– హమాలీ కార్మికుల సామాజిక భద్రత కవాలి
– మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి : ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు
నవతెలంగాణ-జనగామ
రాష్ట్రంలో హమాలీ కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత కోసం హమాలీ ఫెడరేషన్ వెల్ఫేర్ బోర్డు సాధనకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు అన్నారు. మంగళవారం సీఐటీయూ కార్యాలయంలో నాయకులు రాపర్తి రాజు అధ్యక్షతన నిర్వహించిన ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జనగామ జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఐదు లక్షల మంది వివిధ విభాగాల్లో హమాలీ కార్మికులుగా పనిచేస్తున్నారని అన్నారు. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు అందడం లేదని తెలిపారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు, యాజమాన్యాలకు అనుగుణంగా కార్మిక చట్టాలను సవరించి నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని తెలిపారు. ఈ లేబర్ కోడ్‌లు కార్మికులకు తీవ్ర నష్టం చేస్తాయన్నారు. ఈ కార్మిక వ్యతిరేక కోడ్‌ల రద్దు కోసం మే 20న దేశంలో ఉన్న 11 కేంద్ర కార్మిక సంఘాలు జాతీయ సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని, హమాలీ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పని చేసే హమాలీ కార్మికులకు రైతుల నుంచి కాకుండా ప్రభుత్వమే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.60 నిర్ణయించినప్పటికీ అమలు జరగడం లేదన్నారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన హమాలీ రేట్ల పట్టిక బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రధానంగా హమాలీ కార్మికులు బస్తాలు వాహనంలో లోడు చేసిన తర్వాత వాహనానికి గంటన్నర పైగా తాడు కడుతున్నారని, వారి శ్రమ వృధా అవుతుందని తెలిపారు. తాడు కట్టినందుకు బస్తకు రెండు రూపాయలు చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఇల్లు లేని హమాలీ కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి యాటల సోమన్న, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్, జిల్లా కోశాధికారి అన్నేబోయిన రాజు, జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.