
– అదుపు తప్పితే ప్రాణం బావిలో
– అడ్డు గోడలు నిర్మించాలి
నవతెలంగాణ – చిన్నకోడూరు
అసలే రెండు వరుసల రింగ్ రోడ్డు. రోడ్డు ఎక్కమా వాహణదారునికి తెలియకుండానే మెరుపు వేగంతో పరుగులు పెట్టేలా నునుపైన, విశాలమైన రోడ్డు. ఇంకేముంది వాహణదారులు ఇష్టారీతిన రయ్ రయ్ మంటూ దూసుకుపోతుంటారు. కానీ అక్కడే రోడ్డును ఆనుకుని పిచ్చి మొక్కలు, ఏపుగా పెరిగిన చెట్ల మధ్య అదుపు తప్పితే ప్రాణం బావిలో అనే పరిస్థితి నెలకొంది. సిద్దిపేటకు హారంలా రెండు వరుసల రింగ్ రోడ్డును మంత్రి హరీష్ రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఈ రోడ్డు 88కి.మీ మేర రూ.160కోట్లతో రాజీవ్ రహదారి నుండి రాజీవ్ రహదారిని అనుసంధానం చేస్తూ సిద్దిపేట చుట్టూ వలయాకారంలో వేస్తున్నారు. సిద్దిపేట చుట్టూ రెండు వరుసల రింగ్ రోడ్డు నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. కానీ రింగ్ రోడ్డును ఆనుకుని కనిపించకుండా పిచ్చి మొక్కలు, ఏపుగా పెరిగిన చెట్ల మధ్య ఉన్న వ్యవసాయ బావులకు రక్షణ గోడలు నిర్మించడంలో రోడ్డు నిర్మాణదారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు, రైతులు అంటున్నారు. కనీసం ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. అలాగే మొన్నటి వరకు కురిసిన వర్షాలకు రోడ్డు అనేక చోట్ల చీలికలు, కయ్యలు పడ్డాయి ఏ చీకట్లో ఎదుటి వాహనం హెడ్ లైట్స్ కి భయపడి రోడ్డు దిగామా కయ్యల రూపంలో ప్రమాదం పొంచి ఉంది. వాహనదారులు ఏమాత్రం అజాగ్రత్తగా నడిపినా పెను ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో సందర్శించి రోడ్డు ఆనుకుని ఉన్న ప్రమాదకరమైన బావులు వద్ద అడ్డుగోడలు, కయ్యలను పునరుద్ధరించాలని వాహణదారులు కోరుతున్నారు.