గల్ఫ్‌ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు

గల్ఫ్‌ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు– ప్రజావాణిలో గల్ఫ్‌ బాధితుల కోసం ప్రత్యేక కౌంటర్‌
– మరణించిన కార్మికుల కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా
– వారి పిల్లలకు గురుకులాల్లో సీట్లు : మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గల్ఫ్‌ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిలో గల్ఫ్‌ బాధితుల కోసం ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. వివిధ కారణాలతో గల్ఫ్‌లో మరణించిన కార్మికుల కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి, వారి పిల్లలకు గురుకులాల్లో సీట్లు కేటాయిస్తామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధ్యక్షతన శనివారం గల్ఫ్‌ కార్మికులు అధికంగా ఉండే నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ నాయకులు వినోద్‌ల ఆధ్వర్యంలో ఐదు అంశాలపై సమావేశంలో చర్చించారు. ప్రధానంగా గల్ఫ్‌ కార్మికుల సంక్షేమంపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయాలనీ, దానిలో గల్ఫ్‌ ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు సభ్యులుగా ఉండేలా ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేయాలని సూచించారు. అలాగే హైదరాబాద్‌ ప్రజాభవన్‌లో ప్రతి మంగళవారం , శుక్రవారం జరిగే ప్రజావాణిలో గల్ఫ్‌ కార్మికుల కోసం ‘ప్రవాసి ప్రజావాణ’ి నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ప్రజావాణిలో ఈనెల 20వ తేది నుంచి గల్ఫ్‌ బాధితుల కోసం ప్రత్యేక కౌంటర్‌ ప్రారంభిస్తామన్నారు. గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో గల్ఫ్‌ కార్మికుల పిల్లలకు వంద శాతం అడ్మిషన్‌ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గల్ఫ్‌ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గతంలో చనిపోయిన వారి కుటుంబాలకు మానవతా దృక్పథంతో రూ. లక్ష ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సూచించారు. రైతు భీమా తరహాలో గల్ఫ్‌ బీమా ఉండాలని కోరారు.

Spread the love