పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చూపుతాం

We will show our strength in the parliamentary elections– కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటే : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌
నవతెలంగాణ- జూబ్లీహిల్స్‌
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా చూపెడతామని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ కార్యకర్తల సమీక్ష సమావేశం శనివారం హైదరాబాద్‌ యూసఫ్‌గూడలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలలో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానాన్ని కైవసం చేసుకుంటామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో 14 ఎమ్మెల్యే సీట్లు కోల్పోయామని, చిన్న, చిన్న పొరపాట్ల వల్ల జిల్లాల్లో ఓటర్లు బీఆర్‌ఎస్‌కు దూరమయ్యారన్నారు. అయితే గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రతి ఒక్కరూ బీఆర్‌ఎస్‌ను ఆదరించారని చెప్పారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌కు కంచుకోట అని రుజువు చేస్తూ ఎమ్మెల్యేగా మూడోసారి మాగంటి గోపీనాథ్‌ను గెలిపించారని, ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. వంద రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, ప్రజల తరఫున పోరాటం చేసి కాంగ్రెస్‌ నాయకులను పరుగులు పెట్టిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్‌, బీజేపీలు రెండూ ఒక్కటే అని, ఎంపీ సీట్లు పంచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌లో చేరిన విష్ణువర్ధన్‌రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌లు రాజ్‌కుమార్‌ పటేల్‌, దేదీప్యరావు, వనజా సంగీత, పార్టీ అన్ని డివిజన్ల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం కేటీఆర్‌ యూసఫ్‌గూడ నుంచి తెలంగాణ భవన్‌ వరకు ఆటోలో వెళ్లారు. ఆటో డ్రైవర్లకు సంఘీభావం తెలుపుతూ అండగా ఉంటామని చెప్పారు.

Spread the love