నవతెలంగాణ కొల్లాపూర్: ఈ ఎన్నికలు ప్రజల తెలంగాణ…దొరల తెలంగాణ మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కొల్లాపూర్‌లో నిర్వహించిన పాలమూరు ప్రజాభేరి సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ… మనది రాజకీయ అనుబంధం కాదని, కుటుంబ అనుబంధమన్నారు. పథకాలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రైతుబంధు నిలిచిపోతుందని ఆరోపణలు చేస్తున్నారని, అలాంటిదేమీ జరగదన్నారు. పైగా తమ ప్రభుత్వం వస్తే రైతు భరోసా కింద రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి హామీ కూలీలకు రూ.12వేలు ఇచ్చి ఆదుకుంటామన్నారు. టిక్కెట్ల విషయంలో ఢిల్లీలో సీఈసీ భేటీ ఉన్నప్పటికీ తాను ఈ సభకు వచ్చానన్నారు. ఒక వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం.. మరోవైపు తెలంగాణ సమాజం, నిరుద్యోగులు ఉన్నారన్నారు. దొరల తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి తెలంగాణ సొమ్మును దోచేశారన్నారు. లక్షల కోట్ల సొమ్మును పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారన్నారు. తన సోదరి ప్రియాంక గాంధీ అనారోగ్యం దృష్ట్యా తాను ఈ సభకు వచ్చానని చెప్పారు.