చేస్తాం..తగ్గిస్తాం..వాదిస్తాం..

We will do it.. we will reduce it.. we will argue..– బీజేపీ మ్యానిఫెస్టోలో కనిపించని స్పష్టత
– ఇక్కడ రైతుకు ‘మద్దతు’…కేంద్రంలో నో కామెంట్‌
– కమిటీకే పరిమితమైన ఎస్సీ వర్గీకరణ
– జల వివాదాల పరిష్కారంపై ‘నీటిమూటల’ హామీ
– కేంద్రంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి.. ఇక్కడ తగ్గిస్తామని హామీ
– సాయుధ రైతాంగ పోరాటాన్ని రజాకార్ల చుట్టూ తిప్పే యత్నం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ ప్రకటించిన మ్యానిఫెస్టోలో స్పష్టత కొరవడింది. ఎప్పటిలాగానే ప్రజల్ని విభజించు పాలించు అనే రీతిలో భావోద్వేగపరమైన అంశాల చుట్టూ తిరిగింది. శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విడుదల చేసిన బీజేపీ ఎన్నికల ప్రణాళిక ఈ విషయాలనే ధ్రువీకరించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అమలు చేయని హామీలను ఇక్కడ ఎలా అమలు చేస్తారనే చర్చా నడుస్తున్నది. సంక్షేమం గురించి పెద్ద పట్టించుకోలేదనే విమర్శా ఉంది. ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో 700 మంది రైతులు ప్రాణ త్యాగాలు చేసిన తర్వాత నల్లచట్టాలను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నా.. మద్దతు ధర హామీ చట్టంపై నేటికీ స్పష్టత ఇవ్వలేదు. కానీ, తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో వరి ధాన్యానికి మద్దతు ధర రూ.3,100 ఇస్తామని మ్యానిఫెస్టోలో చెప్పుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వమే ఎమ్‌ఎస్‌పీని నిర్ణయిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం బోనస్‌ మాత్రమే ఇస్తుంది. బీజేపీకి రైతులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా ఎమ్‌ఎస్‌పీ గ్యారంటీ చట్టాన్ని తీసుకొచ్చేది. అలా చేయకపోవడాన్ని చూస్తే ఇది కేవలం ఎన్నికల జిమ్మిక్కు అనే చర్చ నడుస్తున్నది. గత ప్రభుత్వాల మాదిరిగానే ఎస్సీ వర్గీకరణను ‘కమిటీ’కే పరిమితం చేసి..దాన్ని మరికొంత కాలం నానబెట్టే ప్రయత్నం చేసింది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రకు రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ పేరుతో మతం రంగు పులిమే ప్రయత్నం చేసింది. ఒక మహత్తర ప్రజా పోరాటాన్ని హిందూ, ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నాల్లో భాగమే ఇది అనే విమర్శ బలంగా వినిపిస్తున్నది. ఉజ్వల లబ్దిదారులకు ఏడాదికి నాలుగు సిలిండర్లు ఇస్తామని చెప్పిందేగానీ..పేదలందరికీ ఇస్తామని ప్రకటించలేదు. గ్యాస్‌సిలిండర్ల ధర నేడు వెయ్యిరూపాయల దాకా ఉండటానికి కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే. అయినా, బీజేపీ హామీ ద్వారా కొందరికే తప్ప పేదలందరికీ ప్రయోజనం చేకూరే అవకాశమే లేదు.
అంతర్‌ రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణా, గోదావరి జలాల వివాదం పరిష్కారం విషయంలో కేంద్రం పట్టించుకోలేదు. కృష్ణా జలాల వాటా విషయంలో ట్రిబ్యునల్‌ వద్ద బలమైన వాదనలు వినిపిస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొందే తప్ప సమస్యను పరిష్కరిస్తామని చెప్పలేదు. జలవివాదాల పరిష్కారంపై నీటిమూటల హామీకే పరిమితమైంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై నియంత్రణ ఎత్తేయడంతో ఇష్టానుసారంగా పెరిగిపోతున్నాయి. చమురు ఉత్పత్తులపై రూ.10 లోపు ఉన్న ఎక్సైజ్‌ డ్యూటీని మోడీ సర్కారు రూ.32కిపైగా పెంచింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తక్కువ ఉన్నప్పటికీ రోజురోజుకీ ధరలు పెరగడానికి కేంద్రమే కారణం. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గిస్తామని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్టేనన్న విమర్శ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నది. రిజర్వేషన్ల అంశంలోనూ ప్రజల మధ్య చీలిక తెచ్చి లబ్ది పొందాలనే తాపత్రయమే కనిపించింది. దానికి తోడు భావోద్వేగభరితమైన అంశాలను పొందుపర్చింది. మతపరమైన విభజన ఎజెండాకు బీజేపీ మొదటి నుంచీ ప్రాధాన్యత ఇస్తున్నది. ముస్లిముల్లోని వెనుకబడిన తరగతుల వారి రిజర్వేషన్లు ఎత్తివేత, వృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీయాత్ర, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లిం మధ్య జరిగినదిగా చూపెట్టేలా పొందుపర్చిన అంశాలు దీన్ని బలపరిచేలా ఉన్నాయి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మతరిజర్వేషన్లు తెలంగాణలో అమలవుతున్నాయి..దాన్ని తీసేస్తాం అని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యతిరేకమే అయితే, పదేండ్లుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దాన్ని ఎందుకు రద్దు చేయలేదనే చర్చ మొదలైంది. పారదర్శకమైన పాలన అందిస్తామంటున్న కేంద్రం తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలకే పరిమితం కావడం తప్ప చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే విమర్శ బలంగా వినిపిస్తున్నది. అంతిమంగా బీజేపీ అట్టహాసంగా ప్రకటించిన మ్యానిఫెస్టోలో ఎక్కడా స్పష్టత లేదనే విమర్శ రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నది.

 

Spread the love