– వికారాబాద్ జిల్లా అభివృద్ధికి ఢోకా లేదు
– రైతులకు కరెంట్ ఇబ్బందులు లేకుండా చూడాలి : మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి
– వికారాబాద్ జిల్లాలో పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
నవతెలంగాణ-తాండూరు
పేదల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా నుంచి ఒకరు స్పీకర్ ఉండగా.. మరొకరు సీఎంగా ఉన్నారని.. అందువల్ల వికారాబాద్ జిల్లా అభివృద్ధికి డోకా లేదని చెప్పారు. రైతుల మేలు కోసమే తమ ప్రభుత్వం రుణమాఫీ చేసిందన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లాలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో కలిసి మంత్రులు పర్యటించారు.
వికారాబాద్, తాండూర్ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వికారాబాద్ నియోజకవర్గంలో రూ.60 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తాండూర్ నియోజకవర్గంలో రోడ్లు, సెంట్రల్ లైటింగ్, తాగునీటి సరఫరా, సబ్ స్టేషన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అలాగే తాండూరు మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి స్పీకర్, మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా సమావేశాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం తాగు, సాగు నీరు, విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలలో భాగంగా త్వరలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభిస్తామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించిందని, రూ.7లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కడుతున్నామని చెప్పారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కరెంట్ సరఫరా చేయాలని అధికారులకు సూచించారు స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతు మేలు కోరుతూ రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అన్నిరంగాల్లో వికారాబాద్‌తో పాటు తాండూరు అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి హరిచందన, ఇంజినీర్ ఇన్ చీఫ్ మోహన్‌నాయక్, ఎస్‌ఈ వసంత నాయక్, ఇన్‌చార్జి ఇఇ శ్రీధర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.