నవతెలంగాణ – హైదరాబాద్: సామాన్యులకు అందుబాటు ధరల్లో సీ ప్లేన్ సేవలు అందిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. శనివారం ఉదయం విజయవాడ ప్రకాశం బ్యారేజీ పున్నమిఘాట్ వద్ద సీ ప్లేన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. మంత్రి రామ్మోహన్ మాట్లాడారు. సీ ప్లేన్‌ను అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు. మరో 3, 4 నెల్లలో ఏపీలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో సీ ప్లేన్ ప్రయాణం ఉంటుందని వివరించారు. ఏపీలో 4 రూట్లలో నడిపేందుకు ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద పున్నమిఘాట్‌కు సీ ప్లేన్ చేరుకుంది. కాసేపట్లో బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకు సీఎం చంద్రబాబు ఇందులో ప్రయాణం చేయనున్నారు. దీంతో పున్నమి ఘాట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 14 మంది కూర్చునేలా సీ ప్లేన్ సీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రయాణించి సీఎం శ్రీశైలానికి చేరుకోనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు అధికారులు పాల్గొంటున్నారు.