– వస్తే..” రైతు బంధుకు రాం రాం.. దళిత బంధుకు జై భీమ్” అంటుంది
– మరోసారి కిసాన్ సర్కార్ రావాలని అందరి ఆకాంక్ష : ముఖ్యమంత్రి కేసీఆర్
– నిర్మల్ జిల్లాకు నిధుల కేటాయింపు
నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే” రైతు బంధుకు రాం రాం.. దళిత బంధుకు జై భీమ్” అంటుందని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆరోపించారు. అధికారం కోసం హస్తం నాయకులు కాసుకొని కూర్చున్నారని, వాళ్లకు అప్పజేప్తే ఆగమవుతామని వ్యాఖ్యానించారు. ధరణిని బంగాళాఖాతంలో కలపాలంటున్న వారినే బంగాళాఖాతంలోకి విసిరేయాలన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రానికి వచ్చిన సీఎం కేసీఆర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం రూ. కోట్లాది నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం పట్టణానికి సమీపంలోని ఎల్లపెల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాకు వరాలు కురిపించారు. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10లక్షలతో పాటు మున్సిపాల్టీలకు రూ.25 కోట్ల చొప్పున, మండల కేంద్రాలకు రూ.20 లక్షల చొప్పున మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే పంటికి అందకుండా మింగేస్తుందని వ్యాఖ్యానించారు. కులాలు, మతాలు అనే తేడా లేకుండా అందరికి సంక్షేమ ఫలాలు అందింస్తున్నామని తెలిపారు. రైతు బంధు బ్యాంకులకు వెళ్లగానే వెంటనే వస్తుందని, దరఖాస్తు లేకుండానే బీమా చెక్కు వస్తుందని తెలిపారు. వడ్ల డబ్బులు బ్యాంకులో వేస్తున్నామని తెలిపారు. ధరణిని తీసేస్తే ఇవన్నీ జరుగుతాయా అని ప్రశ్నించారు. ధరణిని చూసి మహారాష్ట్ర వాసులు ఆశ్చర్యపోతున్నారని, మరో సారి కిసాన్ సర్కార్ రావాలని అందరూ కోరుకుంటున్నారని స్పష్టంచేశారు. మరోసారి అధికారంలోకి వస్తే తాలుకాల వారీగా ఫూడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం 27, 28 ప్యాకేజీ పనులు త్వరగా పూర్తి చేస్తామని, లక్ష ఎకరాలకు నీరు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలుషిత నీటి కారణంగా రోగాలతో సతమతమయ్యేదని, మిషన్ భగీరథ నీళ్లు రావటంతో రోగాలు లేకుండా పోయాయన్నారు. బాసర క్షేత్రాన్ని కొద్ది రోజుల్లోనే అధ్భుత ఆలయంగా నిర్మిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తామని తెలిపారు. గూడేలు, తండాల్లో ‘మావనాటే మావరాజ్’ పాలన జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్‌పర్సన్ విజయలక్ష్మీ, ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, జోగురామన్న, రాథోడ్ బాపురావ్, రేఖనాయక్, దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు తదితరులు పాల్గొన్నారు.