ఓరెల్లన్నా అంటే వొయ్యత్తన్నవారా? ఎప్పడు దీసుకవోతరటరా? కొడుకులు, కోడండ్లు,అల్లుండ్లు, బిడ్డలందరచ్చిండ్రారా? పెద్ద బలుగంరా ఆంది. అయినా ఉన్నన్ని రోజులేరా, మంచి చెడ్డా. పోయినంక ఎవరచ్చి సూత్తా ర్రా.. అయినా పోషిగాడు శిన్నోడారా? ఎన్నడన్నా బుక్కెడు బువ్వ వెట్టిండారా ఎవనికన్నా? మందికి వెట్ట పాయె, ఆడు దినకపాయె. కొడుకులు, బిడ్డలని కడుపుగట్టుకొని బతికిండు గదరా? ఈనికన్నా ముందు ఆ ముసల్ది పోవుడు నయమైంది. లేకుంటే ఎంత గోసపడునో? అర్వ కట్టం జేసింది. బంగార మసోంటి సావచ్చింది. ఈ గాడిదే శెప్పుతిన్నడారా? మూన్నెళ్లైతాంది మంచాన వడి. ఇద్దరు గాడుదులున్నా, ఎవ్వరు.. వట్టించుకోలే. సుట్టపు సూపు లెక్క అచ్చిపోయిండ్రు. ఈని మొండితనంగాక పోతేందిరా? రాయే బాపంటే, వీడు వాళ్ల దగ్గరికి వోకపాయె. వాళ్లకు ఇక్కడుండి అర్సుకునుడు వీలుగాక పాయె. ఎంగోసరా ఆంది, యాదికత్తె దుక్కమత్తది. అయినా ఆని గురించి శెపుతాన్న గాని, నా గతెంతకుందో? కొడుకులు మనోళ్ళైతే కోడండ్లు మనోళ్లైతరారా? అటు మాట్లాడితే ఇటు జూత్తరు. ఇటు మాట్లాడితే అటు జూత్తరు. ఇద్దరట్నే పాడ యిండ్రు. మా ముసల్దాని కన్నా ముందు నేనే వోవాల్రా. దాని మాటన్నా ఇంత గైశేత్తరుగని, నన్నైతే గంజిలీగను దీశేశినట్టు దీశేత్తరు. ఎల్లన్నా ఇగవోయె. ఈన తోని ఎంతసేపు మాట్లాడినా ఒడ్వది తెగది. ఓ పెద్దమనిషి అరుగు మీద గూసోని అచ్చిపోయెటోల్లతోని ముచ్చట వెట్టుడేనా? అంబటాల్లైంది. ఇంత మింగుతువుదా. అని మా ముసల్ది కోప్పడేసరికి బుక్కడంత తిందామని ఇంట్లకు వోయిన.
– ఊరగొండ మల్లేశం