యాదాద్రి పేరు మారుస్తాం..

నవతెలంగాణ-హైదరాబాద్ : యాదాద్రి పేరు యాదగిరిగుట్టగా మారుస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శుక్రవారం వెల్లడించారు. ఆలయం వద్ద టెంకాయ కొట్టే స్థలాన్ని శుక్రవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. క్షేత్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. త్వరలోనే ఆయన ఆలయ సందర్శనకు వస్తారని తెలిపారు. నెల రోజుల్లోనే సమీక్ష సమావేశం నిర్వహించి క్షేత్రానికి పూర్వ సంప్రదాయం చేకూర్చేలా కృషి చేస్తానన్నారు. తొలుత ఎమ్మెల్యేకు ఆలయ ఈవో రామకృష్ణా రావు, ధర్మకర్త నరసింహమూర్తి స్వాగతం పలికారు. అనంతరం ఆయన దైవ దర్శనం చేసుకొని పూజలు నిర్వహించారు. కొండపై డార్మిటరీ హాల్ నిర్మించి భక్తులు నిద్ర చేసే అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. పది రోజుల్లో హాల్ నిర్మాణం చేయాలని సూచించారు. ఆలయ పూజారుల కోసం విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Spread the love