షట్లర్లకు ఏమైంది?

– సుదిర్మన్‌ కప్‌లో భంగపాటు
– ఆందోళనగా భారత షట్లర్ల ప్రదర్శన
మే 15, 2022 భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలోనే సువర్ణ అధ్యాయం. భారత మెన్స్‌ జట్టు ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ (ప్రపంచ చాంపియన్‌షిప్స్‌) పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. సరిగ్గా ఏడాది అనంతరం.. భారత షట్లర్లు మరో ప్రతిష్టాత్మక టోర్నీలో పతకం ఆశించి దారుణంగా భంగపడ్డారు. ప్రపంచ జట్టు చాంపియన్‌షిప్స్‌ (సుదిర్మన్‌ కప్‌) నుంచి గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. ఆసియా క్రీడలు, పారిస్‌ ఒలింపిక్స్‌ అర్హత ప్రక్రియ ముంగిట భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల ఫామ్‌ ఆందోళనగా మారింది.

నవతెలంగాణ క్రీడావిభాగం
సుదిర్మన్‌ కప్‌. మిక్స్‌డ్‌ టీమ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌. ఇప్పటి వరకు ఈ టోర్నీలో కేవలం మూడు జట్లు మాత్రమే పసిడి పతకాలు సొంతం చేసుకున్నాయి. నాల్గో జట్టుకు స్వర్ణం అందని ద్రాక్షగానే మిగిలింది. అత్యంత పోటీ నెలకొని ఉండే సుదిర్మన్‌ కప్‌లో పతకం ఆశించిన టీమ్‌ ఇండియా.. మంచి జట్టునే చైనాకు పంపించింది. నిరుడు భారత మెన్స్‌ జట్టు థామస్‌ కప్‌ (ప్రపంచ మెన్స్‌ జట్టు చాంపియన్‌షిప్స్‌) విజేతగా నిలువటంతో.. ఈ ఏడాది సుదిర్మన్‌ కప్‌లో పతక ఆశలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా థామస్‌ కప్‌ నెగ్గిన షట్లర్లు అందరూ సుదిర్మన్‌ కప్‌ జట్టులోనూ ఉన్నారు. నిరుడు మలేషియాపై 5-0తో ఎదురులేని విజయం సాధించిన భారత్‌ థామస్‌ కప్‌ విజేతగా నిలిచింది. తాజాగా అదే జట్టు చేతిలో 0-5తో దారుణ పరాజయం చవిచూసి సుదిర్మన్‌ కప్‌ గ్రూప్‌ దశ నుంచే నిష్క్రమించింది. సుదిర్మన్‌ కప్‌లో తొలుత చైనీస్‌ తైపీ చేతిలో 1-4తో ఓడిన భారత్‌.. రెండో మ్యాచ్‌లో 0-5 మలేషియా చేతిలో మట్టికరిచింది. వరుస మ్యాచుల్లో ఓటములతో సుదిర్మన్‌ కప్‌ గ్రూప్‌ దశ దాటలేదు. వరుస ఏడాదుల్లో రెండు ప్రతిష్టాత్మక జట్టు ఈవెంట్లలో టీమ్‌ ఇండియా పూర్తి భిన్నమైన ప్రదర్శన కనబరిచింది. థామస్‌ కప్‌, సుదిర్మన్‌ కప్‌ ఫలితాల్లో వ్యత్యాసం భారత బ్యాడ్మింటన్‌పై పలు పదునైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఆసియా క్రీడలు, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ అర్హత ప్రక్రియ షురూ కానున్న నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల ఫామ్‌ చర్చనీయాంశంగా మారింది.
ఆసియాలో మెరిసినా..: సుదిర్మన్‌ కప్‌లో భారత్‌కు క్లిష్టమైన డ్రా లభించింది. గ్రూప్‌-సిలో చైనీస్‌ తైపీ, మలేషియా, ఆస్ట్రేలియాలతో కూడిన గ్రూప్‌లో భారత్‌ నిలిచింది. చైనీస్‌ తైపీ, మలేషియాలు బ్యాడ్మింటన్‌కు సంప్రదాయ దిగ్గజాలు. గ్రూప్‌-సిని ‘గ్రూప్‌ ఆఫ్‌ డెత్‌’గా పిలిచినా.. భారత పరాజయం వ్యత్యాసం సమర్థనీయం కాదు. చైనీస్‌ తైపీ చేతిలో 1-4తో, మలేషియా చేతిలో 0-5తో టీమ్‌ ఇండియా ఓటమి పాలైంది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ టోర్నీలో మరో మెడల్‌ ఖాయం అనుకున్న తరుణంలో ఇటువంటి ఫలితం ఆమోదయోగ్యం కాదు. కామన్‌వెల్త్‌ క్రీడల ఫైనల్లో మలేషియా చేతిలో ఓడిన భారత్‌.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్స్‌ గ్రూప్‌ దశలో అదే జట్టుపై భారత్‌ విజయం సాధించింది. ఆ విజయంతో క్వార్టర్‌ఫైనల్లో చైనా సవాల్‌ను దాటేసిన భారత్‌.. సెమీఫైనల్స్‌కు చేరుకుని పతకం ఖాయం చేసుకుంది. బ్యాడ్మింటన్‌ ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్స్‌లో పతకం భారత బ్యాడ్మింటన్‌లో ఉత్సాహం నింపింది.
ఎందుకిలా..? : ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్స్‌, సుదిర్మన్‌ కప్‌ ఫార్మాట్‌లు ఒకటే. రెండు టోర్నీల్లో జట్టు విభాగంలో ఐదు మ్యాచులు ఉంటాయి. మెన్స్‌, ఉమెన్స్‌ సింగిల్స్‌.. మిక్స్‌డ్‌, మెన్స్‌, ఉమెన్స్‌ డబుల్స్‌ విభాగాల్లో పోటీలు ఉంటాయి. బ్యాడ్మింటన్‌లో సహజంగానే ఆసియా జట్లదే హవా. ఆసియా చాంపియన్‌షిప్స్‌లో మెరిసిన జట్టు సాధారణంగా ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లోనూ పతకం కొడుతుంది. అదే దీమా భారత జట్టుపై కనిపించింది. నిలకడ లేమి భారత జట్టును దారుణంగా దెబ్బతీసింది. ఆసియా చాంపియన్‌షిప్స్‌లో మలేషియాను ఓడించిన భారత్‌.. మూడు నెలల విరామంలో ఆ జట్టు చేతిలోనే ఓడటం పెద్ద విషయం కాదు, కానీ ఓడిన తీరు విమర్శలకు దారితీసింది. ఆసియా టోర్నీలో హెచ్‌.ఎస్‌ ప్రణరు మెన్స్‌ సింగిల్స్‌లో 18-21, 21-13, 25-23తో వరల్డ్‌ నం.4 లీ జి జియపై గెలుపొందాడు. తాజాగా మెన్స్‌ సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 16-21, 11-21తో వరల్డ్‌ నం.8 లీ జి జియ చేతిలో మట్టికరిచాడు. చైనీస్‌ తైపీతో పోరులో ప్రణరు పరాజయంతో మలేషియాతో మ్యాచ్‌లో శ్రీకాంత్‌ బరిలోకి దిగాడు. అయినా, శ్రీకాంత్‌ ఎక్కడా లయ అందుకోలేదు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఈవెంట్‌ ఎప్పుడూ భారత్‌కు బలహీనతే. ధ్రువ్‌ కపిల, అశ్విని పొన్నప్ప జంట.. వరల్డ్‌ నం.8 జోడీతో పోరులో అంచనాల మేరకు ఆడి ఓడింది. ఇక భారత్‌ భారీగా ఆశలు పెట్టుకున్న పోరు మహిళల సింగిల్స్‌. మలేషియాపై భారత్‌ అలవోకగా నెగ్గే మ్యాచ్‌ ఏదైనా ఉంటే అది మహిళల సింగిల్సే. ఫిబ్రవరిలో లింగ్‌ చింగ్‌ వాంగ్‌తో పి.వి సింధు ఆడింది. అలవోకగా ఆ మ్యాచ్‌లో గెలుపొందింది. సుదిర్మన్‌ కప్‌లో సింధు మూడు గేముల్లో పోరాడింది. వరల్డ్‌ నం.30 జిన్‌ వీ చేతిలో తొలిసారి పరాజయం చవిచూసింది. తొలి గేమ్‌ను 21-14తో నెగ్గిన సింధు.. రెండో గేమ్‌ను 10-21తో చేజార్చుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 2-11తో వెనుకంజ వేసింది. కానీ ఆ తర్వాత 15 పాయింట్లలో సింధు ఏకంగా 12 పాయింట్లు సొంతం చేసుకుంది. 14-15తో పుంజుకుని 19-19తో స్కోర్లు సమం చేసింది. 20-20తో మ్యాచ్‌ పాయింట్‌ కాచుకున్న సింధు.. ఆ తర్వాత రెండు పాయింట్లను కాపాడుకోలేదు. 20-22తో అనూహ్య ఓటమి చవిచూసింది. ఆసియా చాంపియన్‌షిప్స్‌లో మెన్స్‌ డబుల్స్‌ మ్యాచ్‌కు ముందే భారత్‌ విజయం ఖాయమైంది. అప్పుడూ.. ఇప్పుడూ ప్రపంచ చాంపియన్లు, ప్రియ ప్రత్యర్థులు అరోన్‌ చియా, సో వూ యిక్‌ల చేతిలో మనోళ్లు వరుసగా ఎనిమిదో ఓటమి చెందారు. 18-21, 19-21తో పోరాడి ఓడారు. చివరగా మహిళల డబుల్స్‌లో గాయత్రి పుల్లెల, ట్రెసా జాలి జంట ఆసియా చాంపియన్‌షిప్స్‌లో కామన్‌వెల్త్‌ చాంపియన్లు పీర్లీ టాన్‌, టిన్నా మురళీథరన్‌లను 23-21, 21-15తో మట్టికరిపించారు. కానీ సుదిర్మన్‌ కప్‌లో వరుస గేముల్లోనే గాయత్రి, ట్రెసా పరాజయం పాలయ్యారు. మలేషియాతో మ్యాచ్‌లో సింధు మినహా మరో షట్లర్‌ మూడు గేముల పాటు పోరాడలేదు. చైనీస్‌ తైపీతో మ్యాచ్‌లో హెచ్‌.ఎస్‌ ప్రణరు మినహా మరొకరు మూడో గేమ్‌ ఆడలేదు. గాయత్రి, ట్రెసా టైనీస్‌ తైపీపై మహిళల డబుల్స్‌లో విజయం సాధించటమే అతిపెద్ద ఊరట.
అదే అసలు సమస్య! : చైనీస్‌ తైపీ, మలేషియాలు ఉత్తమ జట్టు. ఆ జట్ల చేతిలో ఓడటం అనూహ్యం ఏమీ కాదు. కానీ ఓటమి వ్యత్యాసమే బాధాకరం. భారత్‌ మరీ 1-4, 0-5 తేడాతో ఓడాల్సిన జట్టు కాదు. భారత షట్లర్లలో పోరాట స్ఫూర్తి కనుమరుగైంది. ఈ రెండు మ్యాచుల్లో భారత్‌ ఆశించిన పోరాటం చేయలేదు. అందుకు కారణం భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు నిలకడ చూపించలేదు. థామస్‌ కప్‌లో ముగ్గురు ఉత్తమ మెన్స్‌ సింగిల్స్‌ షట్లర్లు భారత్‌కు ఆడారు. ఆ వెసులుబాటు సుదిర్మన్‌ కప్‌లో లేదు. ప్రణరు మినహా ఎవరూ ప్రస్తుతం ఫామ్‌లో లేరు. కిదాంబి శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌-20ల్లో కూడా చోటు కోల్పోయారు. సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టిలు ఏ రెండు వరుస టోర్నీల్లో నిలకడగా రాణించలేదు. ప్రత్యేకించి ప్రపంచ చాంపియన్లు మలేషియా జోడీపై మనోళ్లకు మంచి రికార్డు లేదు. సింధు గాయం నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే మళ్లీ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తుంది. చైనీస్‌ తైపీతో మ్యాచ్‌లో తైజుయింగ్‌కు గట్టి పోటీనిచ్చిన సింధు.. వరల్డ్‌ నం.30 మలేషియా షట్లర్‌ చేతిలో ఓడటం అనూహ్యమే. ఆసియా క్రీడలు, పారిస్‌ 2024 ఒలింపిక్స్‌ అర్హత ప్రక్రియ ముంగిట సుదిర్మన్‌ కప్‌ ఓటమి నుంచి భారత బ్యాడ్మింటన్‌ పాఠాలు నేర్చుకోవాలి. బలహీనతలను అధిగమించేందుకు అవసరమైన కార్యాచరణ అవసరం. అప్పుడే ఆసియా క్రీడల్లో, పారిస్‌ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ నుంచి భారత్‌ పతకాలు ఆశించగలదు!.

Spread the love