– వారికి భరోసా కల్పించేలా పునరావాసం :సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల జీవన స్థితిగతులు, ఆర్థిక ప్రమాణాలు మెరుగుపడేటట్టు పునరావాసం కల్పిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మూసీకి దగ్గర్లోనే వారికి ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. రాజకీయ లబ్ది కోసం కాకుండా ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు ఇస్తే స్వీకరిస్తామని చెప్పారు. హైదరాబాద్ నగరానికి ఆస్తిగా ఉన్న మూసీని డ్రయినేజీ కాలువగా వదిలేయబోమని స్పష్టం చేశారు. దీనికోసం మూసీ పరివాహ ప్రజల్లోని అపోహలను తొలగించేందుకు బస్తీల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ -పునరావాసంపై సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిషోర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్, డిప్యూటీ సీఎం సెక్రెటరీ కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ పట్టాలుండి ఇండ్లు నిర్మించుకున్న వారు, పట్టాలు లేకుండా గుడిసెలు వేసుకుని మూసీ పరివాహ ప్రాంతంలో జీవిస్తున్న ప్రజలు కూడా తెలంగాణ బిడ్డలేననీ, వారిని కూడా ప్రభుత్వం కచ్చితంగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతానికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఇండ్లను నిర్మించి ఇస్తామన్నారు. ఇంటర్నేషనల్ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి వారి పిల్లలకు మెరుగైన విద్యను అందిస్తామని చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి, వారి వ్యాపారాలపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మూసీ ప్రజల సమస్యలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలనీ, అపోహలు సృష్టించి ప్రజలను తప్పుతోవ పట్టించి, రాజకీయ లబ్ది పొందాలని చూస్తే హైదరాబాద్ నగరానికి నష్టం చేసిన వారవుతారని హెచ్చరించారు.