– వాటి పరిష్కారానికి సిఫార్సులు చేయండి
– టీఎస్‌ఆర్టీసీ విలీన కమిటీకి ఎస్‌డబ్ల్యూఎఫ్ వినతి
– ఆంధ్రప్రదేశ్‌లో అధ్యయనం చేసివచ్చిన బృందం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేసే క్రమంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి అనుగుణంగా సిఫార్సులు చేయాలని టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) విలీన కమిటీ చైర్మెన్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుకు విన్నవించింది. శుక్రవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశం లో ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్ రావు మాట్లాడారు. టీఎస్‌ఆర్టీసీ విలీన ప్రక్రియపై తమ సంఘం ప్రతినిధి బృందం ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి ఏపీఎస్‌ఆర్టీసీ విలీనం తర్వాత అక్కడి కార్మికుల స్థితిగతులు, ఇబ్బందులు, పరిష్కారమార్గాలపై అధ్యయనం చేసి వచ్చిందని తెలిపారు. ఫెడరేషన్ విలీన అధ్యయక బృందానికి ఫెడరేషన్ అధ్యక్షులు వీరాంజనేయులు కన్వీనర్‌గా వ్యవహరించారు. ఉప ప్రధాన కార్యదర్శి జీ లింగమూర్తి, ప్రచార కార్యదర్శి పీ రవీందర్‌రెడ్డి, కోశాధికారి గంగాధర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కే సత్తిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బీ సుధాకర్, పీ చంద్రప్రకాష్ సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం అనేక అంశాలపై అధ్యయనం చేసి ఇచ్చిన సిఫార్సుల నివేదికను టీఎస్‌ఆర్టీసీ విలీన కమిటీ చైర్మెన్‌తో పాటు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్, టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌కు అందచేసినట్టు తెలిపారు. టీఎస్‌ఆర్టీసీలో ప్రస్తుతం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, రావల్సిన ఆర్థిక ప్రయోజనాలు, అమలవుతున్న విధివిధానాలపై సమగ్రమైన సూచనలతో నివేదికను ఇచ్చారు. విలీన ప్రక్రియ పూర్తయ్యాక ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారాలనూ తమ సిఫార్సుల్లో సూచించారు. మొత్తం 37 అంశాల్లో, ఉపాంశాలను కూడా ప్రస్తావిస్తూ సమగ్రమైన నివేదికను రూపొందించి ఇచ్చినట్టు వివరించారు.
అధ్యయన బృందం సిఫార్సుల్లో కొన్ని…
కార్మికులు దీర్ఘకాలం నుంచి డిమాండ్ చేస్తున్న ఆర్‌పీఎస్ బకాయిలు, 2017 ఏప్రిల్ 1 నుంచి రావల్సిన 31 శాతం డిఏ పాయింట్ల విలీనంతో కూడిన వేతన ఒప్పందం, 2021 ఏప్రిల్ 1 నుంచి రావల్సిన మరో వేతన ఒప్పందం, 2023 జనవరి, జులై మాసాల డిఏలు ప్రకటించి, వాటితో పాటే ఏడు డిఏల బకాయిలు రూ.700 కోట్లను చెల్లించాలని కోరారు. టీఎస్‌ఆర్టీసీ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (సీసీఎస్)కి యాజమాన్యం ఇవ్వాల్సిన రూ.1.070 కోట్లు చెల్లించాలనీ, పీఎఫ్ ట్రస్ట్‌కు ఇవ్వాల్సిన రూ.1,270 కోట్లు తక్షణం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హయ్యర్ పెన్షన్ స్కీం ఆప్షన్‌లో దరఖాస్తుచేసుకున్న వారి ఖాతాల్లోని సొమ్మును వెంటనే పీఎఫ్ కమిషనర్ ఖాతాకు జమచేయాలని విజ్ఞప్తి చేశారు. సర్వీసులో ఉండి చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీం (ఈడీఎల్‌ఐఎస్) కనీస మొత్తాన్ని రూ. 7 లక్షలకు పెంచి, తక్షణం అమల్లోకి తేవాలని కోరారు. స్టాప్ రిటైర్‌మెంట్ బెనిఫిట్ స్కీం (ఎస్‌ఆర్‌బీఎస్) ద్వారా ఒక్కో కార్మికుడు ప్రతినెలా రూ.250 జమ చేస్తున్నారనీ, ఈ సొమ్ము రూ.540 కోట్లను యాజమాన్యం స్వంతానికి వాడేసుకున్నదనీ, దాన్ని ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. సర్వీసులో ఉండి చనిపోయిన కార్మికుల కుటుంబాల కోసం నిర్వహిస్తున్న స్టాఫ్ బెన్వలెంట్ అండ్ త్రిఫ్ట్ ఫండ్ (ఎస్‌బీటీ) సొమ్ము రూ.140 కోట్లను కూడా యాజమాన్యం స్వంతానికి వాడేసుకున్నదని తెలిపారు.
ఈ స్కీం కోసం కార్మికులు ప్రతినెలా తమ వేతనాల నుంచి రూ.100 జమ చేస్తున్నారని గుర్తుచేశారు. విలీన కమిటీలో ఆర్టీసీలో పనిచేస్తున్న రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులకూ ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరారు. బస్సుల సంఖ్య పెంచాలనీ, ఎలక్ట్రిక్ బస్సుల్ని ఆర్టీసీనే కొనుగోలు చేసి నడపాలనీ, కార్మికులకు అమలవుతున్న బత్తాలు, అలవెన్సులు ఇతర సదుపాయాలన్నింటినీ కొనసాగించాలని కోరారు. 2014 నుంచి అమలుకు నోచుకోని లీవ్‌ఎన్‌క్యాష్‌మెంట్‌ను పునరుద్ధరించాలనీ, విలీనం కంటే ముందు రిటైర్ అయిన ఆర్టీసీ కార్మికులకు రావల్సిన టెర్మినల్ బెనిఫిట్స్‌ను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, కుటుంబసభ్యులకు అమలవుతున్న అపరిమిత వైద్య సదుపాయాలను కొనసాగించాలనీ, కార్పొరేట్ వైద్యం పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని సిఫార్సు చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు ఏటా ఇస్తున్న మూడు పాస్‌ల జారీని కొనసాగించాలనీ, పనిభారాలు తగ్గించాలనీ, డిపో స్పేర్ విధానాన్ని ఏత్తేయాలనీ, ప్రమాద సమయంలో డ్రైవర్లకు ప్రభుత్వమే బెయిల్ ఇవ్వాలనీ, టిక్కెట్ తీసుకొనే బాధ్యత ప్రయాణీకులదేననీ, కండక్టర్లపై అనవసర వేధింపులు నిలుపుదల చేయాలని కోరారు. బ్రెడ్ విన్నర్ స్కీం ద్వారా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలలోని వారికి రాష్ట్ర ప్రభుత్వం తరహాలో సూపర్ న్యూమరీ పోస్టు సృష్టించి, రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు చేయాలని కోరారు. ఈ స్కీం ద్వారా నియమితులైన 168 సెక్యూరిటీ గార్డుల సర్వీసును రెగ్యులర్ చేయలని కోరారు. సంస్థలో అక్కౌంట్స్ విభాగాన్ని కేంద్రీకరిస్తూ విడుదల చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలనీ, విలీన ప్రక్రియ సమయంలో భవిష్యత్‌లో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు.