– సీఐటీయూ యూనియన్ నేతలకు మంత్రి సీతక్క హామీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని అంగన్‌వాడీ కార్మికుల సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ(సీతక్క) తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) నేతలకు హామీనిచ్చారు. గురువారం ఇందిరాపార్కు ధర్నా అనంతరం యూనియన్ ప్రతినిధులతో మంత్రి సీతక్క, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి, ఐసీడీఎస్ అధికారులు చర్చలు జరిపారు. అందులో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.ఈశ్వర్‌రావు, అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.సునీత, ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి, ఆఫీస్‌బేరర్లు ఎం.పద్మ, శారద, కోటేశ్వరి, జి.పద్మ, డి.సునీత, లలిత, రజిత, స్వర్ణ, బాబారు, శశికళ, ఏమేలమ్మ, సమ్మక్క, స్నేహ, తదితరులు పాల్గొన్నారు. 20 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీఐటీయూ నేతలు మంత్రికి అందజేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఉద్యోగ విరమణ ప్రయోజనాలు, అప్‌గ్రేడ్ అయిన మినీ అంగన్వాడి కేంద్రాల సిబ్బందిలకు జీతాల పెంపు, సకాలంలో జీతాలు వంటి అంశాలను పరిష్కరించాలని కోరారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం ప్రభుత్వ దృష్టిలో ఉందంటూ సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్కకు వారు ధన్యవాదాలు తెలిపారు.