తెలంగాణలోనూ బీజేపీని తుడిచిపెట్టేస్తాం

– కర్నాటక తరహాలోనే రిజల్ట్స్‌ ఖాయం : రాహుల్‌ గాంధీ
న్యూయార్క్‌: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తమ పార్టీ ఇతర రాష్ట్రాల్లోనూ ఆ పరంపరను కొనసాగిస్తుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లోనూ బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు. కేవలం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే కాదని.. యావత్తు దేశం విద్వేషపూరిత సిద్ధాంతాలను ఓడించేందుకు సిద్ధమైందని బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు.”బీజేపీని తుడిచిపెట్టేయగలమని కర్నాటకలో నిరూపించాం. మేం వారిని కేవలం ఓడించలేదు. తుడిచిపెట్టేశాం” అని న్యూయార్క్‌లో ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌- యూఎస్‌ఏ నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్‌ అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన న్యూయార్క్‌, వాషింగ్టన్‌, శాన్‌ఫ్రాన్సిస్కోలో కార్యక్రమాలను ముగించుకొని మాన్‌హాటన్‌ చేరుకోనున్నారు.
కర్ణాటకలో బీజేపీ అన్ని శక్తులను ఒడ్డి పోరాడిందని రాహుల్‌ చెప్పారు. అయినప్పటికీ.. కాంగ్రెస్‌ ఆ పార్టీని తుడిచిపెట్టేసిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలోనూ అదే జరగబోతోందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీని గుర్తించడం కష్టమని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అలాగే రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లోనూ బీజేపీ కనిపించకుండా పోతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ చేస్తున్న విద్వేష రాజకీయాలతో ముందుకెళ్లలేమని దేశ ప్రజలు గుర్తించడమే అందుకు కారణమన్నారు.
2024 ఎన్నికల్లోనూ బీజేపీని ఓడిస్తామని రాహుల్‌ అన్నారు. ప్రతిపక్షాలు ఏకమయ్యాయని చెప్పారు. అన్ని పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఓవైపు బీజేపీ విద్వేషపూరిత సిద్ధాంతం.. మరోవైపు కాంగ్రెస్‌ ప్రేమపూర్వక సిద్ధాంతం ప్రజల ముందున్నాయని వ్యాఖ్యానించారు.

Spread the love