– బలమైన ప్రతిపక్షంగా సమస్యలపై పోరాడుతాం
– బీజేపీకి ప్రజలు తగిన సమాధానం ఇచ్చారు : ఇండియా ఫోరం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో బీజేపీ పాలనను అంతమొందించాలన్న ప్రజల ఆకాంక్షను సాకారం చేసేందుకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటామని ఇండియా ఫోరం ప్రకటించింది. లోక్సభ ఎన్నికల ఫలితాల సమీక్షపై బుధవారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఇండియా ఫోరం భేటీ అయ్యింది. ఇందులో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నానికి వ్యతిరేకంగా తొందరపాటు చర్యలు తీసుకోకూడదని నిర్ణయించింది. బలమైన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను లేవనెత్తుతామని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఐక్యంగా వ్యతిరేకిస్తామని ఇండియా ఫోరం నేతలు స్పష్టం చేశారు.
సమావేశానంతరం మల్లికార్జున్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలకు ప్రజలు తగిన సమాధానం చెప్పారన్నారు. ఇది రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇచ్చిన తీర్పు అని, ధరల పెరుగుదల, నిరుద్యోగం, మోడీ పాలనలో సృష్టించిన బీజేపీ క్రోనీ క్యాపిటలిజానికి వ్యతిరేకంగా ఉందని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణపై ఓటర్లు ఆసక్తి చూపారని, ఇండియా ఫోరానికి అండగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మోడీ నాయకత్వంలో బీజేపీ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా ఇండియా ఫోరం పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటుందని తెలిపారు.
రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచిన విలువలకు ప్రాథమిక నిబద్ధత ఉన్న ఏ రాజకీయ పార్టీనైనా ఇండియా ఫోరంలోకి స్వాగతిస్తామని అన్నారు. మోడీకి, ఆయన రాజకీయ శైలికి వ్యతిరేకంగా ఈ తీర్పు వచ్చిందన్నారు. మోడీ వ్యక్తిగతంగా, రాజకీయంగా తీవ్ర నష్టాన్ని, నైతిక పరాజయాన్ని చవిచూశారన్నారు. కానీ ఆయన ఇప్పటికీ ప్రజల తీర్పును తారుమారు చేయాలనే పట్టుదలతో ఉన్నారని ఖర్గే విమర్శించారు.
సీపీఐ(ఎం) ప్రధాన కార్యాదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ తొలుత తాము ఎన్నికల ఫలితాల ప్రాధాన్యతను విశ్లేషించామని చెప్పారు. ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై భాగస్వామ్య పార్టీలను సంప్రదించామని చెప్పారు. తమకు చాలా సమయం ఉందని, ఎన్టీయే కూడా తమ ప్రయత్నం చేసుకుంటుందని అన్నారు. బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా ముందుకొస్తే ఏమవుతుందని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ, మోడీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింద న్నారు. ధనబలం, అధికార బలంతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నించారని, కాని సాధ్యం కాలేదని అన్నారు. కేంద్ర సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష నేతలపై దాడికి దిగారని, పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేశారని అన్నారు. అయినా ఫలితం దక్కలేదని అన్నారు. రాజకీయ నేతలను ఎలా ఎన్నుకోవాలో యూపీ ప్రజలు చూపించారని సీతారాం ఏచూరి అన్నారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకెే అధినేత ఎంకె స్టాలిన్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యాదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఎన్సిపి అధినేత శరద్ పవార్, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, జెఎఎం నేత, జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపారు సోరెన్, జెఎంఎం నేత కల్పనా సోరెన్, ఆర్జేడి నేత తేజస్వి యాదవ్, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, శివసేన నేత సంజరు రౌత్, ఆప్ నేత రాఘవ్ చద్దా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, కేరళ కాంగ్రెస్ నేత మణి, ఫార్వర్డ్ బ్లాక్ నేత దేవరాజన్ తదితరులు హాజరయ్యారు.