– ప్రగతిశీల శక్తులను గెలిపిస్తాం : టీపీఎస్‌కే ప్రధాన కార్యదర్శి హిమబిందు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రజల ధన మాన ప్రాణాల కన్నా సనాతన ధర్మ రక్షణే ముఖ్యమా..? అంటూ తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం (టీపీఎస్‌కే) ప్రధాన కార్యదర్శి కె హిమబిందు ప్రశ్నించారు. ప్రజల సమస్యల గురించి ఏనాడూ నోరు విప్పరా..? అందుకే తామంతా ‘సనాతన ధర్మాన్ని ఓడిస్తాం, ప్రగతిశీల శక్తులను గెలిపిస్తాం’ అని చెప్పారు. పెరియార్ 144వ జయంతి సందర్భంగా ‘సనాతనమా? రాజ్యాంగమా?అనే అంశంపై టీపీఎస్‌కే, భారత నాస్తిక సమాజం (బీఎన్‌ఎస్) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్యక్రమాన్ని నిర్వహించాయి. పెరియార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సండర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రశ్నను వ్యతిరేకించే వాళ్లు, ప్రగతిని వ్యతిరేకించే వాళ్లు, మహిళలను వ్యతిరేకించే వాళ్లు, శూద్రులను వ్యతిరేకించే వాళ్లు, మనిషిని మనిషిగా వ్యతిరేకించే వాళ్లు, మనుషుల్లో చీలికలు తెచ్చే వాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ కమండలాలు పట్టుకుని తపస్సు చేసే సన్యాసులు ఇప్పుడు కత్తులు, త్రిశూలాలు పట్టుకుని మనుషుల తలలకు వెల కడుతున్నారని విమర్శించారు. మత ఉగ్రవాదులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అధ్యక్షత వహించిన టీపీఎస్‌కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సతీసహగమనం, అంటరానితనం, బాల్యవివాహాలు, దేవదాసీ, జోగినీ వ్యవస్థలు సనాతన ధర్మంలో భాగమా కాదా? అని ప్రశ్నించారు. వాటిని ఇప్పుడు పాటిద్దామా? కాలాన్ని బట్టి మారుదామా? ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. బీఎన్‌ఎస్ అధ్యక్షుడు రషీద్ ద్రావిడ్ మాట్లాడుతూ హిందూ మతమంటే సనాతన ధర్మానికి ప్రతిరూపమని చెప్పారు. ‘నేను హిందూ మీరు హిందూ అంటూ అమాయకుల మెదళ్లలో విష బీజాలు నాటుతున్నారు’అని ఆయన విమర్శించారు. మత విశ్వాసం హృదయంలో ఉండాలిగానీ, ఇంట్లో ఉండాలిగానీ, వీధుల్లోకి తెస్తున్నారని అన్నారు. ‘సనాతన ధర్మాన్ని ఓడిస్తాం-ప్రగతిశీల శక్తులను గెలిపిస్తాం’ అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, స్వేచ్ఛ జేఏసీ నాయకులు బాలి అదామ్ రాజ్, బీఎన్‌ఎస్ కన్వీనర్ గుత్తికొండ చక్రధర్, రాజ్ బోస్ తదితరులు పాల్గొన్నారు.