనకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. అయినా, జగన్‌ నిర్దేశిత సమయానికి మిర్చి యార్డుకు వచ్చారు. అయితే, పోలీసులు ఎటువంటి బందోబస్తూ ఏర్పాటు చేయలేదు. ఆయన కాన్వారులోని వ్యక్తిగత భద్రతా సిబ్బందితోనే జగన్‌ యార్డులోకి వచ్చారు. రైతులు, యువకులు, వివిధ ప్రాంతాల ప్రజలు యార్డుకు భారీగా రావడంతో యార్డు కిక్కిరిసిపోయింది. దీంతో, ఆయన రైతులతో మాట్లాడేందుకు యార్డులోకి వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు.
జగన్‌పై కోడ్‌ ఉల్లంఘన కేసు
కాగా జగన్‌పై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసు స్టేషన్‌లో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కింద కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండగా బుధవారం జగన్‌ గుంటూరు మిర్చి యార్డు సందర్శించి, రైతులతో మాట్లాడడంతో పాటు ప్రభుత్వంపైనా విమర్శలు చేశారని.. ఇది కోడ్‌ ఉల్లంఘన కింద వస్తుందని ఆయనపై కేసు నమోదు చేసినట్టు నల్లపాడు సిఐ కె.వంశీధర్‌ తెలిపారు. మిర్చి యార్డు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు.

Spread the love