– 2030 డిమాండ్ అంచనాతో గ్రీన్ ఎనర్జీకి కృషి
– టెయిల్ ఎండ్ ప్రాంతాల సాగునీటి పరిష్కారానికి పత్తిపాక రిజర్వాయర్ : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి
– ఎల్లంపల్లి భూనిర్వాసితులకురూ.18 కోట్ల పరిహారం అందజేత
నవతెలంగాణ-పెద్దపల్లి
విద్యుత్ రంగంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి భట్టి పర్యటించారు. మేడారం వద్ద 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు, కట్కెనపల్లి గ్రామంలోని 33/11కేవీ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ధర్మారం, వెల్గటూరు, గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. 2030నాటికి విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేస్తూ.. ఆ దిశగా గ్రీన్ పవర్, సోలార్ పవర్, ఫ్లోటింగ్ సోలార్, పంప్ స్టోరేజ్ ఎనర్జీ మొదలగు రంగాల్లో దాదాపు 20వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాలను ఎంపిక చేసి, రైతుల మోటార్లకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేయబోతు న్నామని చెప్పారు. అలాగే, కొన్ని ఆదర్శ గ్రామాలను ఎంపిక చేసుకుని ప్రతి ఇంటికీ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. దశాబ్ది కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎల్లంపల్లి నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం పరిష్కారం చూపించడ ం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న భూసేకరణ నిధులను అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా డీప్యూటీ సీఎం ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలకు రూ.18కోట్ల చెక్కులు అందజేశారు.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడు తూ.. పదేండ్లపాటు పెండింగ్‌లో ఉన్న ఎల్లంపల్లి నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం మంత్రుల వెంబడి తిరిగి రూ.18కోట్లు సాధించడంలో ప్రభుత్వ విప్ ఎంతో కృషి చేశారన్నారు. పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు ద్వారా మంథని పెద్దపెల్లి, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాలు సాగునీరు స్థిరీకరణ అవుతుందనే ఉద్దేశంతో సాగునీటి మంత్రికి ప్రతిపాదనలు సమర్పించినట్టు చెప్పారు. ప్రస్తుత బడ్జెట్ కేటాయింపుల్లో నిధులు కేటాయించామని తెలిపారు. ఎల్లంపల్లి భూ నిర్వాసితుల్లో 18ఏండ్లు నిండిన వారికి పరిహారం అందించే అంశంలో ఆర్డీవో, కలెక్టర్‌తో నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎల్లంపల్లి భూనిర్వాసతుల సమస్య పరిష్కారం దిశగా చేగ్యాం గ్రామంలో 126ఇండ్లు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం అందిందన్నా రు. భూ నిర్వాసితుల సమస్యలపై ప్రతిపాదనలు కూడా కలెక్టర్ ద్వారా తెప్పించుకొని మరో రూ.7కోట్లు మంజూరు చేయాలని మంత్రులను కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్, అదనపు కలెక్టర్‌లు జె.అరుణ శ్రీ, జివి శ్యామ్ ప్రసాద్‌లాల్, ఆర్డీవోలు బి.గంగయ్య, వి.హనుమానాయక్ పాల్గొన్నారు.