– పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్, కాస్మెటిక్ చార్జీలు పెంచాలి
– ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కంభంపాటి శంకర్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
జిల్లాలోని సంక్షేమ శాఖ హాస్టలు సమస్యలకు నిలయంగా మారాయని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటి శంకర్ లు ఆరోపించారు. బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్షేమ శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకులు మారిన విద్యార్థుల బ్రతుకులు మారవా అని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో ఉండే పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో పాలక ప్రభుత్వాలు, స్థానిక హెచ్ డబ్ల్యూవో లు ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్న ఇప్పటివరకు విద్యార్థులకు ప్రభుత్వం మెనూ ప్రకారం భోజనం అందించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు కావాల్సిన కనీస సౌకర్యాలు టాయిలెట్స్, అన్ని రూములలో ఫ్యాన్లు, త్రాగడానికి మంచినీరు కూడా అందనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో పేద, మధ్యతరగతి విద్యార్థులు విద్యను కొనసాగిస్తున్నారని ఆవేదన చెందారు. హాస్టల్ వార్డెన్ లకు బదిలీలపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై పెట్టాలని డిమాండ్ చేశారు. కొంతమంది కళాశాల హాస్టల్ వార్డెన్ లు విద్యార్థులు భోజనం బాగుండడం లేదని వార్డెన్ ల దృష్టికి తీసుకెళ్తే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అసభ్య కరంగా మాట్లాడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అలాంటి వారి తీరు మారాలి అని హెచ్చరించారు. విద్యార్థులకు బట్టలు దుప్పట్లు పెట్టెలు ప్లేట్లు గ్లాసులు ఇవ్వడం ఒక కలగానే మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్ల లో ఏఎస్డబ్ల్యూఓ, బీసీడబ్ల్యూఓ, ఏటిడిఓ ల పర్యవేక్షణ కొరబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి అన్ని హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన బియ్యం అందించాలని, ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టని హెచ్ డబ్ల్యూ పై చర్యలు తీసుకోవాలని కోరారు.అనంతరం ఏఎస్డబ్ల్యూఓ కు వినతి పత్రం అందజేశారు.ఈ ధర్నా కార్యక్రమంలో నల్గొండ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు స్పందన హర్షవర్ధన్, యశ్వంత్, నవదీప్, ప్రశాంత్, నిశ్వంత్, కిరణ్ ,సాయి, సన్నీ, మౌనిక, పావని, తదితరులు పాల్గొన్నారు.