విద్యుత్ రంగంలో దేశానికే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం 

We will make Telangana an ideal for the country in the field of electricity– ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
– 2030 నాటి విద్యుత్ డిమాండ్ అంచనా వేస్తూ గ్రీన్ ఎనర్జీ సాధన దిశగా కృషి
– పైలెట్ గ్రామాలను ఎంపిక చేసి పూర్తి స్థాయిలో రైతుల మోటార్లకు ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపు సెట్ల ఏర్పాటు
– టెయిల్ ఎండ్ ప్రాంతాల సాగునీటి పరిష్కారానికి పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తాం
– ఎల్లంపల్లి భూ నిర్వాసతులకు 18 కోట్ల పరిహారం అందజేత
– ధర్మారం మండలంలో పర్యటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క
నవతెలంగాణ – ధర్మారం
విద్యుత్ రంగంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణను రాష్ట్రాన్ని తీర్చి దిద్దుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మండలంలోని నంది మేడారం కటికనపల్లి ధర్మారం మండల కేంద్రంలో శనివారం తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,  ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష లతో కలిసి విస్తృతంగా పర్యటించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బృందాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ నంది మేడారం హెలిప్యాడ్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. మేడారం వద్ద 33/11 కేవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు, కటికనపల్లి గ్రామాలలోని  33/11 కేవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.  అనంతరం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై ధర్మారం, వెల్గటూరు, గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అనంతరం మార్కెట్ యార్డ్  ప్రాంగణంలో ధర్మపురి శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో  ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత పాలకులు సృష్టించిన అపోహలను పటాపంచలు చేస్తూ రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. 2030 నాటికి ఉండే విద్యుత్ డిమాండ్ ను అంచనా వేస్తూ దాని సాధన దిశగా గ్రీన్ పవర్, సోలార్ పవర్, ఫ్లోటింగ్ సోలార్, పంప్ స్టోరేజ్ ఎనర్జీ మొదలగు రంగాలలో దాదాపు 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాలను ఎంపిక చేసి, ఆ గ్రామాలలోని రైతుల మోటార్లకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేయబోతున్నామని ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు.
రైతులకు పంటలతో పాటు విద్యుత్తు తో కూడా ఆదాయం సమకూరే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ విప్ అభ్యర్థన మేరకు మేడారం గ్రామంలో పూర్తి స్థాయిలో రైతులకు సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తామని అన్నారు రాష్ట్రంలోనే కొన్ని ఆదర్శ గ్రామాలను ఎంపిక చేసుకుని  ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. పవర్ అంశంలో దేశానికి తెలంగాణను మోడల్ గా తీర్చిదిద్దుతామని అన్నారు ప్రజల భావోద్వేగాలను అర్థం చేసుకొని రామగుండంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలోనే ఈ ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ధర్మారంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2 నూతన సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని అన్నారు. దశాబ్ది కాలం పైగా పెండింగ్ లో ఉన్న ఎల్లంపల్లి నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం పరిష్కారం చూపించడం సంతోషంగా ఉందని అన్నారు ప్రాజెక్టుల నిర్మాణానికి భూములు ఇచ్చిన భూ నిర్వాసితుల  సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పించిందని, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న భూసేకరణ నిధులను చెల్లించడానికి ప్రాధాన్యత కల్పిస్తున్నామని అన్నారు 2 లక్షల రుణమాఫీ కింద అతి తక్కువ సమయంలో 18 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసామని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు పంటల బీమా పథకం క్రింద రైతుల పక్షాన ప్రీమియం ప్రజా ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి బడ్జెట్ లో నిధులు కేటాయించామని, సర్వే పనులు పూర్తి చేసిన తరువాత నిర్మాణ పనులు ప్రారంభిస్తామని అన్నారు.
పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు సైతం త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. మండల వాగు ఎల్లంపల్లి లిఫ్ట్  సంబంధించి సబ్ స్టేషన్ నిర్మిస్తే వేల ఎకరాల నీరు పారుతుందని అందిన ప్రతిపాదనల మేరకు సబ్ స్టేషన్ ను వెంటనే మంజూరు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబ అమెరికా, కొరియా దేశాలలో పర్యటించి దాదాపు 36 వేల కోట్ల పెట్టుబడుల ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగిందని, దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 ఎకరాల స్థలంలో సమీకృత గురుకుల భువన నిర్మాణాన్ని త్వరలో మంజూరు చేస్తామని అన్నారు. అంతకుముందు ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ  10 సంవత్సరాల పాటు పెండింగ్ లో ఉన్న ఎల్లంపల్లి నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం మంత్రుల వెంబడి తిరిగి 18 కోట్లు సాధించడంలో ప్రభుత్వ విప్ కృషి ప్రశంసనీయమని మంత్రి తెలిపారు. టేయిల్ ఎండ్ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు ద్వారా మంథని పెద్దపెల్లి ,రామగుండం, ధర్మపురి నియోజకవర్గాలు సాగునీరు స్థిరీకరణ అవుతుందనే ఉద్దేశంతో సాగునీటి మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి కి ప్రతిపాదనలు సమర్పించి, ప్రస్తుత బడ్జెట్ కేటాయింపుల్లో నిధులు కేటాయించామని, సర్వే పనులు పూర్తి చేసిన తర్వాత  ప్రతిపాదనలు రూపొందిస్తామని మంత్రి తెలిపారు. గడిచిన 9 నెలల కాలంలో ఒక్కటి తర్వాత ఒక్కటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షల పెంపు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా వంటి కార్యక్రమాలను అమలు చేశామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రక్రియ చేస్తున్నామని, సాంకేతిక పరమైన ఇబ్బందుల వల్ల కొంతమంది రైతులకు రుణమాఫీ కాకపోతే వాటిని పరిష్కరించి, అర్హులైన రైతులందరికీ రుణమాఫీ పథకం అమలు చేస్తామని అన్నారు. ఎల్లంపల్లి భూ నిర్వాసితుల సమస్యల సంబంధించి 18 సంవత్సరాలు నిండిన వారికి పరిహారం అందించే అంశంలో ఆర్డిఓ, కలెక్టర్ లతో నివేదిక తప్పించుకొని చర్యలు తీసుకుంటామని అన్నారు.
800 మెగావాట్ల నూతన విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి మంజూరు చేసామని అన్నారు. ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..  గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎల్లంపల్లి భూ నిర్వాసతుల సమస్య పరిష్కారం దిశగా చేగ్యాం గ్రామంలో 126 ఇండ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం 18 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని అన్నారు. పెండింగ్ భూ నిర్వాసితుల సమస్య ప్రతిపాదనలు కలెక్టర్ ద్వారా తెప్పించుకొని మరో 7 కోట్ల నిధులను కూడా మంజూరు చేయాలని కోరారు ధర్మారం మండలంలో ఐటిఐ లేదా పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా బొమ్మిరెడ్డిపల్లి గ్రామం దగ్గర కొత్తపల్లి కాల్వ పెండింగ్ పనులు మరో 7 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే పూర్తవుతాయని , దీని వల్ల దాదాపు 10 వేల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, వారి ఆయకట్టు స్థిరీకరణ చెందుతుందని, ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ విప్  ఉపముఖ్యమంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ,  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్,ఎన్ పి డి సి ఎల్ సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి ,డైరెక్టర్ బి అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, డిసిపి చేతన, విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ బీకం సింగ్, ఎస్ ఈ బొంకూరి సుదర్శన్,డి ఈ తిరుపతి, అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ, జెసి జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్,  ఆర్డిఓలు బి.గంగయ్య, వి.హనుమా నాయక్, పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు నూతన ఏఎంసీ చైర్మన్ రూప్ల నాయక్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love