12 స్థానాల్లో గులాబీ జెండా ఎగరవేస్తాం

– బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉమ్మడి జిల్లా
– కేసీఆర్‌తోనే జిల్లా అభివృద్ధి
– మిర్యాలగూడను అద్భుతంగా అభివృద్ధి చేసిన భాస్కర్‌రావు
– ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన మంత్రులు
నవతెలంగాణ-మిర్యాలగూడ
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలో గులాబీ జెండా ఎగరబోతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ, విద్యుత్‌శాఖ మంత్రులు తన్నీరు హరీష్‌రావు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి జోస్యం చెప్పారు. మిర్యాలగూడ పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో 15 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆస్పత్రి భవనాన్ని, 5.80 కోట్లతో నిర్మిస్తున్న 29 పిహెచ్సి కేంద్రాల భవన నిర్మాణాన్ని వారు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్‌ఎస్పీ క్యాంపులో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో వారు మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా చరిత్రలో ఇప్పటివరకు ఏ పార్టీ కూడా 12 స్థానాలు గెలవలేదని, కంచుకోటలుగా చెప్పుకున్న కాంగ్రెస్‌, టీడీపీిలో సైతం ఆరు స్థానాల కంటే ఎక్కువగా గెలవలేదని చెప్పారు. కానీ జిల్లా ప్రజలు కేసీఆర్‌ పై నమ్మకం ఉంచుకొని 12 స్థానాలను గెలిపించాలని గుర్తు చేశారు. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీకి కంచుకోటగా నిలిచిందని, జిల్లా ప్రజల రుణాన్ని ఎప్పటికీ తీర్చలేమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సైతం 12 స్థానాల్లో గులాబీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట ప్రధాన పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందాయని తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రజలు ఎంతో చైతన్య వంతులని, అబద్ధాలు, మోసపూరిత మాటలు చెప్పినంత మాత్రాన ప్రజలు మోసపోయే అవకాశం లేదన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేస్తారని ఈసారి కూడా 12 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరబోతుందని తెలిపారు. బడా నాయకులని చెప్పుకుంటున్న కాంగ్రెస్లో తండ్రి ఒక నియోజకవర్గం, కొడుకు ఒక నియోజకవర్గం, భర్త ఒక చోట భార్య ఒక చోట, తమ్ముడు ఒక చోట, అన్నయ్య ఒకచోట పోటీ చేసినందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. వాళ్లు అధికారులు ఉన్నప్పుడు కనీసం జిల్లా అభివృద్ధి కోసం ఏనాడు పట్టించుకోలేదని, రాజవరం పొలాలు ఎండుతుంటే చూసి చూడనట్టుగా ఉన్నారని గుర్తు చేశారు. సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోయాయని తెలంగాణ సాధించుకున్నాక జిల్లాలో రెండు పంటల సాగు అవుతుందని ఇప్పటివరకు 16 సార్లు పంటలను సాగు చేశామని చెప్పారు. రాజవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఎండిపోయిన పొలాలను సస్యశ్యామలం చేశామని, అది కేసీఆర్‌ ప్రభుత్వంతోనే సాధ్యమైందన్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాలలో రెండు మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌ కి దక్కుతుందన్నారు. 3.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి జిల్లా అగ్రస్థానం నిలిచిందన్నారు. సూర్యాపేట కంటే అధిక నిధులు మిర్యాలగూడకు తెచ్చారన్నారు. ఐనా ఇంకా నిధులు కావాలని మాతో కొట్లాడుతున్నాడని చెప్పారు. ఏరియా ఆస్పత్రిలో ఇప్పటికే ఐసీయూ కేంద్రాన్ని ప్రారంభించామని, భాస్కర్‌రావు సూచన మేరకు సిటీ స్కాన్‌, డి ఫాక్స్‌ స్కానింగ్‌ సెంటర్‌, ఐసీయూ సామర్థ్యం పెంపు, బ్లడ్‌ బ్యాంకు యూనిట్‌ మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. భాస్కరరావు నాయకత్వంలో మిర్యాలగూడ ఎంతో అభివృద్ధి చెందిందని మరింత అభివృద్ధి చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. ఎన్నో ఏళ్ళుగా ఎన్‌ఎస్పి క్యాంపులో నివాసముటున్న సి టైప్‌ క్వార్టర్స్‌ వారికి క్రమబద్ధీకరించినందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ప్రజాసేవ కోసం భాస్కర్‌ రావు తఫన పడుతున్నాడని, మరో మరో ఆయనకి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు.
నియోజవర్గంలో 4,500 కోట్లతో అభివృద్ధి : ఎమ్మెల్యే భాస్కర్‌రావు
మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇప్పటివరకు 4,500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు తెలిపారు. ఇందులో 1100 కోట్లుతో మిర్యాలగూడ పటం అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మిర్యాల పట్టణంలో 200 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఫోర్‌ లైన్‌ రోడ్ల నుండి సిక్స్‌ లైన్‌ రోడ్‌లో విస్తరణ చేపట్టామన్నారు. పట్టణంలోని ప్రధాన కూడల్లో సుందరవణంగా తీర్చిదిద్దామని చెప్పారు. 15 కోట్లతో అదనంగా వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నామన్నారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పన కోసం కృషి చేసినట్టు తెలిపారు. 4.50 కోట్లతో వెజ్‌ నాన్‌ వెజ్‌ మార్కెట్‌ ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 139 కోట్లతో రైల్వే స్టేషన్‌ నుండి ఈదురుడం వరకు రోడ్ల విస్తరణ పనులు చేపట్టుతున్నామని తెలిపారు సుమారు మూడు కోట్లతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు అదనంగా బస్తి దాఖానాలు అవసరం ఉన్నాయని వాటిని మంజూరు చేయాలని కోరారు. ఎస్‌ జి ఎఫ్‌ నిధుల మంజూరుకు సహకరించాలని కోరారు. కోట్ల రూపాయలతో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిర్మిస్తున్నామని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి, వైకుంఠధామలు ఏర్పాటు చేశామని తెలిపారు. మిర్యాలగూడ అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందని, మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగ యాదవ్‌, శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌ రెడ్డి, నోముల భగత్‌, రవీంద్ర కుమార్‌ నాయక్‌, సానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ. కోటిరెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ బండ నరేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి , మున్సిపల్‌ చైర్మెన్‌ తిరునగర్‌ భార్గవ్‌, ఎంపీపీ నూకల సరళ హనుమంతురెడ్డి, వైస్‌ చైర్మెన్‌ కుర్ర కోటేశ్వరరావు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, పిఎసిఎస్‌ చైర్మెన్లు, డైరెక్టర్లు, వార్డు, గ్రామ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

Spread the love