– హైడ్రాపై ఇంటెలిజెన్స్‌ను ఆరా తీసిన సర్కారు
– పేదలను వదిలేయాలంటూ ప్రజల విజ్ఞప్తులు
– వ్యాపార, వాణిజ్య, పారిశ్రామితకవేత్తల
– భవనాలను నేలమట్టం చేయాల్సిందేనంటున్న జనం
– ఎమ్మెల్యేలు సైతం సానుకూలం : కొనసాగింపునకే సీఎం నిర్ణయం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
హైడ్రా చర్యలపై ఇంటెలిజెన్స్‌ను సర్కారు ఆరా తీసింది. జనం ఏమనుకుంటున్నారంటూ ‘నిఘా’ వ్యవస్థను సమాచారం అడిగింది. చెరువులు, నాళాల ఆక్రమణలను దూకుడుగా తొలగిస్తున్న నేపథ్యంలో హైడ్రాపై ప్రజల మనస్సులో ఏముందో సర్కారీ నిఘా వ్యవస్థ ముందస్తుగానే రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసినట్టు తెలిసింది. ప్రధానంగా రాజధాని, హెచ్‌ఎండీఏ పరిధిలో దృష్టిపెట్టారు. ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారం అడిగితే ఇవ్వడానికి ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంటు అప్రమత్తతతో ఉన్నట్టు తెలిసింది. ఈనేపథ్యంలో రెండు రోజుల క్రితం ప్రభుత్వం నుంచి ఇంటెలిజెన్స్‌ను హైడ్రాకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక అడిగారు. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపినట్టు తెలిసింది. హైడ్రా పేర ఆక్రమణలు తొలగిస్తూ ప్రభుత్వం కఠినంగా చేపడుతున్న చర్యలను కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నట్టు తేలింది. కాగా పేదలు, చిన్న, మధ్య తరగతి ప్రజలు అప్పులు చేసి తెలిసీ, తెలియక కొనుగోళ్లు చేసిన నేపథ్యంలో వారిని హైడ్రా చర్యల నుంచి మినహాయించాలనే విజ్ఞప్తులు ప్రజల నుంచి వచ్చినట్టు సమాచారం. అదే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, వ్యాపారవర్గాలు, సినీప్రముఖులు, లాభాల కోసం చెరువులను ఆక్రమించి అడ్డగోలుగా కోట్లకు కోట్లకు ఎగబాకిన వారి పట్ల కఠిన వైఖరినే కొనసాగించాలని సర్వేలో జనం నుంచి అభిప్రాయాలు వచ్చినట్టు సమాచారం.అలాగే భవనాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వచ్చింది. ఇకపోతే లంచాలు అనుమతులు పొంది రియల్టర్లు, బిల్డర్లపై చట్ట ప్రకారం కేసులు పెట్టాలని కోరినట్టు సమాచారం హైడ్రా అధికారుల ఆదివారం నాటి లెక్కల ప్రకారం ఇప్పటివరకు దాదాపు 50 ఎకరాల సర్కారీ భూమిని కబ్జాదారుల చెర నుంచి రక్షించారు. సుమారు 18 ప్రాంతాల్లో 166 కట్టడాలను కూల్చేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ నిబంధనలను పాటించని వారి భవనాలను యంత్రాలతో కూల్చివేస్తున్న విషయం విదితమే. అలాగే నోటీసులు ఇవ్వకుండానే చెరువులు, నాళాల్లో ఆక్రమణలు తొలగించవచ్చనే సుప్రీంకోర్టు తీర్పుని హైడ్రా అధికారులు పకడ్బంధిగా అమలుచేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఆక్రమణల తొలగింపు మూలంగా సర్కారుకు చెడ్డపేరు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే విషయమై సీఎం రేవంత్ అంతర్గతంగా తన మంత్రులతో మటామంతి చేశారనే ప్రచారం ఉంది. ఏదీఏమైనా పర్యావరణాన్ని కాపాడేందుకు అడుగు ముందుకేసామనీ, వెనక్కి తిరిగిచూసే అవకాశం లేదని అంటున్నారు. హైడ్రా ఆక్రమణ తొలగింపు విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం సంతృప్తిగానే ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తమ దృష్టికి వచ్చిన విషయాలను సీఎం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నాలు సైతం చేశారని సమాచారం. అయితే సీఎం ససేమిరా అన్నారనీ, హైడ్రా విషయంలో వెనడుగు వేసే పరిస్థితి లేదని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇదే విషయాన్ని సీఎం ఆయా సభలు, సమావేశాల్లో కుండబద్దలు కొడుతున్నారు కూడా. ఒకవేళ వెనక్కితగ్గితే సీఎం రేవంత్‌పై ఉన్న నమ్మకం సడలుతుందనే వ్యాఖ్యానాలు గాంధీభవన్‌లో వినిపిస్తున్నాయి. సినీనటుడు నాగార్జునకు చెందిన ‘ఎన్’ కన్వెన్షన్‌ను కూల్చివేశాక హైడ్రాకు మరింత ప్రచారమొచ్చిన సంగతి తెలిసిందే. కబ్జాదారుల్లో అత్యధికంగా రాజకీయ, సినీ, క్రీడారంగాలకు చెందిన ప్రముఖులు ఉన్న విషయం విదితమే. వారంతా సీఎంపై ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం నుంచి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా ఆశించిన ఫలితం రాలేదని గాంధీభవన్‌లో గుసగుసలు వినిపిస్తుండటం గమనార్హం