నిర్భయంగా ఓటేసే వాతావరణం కల్పిస్తాం

– ఆళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై ఈ.రతీష్

నవతెలంగాణ – ఆళ్ళపల్లి: లోక్ సభ ఎన్నికల్లో మండలంలోని ఓటర్లు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆళ్ళపల్లి ఎస్సై ఈ.రతీష్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం సాయంత్రం వేళల్లో ఆళ్ళపల్లి నుండి మర్కోడు గ్రామం వరకు, అదేవిధంగా ఆళ్ళపల్లి నుండి పెద్ద వెంకటాపురం గ్రామం వరకు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వచ్చిన భద్రతా బలగాలతో ఎస్సై “పోలీస్ రూట్ మార్చ్” నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఓటర్లను ప్రలోభ పెట్టే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఎన్నికల్లో అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. దానికి గాను చెక్ పోస్టుల్లో పోలీస్ సిబ్బంది నిఘా పటిష్టం చేశామని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. సామాన్య ప్రజానీకానికి, శాంతిభద్రతలకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల రూట్ మ్యాప్ పై భద్రతా బలగాలకు ముందుగానే అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకట్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వరరావు, కానిస్టేబుళ్లు ఉపేందర్, ఎం.శ్రీనివాస్, వై.శ్రీనివాస్, వి.వెంకటేశ్వర్లు, టీఎస్ ఎస్ పీ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love