ప్రకృతి విపత్తుకు కారకులెవరు!?

ఇటీవల కాలంలో హిమాలయ పర్వత శ్రేణులు కలిగిన రాష్ట్రాలు ప్రకృతి విపత్తులకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో తరచూ భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరుచుకుపడటం చూస్తూనే ఉన్నాం. అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, భవనాలు కూలిపోతూ ఆ ప్రాంత ప్రజలతో పాటు మొత్తం దేశం అంతా ఏమిటి ఈ బీభత్సం అంటూ ఆందోళనలో ఉంది. గతేడాది ‘జోషిమఠం’ సంఘటనలతో హడలిపోయి కొంచెం ఊరట కలుగుతున్న సమయంలో, నేడు ఈ భారీ వర్షాలు, వరదలతో ఆ ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ప్రజలు తల్లడిల్లి పోతున్నారు. ఏమిటి తరచూ ఈ విపత్తులకు కారణం అని విశ్లేషణ చేస్తే ”మానవ తప్పిదాలే” అని తెలుస్తోంది. ముఖ్యంగా ఆధునీకరణ, అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని ఇష్టం వచ్చినట్టు ధ్వంసం చేయడమే… పర్యాటకం పేరుతో పలు నిర్మాణాలు చేపట్టారు. కొండలు గుట్టలు ఇష్టారాజ్యంగా తవ్వి రోడ్లు నిర్మాణాలు చేపట్టారు. కొండ కోనల్లో మితిమీరిన భవనాలు, రిసార్ట్‌లు నిర్మిస్తున్నారు. అసలే అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు, నేల స్వరూపాలు మైదాన, పీఠభూములకు విభిన్నంగా ఉంటుంది. దీనిని పరిగణనలోకి తీసుకోకుండా, వ్యాపార దృక్పథంతో, డబ్బులు సంపాదించాలనే తపనతో పర్యావరణానికి, నిబంధనలకు విరుద్ధంగా అనేక తవ్వకాలు జరిపి, కొండలను తొలిచి, మైదానాలుగా మార్చి కట్టడాలు నిర్మించారు. దీంతో అసమతౌల్యం తరచూ ఏర్పడుతూ పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రకృతి వనరులు, మైనింగ్‌లో పెద్ద ఎత్తున కార్పొరేట్స్‌ ప్రవేశించారు. వీరికి అనుకూలమైన పద్ధతుల్లో చట్టాలు చేసే పాలకులు ఉండటం గమనార్హం. ప్రయివేటీకరణ, ఆధునీకరణ అభివృద్ధి పేరుతో అడవులను ధ్వంసం చేయడమే ఈ విపత్తులకు అసలు కారణమని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు.
– రావు, సెల్‌: 6305682733 

 

Spread the love