– అందుకే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచాం : ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులతో సీఎం రేవంత్‌రెడ్డి
– నైపుణ్యం ఉంటేనే ఉద్యోగాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు ప్రభుత్వ వసతిగృహాల విద్యార్థులు బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎంను కలిసి డైట్ చార్జీలు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనీ, అందుకే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచామని తెలిపారు. ఇటీవలే 21వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినట్టు గుర్తు చేశారు. అలాగే కొత్తగా మెగా డీఎస్సీ నిర్వహించి 11,062 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని పేర్కొన్నారు. ”ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ప్రతీ నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నాం. వచ్చే విద్యాసంవత్సరంలోపు వాటిని అందుబాటులోకి తీసుకొస్తాం.. చదువుతో పాటు నైపుణ్యం ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయి. అందుకే విద్యార్థి, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణనందించేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. టాటా ఇనిస్టిట్యూట్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నాం. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. తెలంగాణ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోంది. విద్యార్థులు ప్రభుత్వం కల్పించిన అవకాశాలను అందిపుచ్చుకుని విద్యలో రాణించాలి” అని వారికి సూచించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నవంబర్ 14న వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గంజాయి, డ్రగ్స్ ఎక్కడ కనిపించినా 100కు డయల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. వ్యసనాలకు బానిసైతే జీవితాలు నాశనం అవుతాయనీ, వాటికి దూరంగా ఉంటూ ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతను అలవరచుకోవాలని వారికి మార్గనిర్దేశం చేశారు సామాజిక న్యాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం కుల గణన సర్వే నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు, నేటి విద్యార్థులే రేపటి పౌరులుగా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉన్నత చదువులు చదివి భవిష్యత్‌లో సచివాలయంలో అడుగు పెట్టి, పరిపాలనలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, రామసాయం రఘురాం రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.