– రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం..
– మండల కేంద్రాలలో ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభం..
– కేంద్ర ప్రభుత్వ కుట్రలో భాగమే చంద్రబాబు అరెస్ట్ : సీఎల్పీ నేత భట్టి
నవతెలంగాణ – బోనకల్
రానున్న సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ 74 నుంచి 78 అసెంబ్లీ స్థానాలతో అధికారంలోకి రావడం ఖాయమని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు బట్టే విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బిసి సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. అనంతరం మండల కేంద్రంలోని కాంగ్రెస్ నాయకుడు చేబ్రోలు వెంకటేశ్వరరావు ఇంట్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుక్కుగూడ బహిరంగ సభ విజయవంతమైందన్నారు. ఈ సభలో కాంగ్రెస్ జాతీయ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే రాష్ట్రానికి సంబంధించిన మ్యానిఫెస్టో కాకుండా 6 ప్రధాన వాగ్దానాలను ప్రకటించారన్నారు. ఈ ఆరు వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెలా రూ.2,500, పేద మహిళలకు కేవలం రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతు భరోసా ద్వారా ప్రతిఏటా రైతులతో సహా కౌలు రైతులకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలు, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు, వరికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని తెలిపారు. గృహజ్యోతి పథకం కింద పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని తెలిపారు.
చేయూత పథకం ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా, నెలకు రూ.4 వేల పింఛన్ అందజేస్తామని తెలిపారు. యువ వికాసం ద్వారా ఫీజు రియంబర్స్ మెంట్ తో పాటు కళాశాల విద్యార్థుల కోచింగ్ ఫీజు కోసం రూ.5 లక్షల వరకు సహాయం అందజేస్తామని తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్ ని ఇంగ్లీష్ మీడియంలో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ పథకాల అమల కోసం కాంగ్రెస్ కు చెందిన నాయకులు, కార్యకర్తల గ్రామాలలోనే ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కేంద్ర ప్రభుత్వ కుట్రలో భాగమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి జగన్ పరువు తీసిందన్నారు. దేశంలో, రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతుందన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జర్నలిస్టులందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. ఈ సమావేశంలో టిపిసిసి సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు, జెడ్పిటిసి మోదుగు సుధీర్ బాబు, కలకోట సొసైటీ అధ్యక్షుడు కర్నాటి రామకోటేశ్వరరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఐలూరి వెంకటేశ్వర రెడ్డి, ఎస్సీ సెల్, ఎస్టీసెల్ మండల అధ్యక్షులు మారుపల్లి ప్రేమ కుమార్, భూక్య బద్రు నాయక్, చేబ్రోలు వెంకటేశ్వరరావు, పాసంగులపాటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
బాలుర సంక్షేమ గురుకుల విద్యాలయం సందర్శన:
మండల కేంద్రంలో గల మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సోమవారం సందర్శించారు. గురుకుల పాఠశాలలో జరిగిన వినాయక చవితి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీలు పడ్డారు.
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిక
బోనకల్ గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యుడు, బీఆర్‌ఎస్ యువ నాయకుడు బానోత్ మురళి మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాడు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.